వైకల్యాన్ని అధిగమించి.. క్రికెట్ లో 'శ్రద్ధ' .. | Sakshi
Sakshi News home page

వైకల్యాన్ని అధిగమించి.. క్రికెట్ లో 'శ్రద్ధ' ..

Published Wed, Oct 5 2016 7:17 PM

వైకల్యాన్ని అధిగమించి.. క్రికెట్ లో 'శ్రద్ధ' .. - Sakshi

రాయపూర్ః మాట, వినికిడి శక్తి లేకపోయినా ఆత్మ విశ్వాసమే ఆమెను ముందుకు నడిపించింది. ఎనిమిదేళ్ళ వయసునుంచే తన సోదరుడితో కలసి ఎంతో ఇష్టంగా క్రికెట్ చూసేది.  చిన్నతనంనుంచే క్రీడలపట్ల  ఉన్న అభిమానం క్రికెటర్ గా మార్చింది. మీడియమ్ పేసర్ గా ప్రారంభమైన శ్రద్ధా వైష్ణవ్ క్రికెట్ జీవితం.. ప్రస్తుతం లెగ్ స్పిన్నర్  గా రాణిస్తోంది. నోట మాటలు రాకపోయినా, చెవులు వినిపించకపోయినా  సాధారణ క్రీడాకారిణులకు ఏమాత్రం తీసిపోని సత్తా చూపిస్తోంది. వైకల్యం కలిగి, సాధారణ క్రికెట్ జట్టుకు ఎంపికైన దేశంలోనే మొట్టమొదటి క్రీడాకారిణిగా పేరు తెచ్చుకుంది.

చత్తీస్ ఘఢ్ లోని బిలాస్ పూర్ కు చెందిన 18 ఏళ్ళ శ్రద్ధా వైష్ణవ్ 90 శాతం వినికిడి శక్తి లేకుండా పుట్టింది. దీనికి తోడు మాటలు కూడా రాలేదు. అయితే వైకల్యాలను లెక్క చేయని శ్రద్ధ తనకిష్టమైన క్రికెట్ లో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చింది. ఎనిమిదేళ్ళ వయసునుంచే అన్నతోపాటు టీవీలో వచ్చే క్రికెట్ ను ఎంతో ఇష్టంగా చూసిన ఆమె.. తానుకూడా క్రికెట్ ఆడాలని  నిశ్చయించుకుంది. మొదట్టో సరదాగా ప్రారంభించిన ఆటలో.. ఆమె చూపుతున్న ఇష్టాన్ని కుటుంబ సభ్యులు గమనించారు. దాంతో ఆమెను క్రికెట్ కోచింగ్ లో చేర్పించారు. 13 ఏళ్ళ వయసులో ఆటను ప్రారంభించిన శ్రద్ధ ముందు స్పిన్నర్ గానూ, మీడియమ్ పేసర్ గానూ ఆడేది. బిలాస్ పూర్ లో మోహన్ సింగ్ ఠాకూర్ పర్యవేక్షణలో శిక్షణ పొందిన శ్రద్ధ.. ముందుగా కొన్ని ప్రాంతీయ క్రికెట్ మ్యాచుల్లో ఆడింది. వైక్యల్యం ఉందన్న విషయం ఏమాత్రం తెలియకుండా, ఎంతో పట్టుదలతో సాధారణ క్రీడాకారులతో సమానంగా ప్రతిభను ప్రదర్శించింది. క్రమంగా చత్తీస్ ఘడ్ ఉమెన్స్ క్రికెట్ టీమ్ కు ఎంపికైంది.

స్పిన్ బౌలింగ్ లో సత్తాను చాటడంతోనే శ్రద్ధ రాష్ట్ర స్థాయి క్రికెట్ జట్టును చేరుకోగలిగింది. ఆమె అసామాన్య, అద్భుత విజయం ఎందరికో స్ఫూర్తి నిస్తోందని కోచ్ అనిల్ ఠాకూర్ అంటున్నారు. శ్రద్ధ సక్సెస్ స్టోరీ తెలుసుకున్న  సుమారు 15 మంది బాలికలు తమ క్రికెట్ అకాడమీలో చేరినట్లు చత్తీస్ ఘడ్ స్టేట్ క్రికెట్ సంఘం ప్రెసిడెంట్ బల్దియో సింగ్ తెలిపారు. అలాగే క్రికెట్ ఆడాలనుకునే ఎంతోమంది బాలికలకు శ్రద్ధ స్ఫూర్తిగా నిలుస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

శ్రద్ధ ఆటలో ఎంతో అరుదైన పరిపక్వత కనిపిస్తుందని ఆమె కోచ్ ఠాకూర్ అన్నారు.  మొదట్లో ఆమె టీం సభ్యులు శ్రద్ధను సరిగా అర్థం చేసుకోలేదని, దాంతో కొంత ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పిన ఠాకూర్..  ప్రస్తుతం ఆమె బౌలింగ్ చూసి అంతా ఆశ్చర్యపోతున్నారన్నారు. ఆమె క్రికెట్ కెరీర్ కు తమ పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement