పోలీసులు వేధింపులు : యువకులు ఆత్మహత్యాయత్నం

15 Aug, 2015 20:06 IST|Sakshi
పోలీసులు వేధింపులు : యువకులు ఆత్మహత్యాయత్నం

వైఎస్సార్ : ఎవరైన వేధిస్తే... సదరు బాధితులు పోలీసుల వద్దకు వెళ్లి తమ గోడు చెప్పుకంటారు. మరి అలాంటిది.. పోలీసులే వేధిస్తే.. ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇద్దరు యువకులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన కడప టూటౌన్‌పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది.  స్థానిక సాయిపేటకు చెందిన సురేష్ (27), శ్రీనివాస్ (28)లు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

అయితే ఈ రోజు ఉదయం సురేష్, శ్రీనివాస్ల ఇంటికి పోలీసులు వెళ్లి మీరు బెట్టింగ్‌కు పాల్పడుతున్నారు... మా వద్ద పక్కా సమాచారం ఉందని బెదిరించారు. మీ మీద కేసు నమోదు చేయకుండా ఉండాలంటే మా ఉన్నతాధికారులతో బేరసారాలు చేయాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో ఇద్దరు యువకులు తమకు బెట్టింగ్‌కు ఎలాంటి సంబంధంలేదని మొరపెట్టుకున్నారు.

దాంతో పోలీసులు వెళ్లి పోయారు. మళ్లీ సాయంత్రం వాళ్ల ఇంటి వద్దకు వచ్చి పోలీసులు ఇదే తీరుగా వ్యవహారించడంతో వారిద్దరు తీవ్ర మనస్తాపం చెందారు. దాంతో సదరు యువకులు ఇద్దరు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. స్థానికులు వెంటనే స్పందించి వారిని ఆస్పత్రికి తరలించారు. కాగా.. సురేష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. పోలీసుల ఆగడాలపై స్థానికులు మండిపడుతున్నారు.

మరిన్ని వార్తలు