రుద్రవరం రేంజ్‌లో పెద్దపులులు

12 Dec, 2016 14:48 IST|Sakshi
చెలిమ రేంజ్‌లో కెమెరాకు దొరికిన పెద్దపులి
–నంద్యాల డివిజన్‌లో 12 పులుల గుర్తింపు 
–పులుల గుర్తింపుకు రుద్రవరం, చెలిమ రేంజిల్లో సిసి కెమెరాలు ఏర్పాటు 
 
రుద్రవరంం: రుద్రవరం అటవీ సబ్‌డివిజన్‌ పరిధిలో పెద్దపులులు సంచరిస్తున్నాయి. ఇప్పటి వరకు   బడిఆత్మకూరు, నంద్యాల, గుండ్ల బ్రమ్మేశ్వరం రేంజ్‌ల పరిధిలోని బైరేని, బండి ఆత్మకూరు, గుండ్ల బ్రమ్మేశ్వరం, గడి గుండం, పున్నాగి కుంట, ఓంకారం, రామన్న పెంట ప్రాంతాల్లోనే అవి ఉండేవి. దీంతో ఆయా ప్రాంతాల పరిధిలోని అడవిలోనికి ఎవరూ వెళ్లకుండా అధికారులు చర్యలు తీసకుంటునా​‍్నరు. అయితే,  ఈ మధ్యకాలంలో రుద్రవరం, చెలిమ రేంజ్‌లలో పెద్ద పులులు  సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు గుర్తించారు. దీంతో ఆ రేంజ్‌లో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఊహించనట్టుగానే చెలిమ బీటులో పెద్ద పులి కెమెరా కంటపడింది. రుద్రవరం రేంజ్‌ పరిధిలోని ఊట్ల, గారెల్ల ప్రాంతంలో పెద్ద పులుల అడుగులు గుర్తించినట్లు రేంజర్‌ రామ్‌ సింగ్‌ వెల్లడించారు. మొత్తం ఇక్కడ ఎన్ని పులులు ఉన్నాయో గుర్తించేందుకు మరిన్ని సీసీ కెమెరాలు కావాలని ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు.
పెద్ద పులుల సంచారంతో వెదురు సేకరణ నిలిపివేత
  చెలిమ, రుద్రవరం రేంజ్‌ల పరిధిలో పెద్దపులి సంచారంతో నాలుగు కూపుల్లో వెదురు సేకరణను అటవీ అధికారులు నిలిపి వేశారు. చెలిమ రేంజ్‌లో దొంగ బావి, బసువాపురం కూపులను నిలిపి వేయగా రుద్రవరం రేంజ్‌ పరిధిలోని ఊట్ల, గారెల్ల ప్రాంతాల్లో పెద్ద పులుల అడుగులు పడటంతో అక్కడ కూడా వెదురు సేకరణను నిలిపి వేశారు. ఈ విషయాన్ని చుట్టు పక్కల గ్రామాల ప్రజలు గమనించి వాటి మనుగడకు భంగం కలగకుండా సహకరించాలని డీఎఫ్‌ఓ శివప్రసాదు కోరారు.నంద్యాల అటవీ డివిజన్‌ పరిధిలో ఇప్పటి వరకు మొత్తం 12 పెద్దపులులను గుర్తించినట్లు తెలిపారు. 
 
మరిన్ని వార్తలు