ఫీజు.. ఫ్రీజ్‌

20 Jan, 2017 22:46 IST|Sakshi
- విద్యార్థులకు అందని ఫీజు, ఉపకార వేతనాలు
- ఫ్రీజింగ్‌తో ట్రెజరీలో మూలుగుతున్న బిల్లులు
- బడుగు విద్యార్థులతో ప్రభుత్వ ఆటలు
- మరో మూడు నెలల్లో ముగుస్తున్న విద్యా సంవత్సరం
 
కర్నూలు(అర్బన్‌): బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆటలు ఆడుకుంటోంది. వారికి సకాలంలో చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాల విషయంలో అంకెల గారడీ చేస్తోంది. ఫీజుల రూపంలో ఆయా వర్గాలకు చెందిన విద్యార్థులకు కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నట్లు ప్రకటిస్తుందే తప్ప క్షేత్ర స్థాయిలో ఏమి జరుగుతుందో అనే విషయాలను పట్టించుకోవడం లేదు. ఆయా సంక్షేమ శాఖలకు చెందిన ఉన్నతాధికారుల నుంచి కాగితాలపై విడుదల చేస్తున్న మొత్తాలను చూసి సంబంధిత జిల్లా అధికారులు ఆఘమేఘాల మీద బిల్లులను తయారు చేసి ట్రెజరీలకు పంపుతున్నారు. తీరా ట్రెజరీలకు వెళ్లిన బిల్లులకు మోక్షం లభించడం లేదు. కారణమేమిటని విచారిస్తే ఎలాంటి బిల్లులు పాస్‌ చేయరాదని ప్రభుత్వం ఫ్రీజింగ్‌ విధించినట్లు సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు. ఒకవైపు కుడిచేత్తో కోట్ల రూపాయలను విడుదల చేస్తున్న ప్రభుత్వం.. మరోవైపు ఎడమచేత్తో ఫ్రీజింగ్‌ను విధిస్తోంది. దీంతో ఇంటర్మీడియట్‌ నుంచి పీజీ, మెడికల్‌ తదితర ఉన్నత విద్యలను అభ్యసిస్తున్న బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ, మైనారిటీ విద్యార్థులకు నేటి వరకు ఎలాంటి ఫీజులు విడుదల కాలేదు. మరో మూడు నెలల్లో పలు కోర్సులకు సంబంధించి విద్యా సంవత్సరం ముగుస్తోంది. అలాగే మార్చిలో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న కారణంగా ఆ నెలలో అన్ని రకాల బిల్లులను ప్రభుత్వం సాధారణంగానే నిలిపివేస్తుంది. దీంతో ఈ విద్యా సంవత్సరంలోనైనా విద్యార్థులందరకీ సరైన సమాయానికి ఫీజులు, ఉపకార వేతనాలు అందుతాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా ట్రెజరీ కార్యాలయానికి ఈ నెల మొదటి వారంలోనే ఎస్‌సీ, బీసీ, ఎస్‌టీ సంక్షేమ శాఖలకు నుంచి బిల్లులు వెళ్లాయి. అయితే ప్రభుత్వం.. ఫ్రీజింగ్‌ విధించిన కారణంగా ఒక్క బిల్లు కూడా మంజూరుకు నోచుకోలేదు. 
 
విడుదలైన బడ్జెట్‌ ఇదీ..
జిల్లాలో 29,046 మంది ఎస్‌సీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 23,127 మందికి ఫీజు, ఉపకార వేతనాలు మంజూరు అయ్యాయి. ఈ శాఖకు ఆర్‌టీఎఫ్‌ కింద రూ.15,64,84,606, ఎంటీఎఫ్‌ కింద రూ.6,81,75,405 విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం తెలియజేసింది. అలాగే 55,933 మంది బీసీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 44,720 మందికి, ఈబీసీ విద్యార్థులు 11,997 మంది దరఖాస్తు చేసుకోగా 9907 మందికి మంజూరు చేశారు. ఈ శాఖకు బీసీ విద్యార్థుల ఆర్‌టీఎఫ్‌కు రూ.59,31,76,000, ఈబీసీ విద్యార్థుల ఆర్‌టీఎఫ్‌కు రూ.26,14,32,000, బీసీ విద్యార్థుల ఎంటీఎఫ్‌కు రూ.31,08,59,000 విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం తెలియజేసింది. అలాగే 2736 మంది గిరిజన విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 1946 మందికి ఫీజును మంజూరు చేశారు. వీరికి ఆర్‌టీఎఫ్‌ కింద రూ.1,55,50,000, ఎంటీఎఫ్‌ కింద రూ.1,15,50,000 విడుదల చేశారు. ప్రభుత్వం నుంచి కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లు వచ్చిన సమాచారం ఆధారంగా బిల్లులను ట్రెజరీకి పంపించారు. ఫ్రీజింగ్‌ కారణంగా అవి విడుదల కాలేదు.
 
హాల్‌టిక్కెట్లు ఇస్తారో లేదో:  బీ పవన్‌కుమార్, బీటెక్‌ ఫైనలియర్‌
దరఖాస్తు చేసుకున్న విద్యార్థులందరికీ ప్రభుత్వం సకాలంలో ఫీజులు, ఉపకార వేతనాలను అందించాలి. మరో రెండు నెలల్లో విద్యా సంవత్సరం పూర్తవుతుంది. ఫైనలియర్‌ పరీక్షలు కూడా దగ్గరపడుతున్నాయి. ఫీజులను విడుదల చేయకుంటే కళాశాల యాజమాన్యాలు హాల్‌ టిక్కెట్లు ఇచ్చే విషయంలో ఇబ్బందులకు గురి చేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో అనేక మంది పేద వర్గాలకు చెందిన విద్యార్థులు ఫీజులు చెల్లించలేక విద్యా సంవత్సరాన్ని కోల్పోవాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చు. 
 
వేలిముద్రలు తీసుకోలేదు: ఆర్‌ మహేష్, బీటెక్‌ ఫైనలియర్‌
నిర్ణీత సమయంలోనే  ఫీజు, ఉపకార వేతనాలకు సంబంధించి దరఖాస్తు చేసుకున్నాను. కానీ ఇంతవరకు తన వేలిముద్రలు కూడా తీసుకోలేదు. ఈ విద్యాసంవత్సరంలో ఫీజు, ఉపకార వేతనాలు విడుదలవుతాయో లేదో అనే భయం పట్టుకుంది. ఒకవేళ ఫీజు విడుదల కాకపోతే పరిస్థితి ఏమిటనే ఆందోళనతో ఉన్నాం. పేద విద్యార్థులకు సంబంధించి ప్రభుత్వం వెంటనే ట్రెజరీల్లో ఆంక్షలను ఎత్తివేసి ఫీజులు, ఉపకార వేతనాలను విడుదల చేయాలి. 
 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు