అర్ధాకలి బతుకులు

22 Aug, 2016 22:49 IST|Sakshi
వేట సాగక నిలిచిన బోట్లు

సంతబొమ్మాళి: రోజులు మారుతున్నా మత్స్యకారుల బతుకు రాతలు మారడం లేదు. నిత్యం కల్లోల కడలిలో వేట సాగించే మత్స్యకారుల బతుకులు కూడా కల్లోలంగానే ఉంటున్నాయి. మండలంలోని భావనపాడు తీరంలో పదిహేను రోజులుగా చేపలు దొరక్క పోవడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. భావనపాడు గ్రామంలో వంద బోట్లు, 60 తెప్పలు పై నిత్యం వేట సాగిస్తున్నారు. ఒకప్పుడు భావనపాడు తీరంలో చేపలు వ్యాపారం బాగా సాగేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో మత్స్యకారులు ఆలోచనలో పడ్డారు. సముద్రంలో మత్స్య సంపద రోజు రోజుకు తగ్గిపోతోంది. వాతావరణం అనుకూలించక పోవడంతో సముద్రంలో ఇసుక అలలు ఎక్కువ కావడంతో మత్స్య సంపద తగ్గుతోందని మత్స్యకారులు అంటున్నారు. కేవలం సముద్రం పైనే ఆధారపడి బతుకుతున్న మత్స్యకారులకు ఈ పరిస్థితి ఇబ్బందికరమే. ఒక్కో బోటులో 6 నుంచి 8 మంది మత్స్యకారులు వేట కొనసాగిస్తారు. సముద్రంలో సుమారు ఏడు గంటల సమయం పాటు వేట జరుగుతుంది. దీని కోసం డీజిల్, వగైరా ఖర్చులు బోటు రెండు వేల రూపాయల వరకు అవుతుంది. అయితే రెండు వారాలు పాటు మత్స్యసంపద చిక్కక పోవడంతో ఒట్టి చేతులతో తిరిగి ఒడ్డుకు వస్తున్నారు. దీంతో అప్పుల పాలవుతున్నామని మత్స్యకారులు అంటున్నారు. మరికొందరు వలస బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. దీనిపై ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించాలంటూ మత్స్యకారులు కోరుతున్నారు.
 

మరిన్ని వార్తలు