హామీల అమలులో ప్రభుత్వాల నిర్లక్ష్యం

5 Oct, 2016 19:23 IST|Sakshi
–కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి విమర్శ
తాళ్లపూడి: ప్రత్యేక హోదాపై ద్రోహం, హమీల అమలులో వంచన, పాలనలో అన్నింటా వైఫల్యాలు ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రెండేళ్ల పాలన సాగించిన తీరని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ఇన్‌చార్జి పనబాక లక్ష్మి విమర్శించారు. మండలంలోని పెద్దేవంలో బుధవారం నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ విస్తత స్థాయి సమావేశం నిర్వహించారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా పార్టీలు  ఇచ్చిన లేఖలు, టీడీపీ, బీజేపీ రెండేళ్ల పాలన లోపాలను తెలుపుతూ రూపొందించిన కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో ఐదేళ్లు కాదు పదేళ్లు హోదా కావాలని డిమాండ్‌ చేసిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, 15 ఏళ్లు హోదా ఇవ్వాలని తిరుపతి ఎన్నికల సభలో చంద్రబాబు డిమాండ్‌ చేశారని, వీరంతా ప్రసుత్తం ప్రజలను మోసం చేశారన్నారు. ఇటీవల కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహించిన ప్రజాబ్యాలెట్‌లో 99 శాతం మంది ప్రత్యేక హోదా కావాలన్నారని, 97 శాతం మంది ఎన్నికల హమీలను ప్రభుత్వం అమలు చేయడంలేదని తీర్పు ఇచ్చారన్నారు. మాజీ ఎమ్మెల్సీ గంగాభవానీ, డీసీసీ అధ్యక్షుడు ఎండీ రఫీఉల్లాబేగ్‌ మాట్లాడుతూ పింఛన్లు, ఇళ్లు, ఇలా అన్ని సంక్షేమ పథకాలకు జన్మభూమి కమిటీలు చెప్పిన వారినే లబ్ధిదారులుగా ఎంపిక చేస్తున్నారన్నారు. జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు పాకలపాటి సుభద్ర, పీసీసీ కార్యదర్శులు గెడ్డం సాయిబాబా, జ్యేష్ట సతీష్, తాళ్లపూడి, కొవ్వూరు, చాగల్లు మండలాల అధ్యక్షులు పోసిన రాజారావు, వెంపాటి సూర్యారావు, గండ్రోతు సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.  
 
హోదాపై మాటమార్చిన నేతలు 
అచ్చన్నపాలెం (నల్లజర్ల): ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో  కేంద్రమంత్రులు వెంకయ్య, అరుణ్‌జైట్లీ మాట మార్చారని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ఇన్‌చార్జ్‌ పనబాక లక్ష్మి అన్నారు. గోపాలపురం నియోజకవర్గ కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశం బుధవారం అచ్చన్నపాలెంలో కన్వీనర్‌ ఖండవల్లి కష్ణవేణి అధ్యక్షతన జరిగింది. రాష్ట్ర విభజన విషయంలో అన్ని పార్టీలు లేఖలు అనుకూలంగా ఇచ్చి ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీని తప్పుపట్టడం సరికాదన్నారు. కంబాల గంగాభవానీ, మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అమర్‌ జహభేగం, జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు పెద్దిరెడ్డి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు