పెద్దపల్లిలో పట్టుబడ్డ ఇద్దరు ఖైదీలు

10 Sep, 2016 20:36 IST|Sakshi
పెద్దపల్లిలో పట్టుబడ్డ ఇద్దరు ఖైదీలు
  • సహకరించిన ముత్తారం, గౌరెడ్డిపేట యువకులు 
  • పెద్దపల్లి : జిల్లా జైలు నుంచి శుక్రవారం అర్ధరాత్రి పారిపోయిన పార్థీ ముఠాకు చెందిన ఇద్దరు ఖైదీలను పెద్దపల్లి రైల్వేస్టేషన్‌ సమీపంలో శనివారం తెల్లవారుజామున పోలీసులు పట్టుకున్నారు. స్టేషన్‌ సమీపంలోని ముత్తారం, గౌరెడ్డిపేట గ్రామస్తులు ఇద్దరు ఖైదీలను పట్టుకోవడంలో పోలీసులకు సహకరించారు. జిల్లా జైలు నుంచి ఇద్దరు ఖైదీలు తప్పించుకున్నట్లు సమాచారం అందుకున్న పెద్దపల్లి సీఐ మహేశ్‌ వారు రైల్లో పారిపోయే అవకాశం ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు పెద్దపల్లి, రాఘవాపూర్, కొత్తపల్లి పోలీసులను అప్రమత్తం చేశారు. రైల్వే స్టేషన్ల వద్ద నిఘా పెట్టారు. పెద్దపల్లి రైల్వే స్టేషన్‌కు వస్తున్న ఖైదీలు యోగేందర్, జితేందర్‌ అక్కడే ఉన్న పోలీసులను గమనించి పరుగందుకున్నారు. పోలీసులు వారిని వెంబడించారు. ఈ క్రమంలో ముత్తారం, గౌరెడ్డిపేటకు చెందిన యువకులు కూడా పోలీసుల వెంట దొంగలను పట్టుకునేందుకు బయల్దేరారు. గ్రామస్తుల సహకారంతో ఖైదీలను అదుపులోకి తీసుకున్నారు.  
    గ్రామస్తులు, పోలీసులను అభినందించిన ఎస్పీ 
    పార్థీ ముఠా సభ్యులు పెద్దపల్లిలో పోలీసులకు చిక్కిన సమాచారం తెలుసుకున్న ఎస్పీ జోయల్‌ డేవిస్‌ ఇక్కడి పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. ప్రజలకు హాని కలిగిస్తున్న దొంగల ముఠాను పట్టుకోవడంలో పోలీసులకు సహకరించిన ముత్తారం, గౌరెడ్డిపేట గ్రామస్తులను స్టేషన్‌కు ఆహ్వానించి సత్కరించారు. మాజీ ఉప సర్పంచ్‌ కొమురయ్య, ఆటో డ్రైవర్లు అస్గర్, ప్రవీణ్, మరో 14 మందిని అభినందించారు. దొంగలను పట్టుకున్న సీఐ మహేశ్, ఎస్సై శ్రీనివాస్‌తోపాటు కానిస్టేబుళ్లను అభినందించారు. ఎస్పీ వెంట గోదావరిఖని ఎఎస్పీ విష్ణు ఎస్‌.వారియర్‌ ఉన్నారు. 
     
     
మరిన్ని వార్తలు