కొండెక్కిన టమాటా

8 Nov, 2015 02:39 IST|Sakshi
కొండెక్కిన టమాటా

♦ కిలో ధర రూ.50కి పైనే.. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి
♦ వర్షాభావంతో సాగు పడిపోవడం, తెగుళ్లతో దిగుబడి తగ్గడమే కారణం
♦ విలవిల్లాడుతున్న సామాన్య, మధ్యతరగతి వినియోగదారులు
 
 సాక్షి నెట్‌వర్క్: మొన్న ఉల్లి.. నిన్న కందిపప్పు.. ఇప్పుడు టమాటా ధరలు కొండెక్కి కూర్చున్నాయి. రెండు మూడు రోజులుగా సామాన్య, మధ్యతరగతి వినియోగదారులను ఠారెత్తిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రిటైల్ మార్కెట్లో టమాటా ధర కిలో రూ.50కి చేరుకుంది. ధరలు తక్కువగా ఉండే రైతు బజార్లలోనే రూ. 40 దాటిపోవడం గమనార్హం. మరికొద్ది రోజుల పాటు మార్కెట్లో టమాటా ధరలు అస్థిరంగానే ఉండవచ్చని వ్యాపారులు చెబుతున్నారు. ఎండలు బాగా ఉండడం, వర్షాభావం కారణంగా బోర్లు, బావుల్లో నీరు ఎండిపోవడంతో హైదరాబాద్ శివారు ప్రాంతాలు, రంగారెడ్డి జిల్లాలోని శంకర్‌పల్లి, శామీర్‌పేట, దౌల్తాబాద్, తూ ప్రాన్, మహేశ్వరం, సరూర్‌నగర్ మండలాల్లో టమాటా సాగు తగ్గిపోయింది. దీనికితోడు తెగుళ్లతో దిగుబడి తగ్గిపోవడంతో... టమాటాకు కొరత ఏర్పడిందని రైతులు చెబుతున్నారు. దీనిని అవకాశంగా తీసుకున్న వ్యాపారులు ధరలు పెంచేశారు. ప్రస్తుతం ఏపీలోని మదనపల్లి నుంచి వచ్చే టమాటా దిగుమతులపైనే హైదరాబాద్ ఆధారపడాల్సి వస్తోంది. మరోవైపు మిగతా కూరగాయల ధరలు కూడా పెరుగుతున్నాయి. పచ్చిమిర్చి, బెండ, బీర, కాకర, చిక్కుడు తదితర కూరగాయల ధరలు కిలో రూ. 30 నుంచి రూ. 35 వరకు చేరాయి.

 జిల్లాల్లోనూ అదే పరిస్థితి..
 సామాన్యులకు అందుబాటులో ఉండే టమా టా ధర జిల్లాల్లోనూ కొండెక్కింది. వర్షాభావంతో టమాటా సాగు తగ్గడం, వేసిన టమాటా పంట కూడా ఎండల ధాటికి ఎండిపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. తాండూరు, వికారాబాద్, పరిగి, చేవెళ్లలో కిలో రూ. 50ని దాటిపోయింది. శనివారం నల్లగొండ జిల్లా భువనగిరిలో కిలో టమాటా ధర రూ. 60 పలికింది. నల్లగొండ పట్టణంలోని మార్కెట్లో రూ.50లకు ఎగబాకింది. స్థానికంగా చిన్న రైతులు పండించిన కొద్దిపాటి లోకల్ టమాటా మాత్రం కిలో రూ. 30 నుంచి రూ.35 మధ్య విక్రయిస్తున్నారు. ఇక కరీంనగర్, నిజామాబాద్ మార్కెట్లలో కిలో టమాటా ధర రూ. 40పైనే పలుకుతోంది.

వర్షాభావానికి తోడు తెగుళ్లతో రెండు జిల్లాల్లోని చాలా చోట్ల టమా టా పంటకు నష్టం జరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో టమాటా ధర పదిహేను రోజుల కింద రూ.15 నుంచి రూ.20 వరకు ఉండగా... ఇప్పుడు దాదాపు మూడింతలు పెరిగి కిలో రూ. 50కి చేరింది. వర్షాభావ పరిస్థితులతో రైతులు టమాటా సాగును చాలా చోట్ల నిలిపివేశారు. ఖమ్మం జిల్లాలో రైతు బజార్లలో శనివా రం టమాటా ధర కిలో రూ.46 పలికింది. రిటైల్ దుకాణాల్లో రూ.52 నుంచి రూ.55 వరకు విక్రయించారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కిలో రూ.10 పలికిన టమాటా ధర నెల రోజుల్లో నాలుగైదు రెట్లు పెరగడం గమనార్హం. టమాటా రేటు బాగా పెరగడంతో వినియోగదారులు బెంబేలు ఎత్తుతున్నారు.

మరిన్ని వార్తలు