ఉద్యోగాల పేరుతో వసూళ్ల యత్నం?

3 Dec, 2016 22:19 IST|Sakshi
ఉద్యోగాల పేరుతో వసూళ్ల యత్నం?
పోలీసుల అదుపులో ఇద్దరు సంస్థ ఉద్యోగులు
 
గుంటూరు ఈస్ట్‌ : ఉద్యోగాల పేరుతో దరఖాస్తుదారుల నుంచి రూ.1200 చొప్పున రుసుం వసూలు చేస్తున్న ఓ కంపెనీ సిబ్బందిని పట్టాభిపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కొన్ని సెల్‌ఫోన్లు, రూ.43 వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. సీసీఎస్‌ సీఐ రత్నస్వామి తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్‌కు చెందిన సత్యనారాయణ గత నెలలో పేపర్‌ ప్రకటనల ద్వారా శ్రీనివాసులు, అతని భార్యను ఉద్యోగులుగా నియామకం చేసుకున్నాడు. జేకేసీ కళాశాల రోడ్డు మొదట్లోని ఓ భవనం పై అంతస్తులో ఓ గది అద్దెకు తీసుకుని నవంబరు 25వ తేదీన కార్యాలయం ప్రారంభించాడు. ఒమేగా ఫార్మటికల్స్‌ పేరుతో ఆసంస్థలో పనిచేయడానికి ఉద్యోగులు కావాలని పేపర్‌ ప్రకటన ఇచ్చాడు. దీంతో అనేక మంది నిరుద్యోగులు కార్యాలయానికి వెళ్లి దరఖాస్తులు ఇచ్చారు. ఽతమ కంపెనీలో సూపర్‌వైజర్‌కు రూ.18 వేలు జీతం ఇస్తారని, అంతకన్నా తక్కువ ఉద్యోగాలకు రూ.10వేల వరకు జీతాలు ఇస్తారని శ్రీనివాసులు చెప్పాడు. దరఖాస్తు రుసుం ఒక్కొక్కరి నుంచి రూ.1200 వసూలు చేయడం ప్రారంభించాడు. శనివారం ఉదయం ఉద్యోగం కోసమని కార్యాలయానికి వెళ్లిన కొందరికి వీరి వ్యవహారంపై అనుమానం వచ్చింది. శ్రీనివాసులు ఇచ్చిన రసీదుపై ఉన్న కంపెనీ పేరు ఫార్మాసూటికల్స్‌ అని కాకుండా ఫార్మటికల్స్‌ అని ఉండడంతో వారి అనుమానం బలపడింది. దీంతో వారు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అర్బన్‌ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆదేశాల మేరకు సీసీఎస్‌ సీఐ రత్నస్వామి సంఘటనా స్థలానికి చేరుకుని, వచ్చిన అభ్యర్థులను విచారించారు. శ్రీనివాసులు, అతని భార్యను అదుపులోకి తీసుకున్నారు. వారు పొంతన లేని సమాధానాలు చెబుతుండడంతో వారిద్దరినీ పోలీసుస్టేషన్‌కు తరలించారు. వారి వద్ద ఉన్న కొన్ని సెల్‌ఫోన్లు, రూ.43 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
>
మరిన్ని వార్తలు