నేడు సీఎం చంద్రబాబు పోతవరం రాక

27 Apr, 2017 21:10 IST|Sakshi
నేడు సీఎం చంద్రబాబు పోతవరం రాక
నల్లజర్ల : స్మార్ట్‌ విలేజ్‌గా ఎంపికై అభివృద్ధి పనులు పూర్తి చేసిన పోతవరం గ్రామాన్ని సీఎం చంద్రబాబు శుక్రవారం సందర్శించనున్నారు. సీఎం చంద్రబాబు జిల్లా పర్యటన ఖరారైనట్టు కలెక్టర్‌ భాస్కర్‌ గురువారం నల్లజర్లలో వెల్లడించారు. జిల్లా అధికారులు, జెడ్పీ చైర్మన్‌ బాపిరాజు, ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరావు తదితర ప్రజాప్రతినిధులతో సీఎం పర్యటన ఏర్పాట్లను సమీక్షించారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు సీఎం హెలికాఫ్టర్‌లో పోతవరం చేరుకుంటారు. హెలీప్యాడ్‌ పక్కనే బలహీనవర్గాల కోసం 6 ఎకరాల భూమిలో జీప్లస్‌ త్రీ గృహ నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం మహిళా సమాఖ్య, యువజన సమాఖ్య నూతన భవనాలు ప్రారంభిస్తారు. అనంతరం పాత్రుని చెరువు అభివృద్ధి పనులు పరిశీలిస్తారు. అక్కడే పీహెచ్‌సీ, నీరు-చెట్టు పైలాన్లను ఆవిష్కరిస్తారు. అనంతరం గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభిస్తారు. తదుపరి హైస్కూల్‌ అదనపు తరగతి గదులు, కాంపౌండ్‌ వాల్‌ ప్రారంభించి అక్కడే గ్రామస్తులతో ముఖాముఖి సమావేశం నిర్వహిస్తారు. అనంతరం రోడ్డు మార్గంలో ర్యాలీగా కవులూరు, చీపురుగూడెం, తిమ్మన్నపాలెంలో అభివృద్ధి పనులు పరిశీలిస్తారు. నల్లజర్ల హైస్కూల్‌లో 15 వేల మందితో నీరు-చెట్టు జలసంరక్షణపై సమావేశం నిర్వహిస్తారు. అనంతరం నల్లజర్లలో నల్ల-ఎర్ర చెరువు వద్ద పార్క్‌ను ప్రారంభిస్తారు. అనంతరం  ఏకేఆర్‌జీ కళాశాల పక్కన ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌ నుంచి రాజధానికి బయలుదేరి వెళతారని కలెక్టర్‌ వివరించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఎంపీపీ జమ్ముల సతీష్, జెడ్పీటీసీ కొఠారు అనంతలక్ష్మి, పోతవరం, నల్లజర్ల సర్పంచ్‌లు పసుమర్తి రతీష్, యలమాటి శ్రీనివాసరావు ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్వాగత సన్నాహాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. 
మరిన్ని వార్తలు