ఇంగ్లిష్ నేర్పిస్తాం!

4 Jun, 2016 03:38 IST|Sakshi
ఇంగ్లిష్ నేర్పిస్తాం!

జిల్లాలో 317 స్కూళ్లు  ఆంగ్ల మాధ్యమానికి అంగీకారం
ఒక్క పరిగి నియోజకవర్గంలోనే 54 స్కూళ్లలో అమలు
హర్షం వ్యక్తం చేస్తున్న ఆయా గ్రామాల ప్రజలు
తీర్మానాలు చేసి విద్యాశాఖకు పంపిన
గ్రామాల్లోని మూడు కమిటీలు  పుస్తకాల పంపిణీ
ఇతర సౌకర్యాలపై  ప్రభుత్వం నుంచి  లేని స్పష్టత

ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇంగ్లిష్‌లో విద్యాబోధన చేసేందుకు పలు స్కూళ్ల ఉపాధ్యాయులు ముందుకొస్తున్నారు. మేం నేర్పిస్తామంటూ స్వచ్ఛందంగా తీర్మానాలు చేస్తున్న పాఠశాలల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 317 స్కూళ్లు ఆంగ్ల మాధ్యమానికి అంగీకరిస్తూ తీర్మానం చేశాయి. ఒక్క పరిగి నియోజకవర్గంలోనే 54 పాఠశాలల ఉపాధ్యాయులు ఇంగ్లిష్ బోధనకు అంగీకరించారు. అయితే అందుకు ప్రభుత్వం కల్పించాల్సిన సౌకర్యాలు, పుస్తకాల పంపిణీ తదితర అంశాలపై ఇంకా స్పష్టత రాలేదు.

 పరిగి: ఈ విద్యాసంవత్సరం నుంచే పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం చదువులు అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వం నుంచి తప్పనిసరి నిబంధన లేకున్నా.. ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులే స్వచ్ఛందంగా చొరవ తీసుకుని ఇంగ్లిష్ మీడియం బోధనను అమలు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం అమలు చేయాలంటే ఉపాధ్యాయులు, ఎస్‌ఎంసీ  కమిటీ, గ్రామ పంచాయతీలు వేర్వేరుగా మూ డు తీర్మానాలు చేసి విద్యా శాఖకు పంపాల్సి ఉంటుంది.

జిల్లా వ్యాప్తంగా 317 పాఠశాలలకు సంబంధించిన తీర్మానాలు విద్యాశాఖకు అందాయి. అయితే ఈ ఏడాది 1వ తరగతితో ఇంగ్లిష్‌లో విద్యాబోధన ప్రారంభం కానుంది. వీరు పై తరగతులుకు వెళ్తున్నాకొద్ది ఇంగ్లిష్ మీడియంలోనే చదువుకుంటూ వెళ్తుంటారు. ఇలా ప్రాథమిక పాఠశాల ఐదేళ్లలో పూర్తిస్థాయి ఇంగ్లిష్ మీడియం స్కూల్‌గా తయారవుతుంది.

 ఈ సారికి స్వచ్ఛందంగానే..
ప్రభుత్వ ఉన్నత పాఠశాలలలో ఇప్పటికే ‘సక్సెస్’ పేరుతో ఆంగ్లంలో బోధన కొనసాగుతోంది. ఐదేళ్లలో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు కూడా అన్ని తరగతులను ఆంగ్ల మాధ్యమంలోకి తీసుకొస్తే.. ఇక ప్రభుత్వ పాఠశాలలన్నీ ఇంగ్లిష్ మీడియంలోకి మారనున్నాయి. అయితే ప్రాథమిక పాఠశాలల్లో ప్రస్తుత ఆంగ్ల బోధన అధికారికంగా మాత్రం కాదు. కేవలం ఆ పాఠశాల, ఆ పాఠశాల పరిధి గ్రామస్తులు, ఎస్‌ఎంసీ కమిటీల కోరిక మేరకే స్వచ్ఛందంగా మొదటి తరగతిలో ఈ ఆంగ్ల మాధ్యమాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. గతంలో అధికారికంగా ఉన్నత పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రారంభించిన సక్సెస్ స్కూళ్లు అంతగా సక్సెస్ కాలేదన్న అభిప్రాయం ఉంది. దీంతో పూర్తిస్థాయి అధికారిక ఆంగ్లమాధ్యమానికి ప్రభుత్వం వెనకాడుతోందన్న అనుమానాలున్నాయి. స్వచ్ఛంద ఆంగ్ల బోధన ఫలితాలనిస్తే.. వచ్చే ఏడాది నుంచి అధికారిక అమలు ఉండొచ్చని భావిస్తున్నారు.  

 మరి పుస్తకాలు..?
జిల్లాలో 317 స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమం ప్రారంభించేందుకు ఆయా పాఠశాలలు ముందుకు వచ్చినప్పటికీ ఆంగ్ల మాధ్యమం పుస్తకాలు విద్యా శాఖ పంపిణీపై స్పష్టత లేదు. ఇప్పటికైతే పుస్తకాలు లేవు.. వీలును బట్టి సరఫరా చేస్తామని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. కేవలం ప్రాథమిక పాఠశాలల్లోని మొదటి తరగతిలోనే ఆంగ్ల మాధ్యమాన్ని ఈ సారి పరిచయం చేస్తున్నారు. ఒకటో తరగతికి ఉండేది తెలుగు, ఆంగ్లం. మొత్తం రెండు పుస్తకాలు మాత్రమే. తెలుగు ఎలాగూ తెలుగులోనే కాబట్టి ఒక్క గణితం పుస్తకం మాత్రమే ఆంగ్లంలో ఉంటే సరిపోతుంది. ఈ నేఫథ్యంలో ఈ సిలబస్‌నే ఆంగ్లంలోకి తర్జుమా చేసుకుని ఈ సంవత్సరానికి కానివ్వాలని విద్యాశాఖ పేర్కొంటోంది. ఏదిఏమైనా ఆంగ్ల మాధ్యమం లేనందునే విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరడంలేదని ఉపాధ్యాయులు చేస్తున్న వాదనను వారు సమర్థించుకోవాలంటే ఈ ఆంగ్ల మాధ్యమ పాఠశాలలను సక్సెస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 పరిగి నియోజకవర్గంలోనే అధికం..
పరిగి నియోజకవర్గంలో 54 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఆంగ్ల మాధ్యమంలోకి ప్రవేశించనున్నాయి. మొదటి తరగతిలో చేరే వారికే ఈ ఆంగ్ల మాధ్యమం అందుబాటులో ఉండనుంది. ఆ తరగతిలో చేరే విద్యార్థులు అప్‌గ్రేడ్ అవుతూ పోతే వచ్చే ఐదు సంవత్సరాల్లో ఆ పాఠశాలలన్నీ పూర్తిస్థాయి ఆంగ్ల మాధ్యమ స్కూళ్లుగా అవతరిస్తాయి.

 ఇవి సక్సెస్ అయితేనే..
ఈ సారి పరిగి నియోజకవర్గంలో 54 పాఠశాలల ఉపాధ్యాయులు ఆంగ్ల మాధ్యమంలో బోధించేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఇందులో పరిగి మండలంలో 11, దోమలో 11, కుల్కచర్లలో 11, గ ండేడ్‌లో 10, పూడూరులో 11 పాఠశాలలు ఉన్నాయి. ఈ సంవత్సరం ఈ పాఠశాలలు సమాజానికి, తల్లిదండ్రులకు నమ్మకం కల్గించగలిగితే వీటికి భవిష్యత్తు ఉంటుంది. లేదంటే మరో మారు నమ్మకం కోల్పోవాల్సి వస్తుంది. అందుకే ఉపాధ్యాయులు, హెచ్‌ఎంలు ప్రత్యేక చొరవ తీసుకుని సక్సెస్ చేయాలి. తల్లిదండ్రులు, జీపీలు, ఎస్‌ఎంసీ కమిటీల భాగస్వామ్యం, విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ అవసరం.   - హరిశ్చందర్, డిప్యూటీ ఈఓ

మరిన్ని వార్తలు