Tomato Prices Decreases: ఎగిరెగిరి పడ్డ టమాటా.. ఇప్పుడు ఢీలా!

7 Sep, 2023 16:48 IST|Sakshi

నెల కింది వరకు ఆకాశంలో టమోటా ధరలు

ఒక సమయంలో కిలో రూ.200 దాటిన టమోటా

టమోటా ధరలు పెరిగినప్పుడు రైతులు కోటీశ్వరులు

ఇప్పుడు ఢీలా పడ్డ ధరలు, ఓల్‌ సేల్‌లో కిలో రూ.3

ధరలతో పాటు ఢీలా పడ్డ టమోటా రైతులు

 సాక్షి, కర్నూలు జిల్లా: తెలంగాణలో భారీగా కురుస్తున్న వర్షాల ప్రభావం రాష్ట్రంలో టమాటా ధరలపై పడింది. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా హైదరాబాద్‌లోని మార్కెట్లకు టమాటా చేరడం లేదు. దీంతో టమాటా ధరలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. పత్తికొండ మార్కెట్లో కిలో టమాటా రూ. 4 నుంచి 10 రూపాయలు మాత్రమే పలుకుతోంది.  

ప్యాపిలి మార్కెట్‌లోనూ టమాటా ధరలు  భారీగా పతనమయ్యాయి. కిలో  టమాటా రూ.3 మాత్రమే పలుకుతోంది. ధరలు లేకపోవడంతో టమాటాలను రైతులు మార్కెట్‌కు ఆరుబయటే పారేసి వెళ్లిపోతున్నారు. పచ్చి పంట కావడంతో ఏమీ చేయలేని దుస్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టమాటాలను రోడ్లపైనే పారబోస్తూ కన్నీరు పెట్టుకుంటున్నారు. 

కనీస ధర లేకపోవడంతో డోన్ జాతీయ రహదారిపైనే టమాటాలను ఓ రైతు పారబోశాడు. పారబోసిన టమాటాలను పశువులు తింటున్నాయి. రవాణా ఖర్చులు కూడా రావట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పచ్చి పంట అయినందున ఎక్కడా దాచలేమని రైతులు దిగులు పడుతున్నారు. 

మొన్నటి వరకు కిలో రూ. 200 వరకు పలికిన కిలో టమాటా ఒక్కసారిగా తగ్గిపోయింది. ఇప్పటివరకు ఎన్నో ఆశలతో ఉన్న టమాటా రైతులు.. వర్షాలతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయని చెబుతున్నారు. గత రెండు నెలలుగా ఎగిరెగిరి పడ్డ టమాటా ఇప్పుడిలా ఉల్టా కావడం మళ్లీ హాట్‌ టాపిక్‌ అయ్యింది.

ఇదీ చదవండి: అలా.. ఆంధ్రప్రదేశ్‌కు బోలెడు అవకాశాలు

మరిన్ని వార్తలు