భూ వివాదాలకు చెక్‌ పెట్టేందుకు నూతన విధానం

12 Dec, 2016 14:22 IST|Sakshi
భూ వివాదాలకు చెక్‌ పెట్టేందుకు నూతన విధానం
అనంతపురం అర్బన్ : భూముల రిజిస్ట్రేషన్లలో వివాదాలకు చెక్‌ పెట్టేందుకు జిల్లా అధికార యంత్రాంగం నూతన విధానానికి శ్రీకారం చుడుతోంది. రిజిస్ట్రేషన్ కు ముందే భూములను సబ్‌డివిజన్ చేయడం ఇందులో కీలకాంశం. ఈ విధానం అమలుకు తొలిదశగా జిల్లాలోని ఐదు రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఒక్కొక్క మండలాన్ని ఎంపిక చేశారు. ఈ విధానం ఇక్కడ తీసుకొస్తే రాష్ట్రంలోనే ప్రప్రథమంగా అమలు చేసిన జిల్లాగా అనంతపురం నిలుస్తుంది.  
రిజిస్ట్రేషన్ కన్నా ముందే సబ్‌డివిజన్
నూతన విధానం కర్ణాటక తరహాలో ఉంటుంది. రిజిస్ట్రేషన్ కు ముందే  రెవెన్యూ యంత్రాంగం భూమికి సంబంధించి సబ్‌డివిజన్ పూర్తి చేస్తుంది. విక్రయదారులు ఇద్దరూ సర్టిఫైడ్‌ స్కెచ్‌ పొందిన తరువాతే భూమి రిజిస్ట్రేషన్ అవుతుంది. సర్వే చేయడం ద్వారా విక్రయించే వ్యక్తికి క్షేత్ర స్థాయిలో ఎంత భూమి ఉంది.. తనకు ఉన్నదానినే విక్రయించేందుకు సిద్ధపడ్డాడా, లేదా అనేది స్కెచ్‌ ద్వారా తెలుస్తుంది. భూమి విస్తీర్ణం, దాని హద్దులు (చెక్‌బందీ) సర్టిఫైడ్‌ స్కెచ్‌లో ఉంటాయి.  ప్రస్తుతం భూ విస్తీర్ణం, చెక్‌బందీతో సంబంధం లేకుండా డాక్యుమెంట్ల ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. విక్రయదారుడు చూపిన విస్తీర్ణం క్షేత్ర స్థాయిలో లేకపోతే వివాదం తలెత్తుతోంది. ప్రధానంగా భాగపరిష్కార ఆస్తులను  లేదా ఉన్న భూమిలో కొంత భాగాన్ని అప్పటికే విక్రయించిన సందర్భాల్లో  వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొనుగోలు చేసిన వారు  క్షేత స్థాయిలోకి వెళ్లి భూమిని స్వాధీనం చేసుకునే క్రమంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు.ఇలాంటి వివాదాలు కోర్టుల పరిధిలో చాలానే ఉన్నాయి.  
 
మొదటి విడతగా ఐదు మండలాల్లో... 
నూతన విధానాన్ని మొదటి విడతగా ఐదు మండలాల్లో ప్రారంభించనున్నారు. అనంతపురం రెవెన్యూ డివిజన్లో శింగనమల మండలం, ధర్మవరం డివిజన్లో చెన్నే కొత్తపల్లి, పెనుకొండ డివిజన్లో మడకశిర, కళ్యాణదుర్గం డివిజన్లో రాయదుర్గం, కదిరి రెవెన్యూ డివిజన్లో బుక్కపట్నం మండలాలను ఎంపిక చేశారు. 
  
మరిన్ని వార్తలు