ఆ కనులు కన్నీరు కార్చలేవు..

27 Dec, 2015 23:57 IST|Sakshi
ఆ కనులు కన్నీరు కార్చలేవు..

విధి ఆడిన వింతనాటకం
 అనాథ అయిన పసిగుడ్డు
 ఐసీడీఎస్‌కు అప్పగించిన పోలీసులు

 
 ఆ కనులు కన్నీరు కార్చలేవు.. ఆ పెదాలు అబద్ధాలాడలేవు..ఆ పొట్టకు ఆకలేస్తే అడగలేదు.. ఆ మనసుకి తల్లీతండ్రి అనుబంధాలు కూడా తెలియవు. భూమి మీద పడిన ఆరు నెలలకే ఆ పసికందుతో విధి వింతనాటకం ఆడింది.  తల్లి విగతజీవి అయింది. తండ్రి జైలు పాలయ్యాడు.  కుటుంబంలో జరిగిన అనుకోని సంఘటన   ఆ పసికందును  ఒంటరిని చేసింది. పార్వతీపురం సబ్-ప్లాన్‌లోని  కొమరాడ మండలం, నయ పంచాయతీలోని వనకాబడి గ్రామానికి చెందిన ఊయక చంద్రమ్మ(22),   ఊయక శోభన్న భార్యాభర్తలు. వారికి ఆరునెలల క్రితం మగబిడ్డ జన్మించాడు. ఆ పసికందుకు సాయికుమార్ అని నామకరణం కూడా చేశారు.
 
 ఐసీడీఎస్‌కు అప్పగించిన పోలీసులు...

 ఒంటరిగా మిగిలిపోయిన పసికందును గమనించిన ఎస్సై వి.అశోక్ కుమార్ చలించిపోయారు. దీంతో   ఆయన పార్వతీపురం  ఐసీడీఎస్ సీడీపీఓ కె.విజయగౌరితో పాటు ఏసీడీపీఓ పి.వెంకటలక్ష్మి, సూపర్‌వైజర్లు సీహెచ్ గోవిందమ్మ, ఎస్.శకుంతలమ్మలకు ఆదివారం రాత్రి  పసికందు సాయికుమార్‌ను అప్పగించారు.  
 
 కొమరాడ/: భర్త వేధింపులు భరించలేక ఓ గిరిజన మహిళ ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆమె ఆరు నెలల కుమారుడు అనాథగా మారాడు. మండలంలోని గిరిశిఖర గ్రామమైన నయా పంచాయతీ వనకాబడి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వనకాబడి గ్రామానికి చెందిన వూయక సోబన్న కొద్దిరోజులుగా మద్యం తాగి తన భార్య వూయక చంద్రమ్మ(22)ను వేధిస్తున్నాడు. శనివారం రాత్రి కూడా మద్యం తాగి తీవ్రంగా వేధించాడు. దీంతో భరించలేక చంద్రమ్మ తమ ఇంట్లోని వెన్నుకర్రకు తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయాన్ని ఆదివారం ఉదయం గుర్తించిన స్థానికులు కొమరాడ పోలీసులకు సమాచారం ఇచ్చారు.
 
 ఇన్‌చార్జి ఎస్‌ఐ ఎస్.అశోక్‌కుమార్ సిబ్బందితో కలిసి వచ్చి చంద్రమ్మ మృతికి గల కారణాలను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసిన అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. చంద్రమ్మకు ఆరు నెలల వయసు గల కుమారుడు సాయికుమార్ ఉన్నాడు. తల్లి మరణించడంతో పాలు లేక ఆ బాలుడు రోదిస్తున్న తీరు స్థానికులను కలచివేసింది. ఆ బాలుడిని పెంచేందుకు చంద్రమ్మ, సోబన్న తల్లిదండ్రులు ముందుకురాలేదు. దీంతో ఎస్‌ఐ అశోక్‌కుమార్‌ను ఆ చిన్నారిని చైల్డ్‌లైన్‌కు అప్పగించారు.
 
 భర్తను కఠినంగా శిక్షించాలి : సీపీఎం
 చంద్రమ్మ మృతికి కారణమైన ఆమె భర్త సోబన్నను కఠినంగా శిక్షించాలని సీపీఎం మండల నాయకులు కె.సాంబమూర్తి, ఆర్.చిన్న డిమాండ్ చేశారు. వారు ఆదివారం చంద్రమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాల వల్లే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని, వెంటనే మద్యం విక్రయాలు నిలిపివేయాలని డిమాండ్‌చేశారు.
 

మరిన్ని వార్తలు