ఊరు వలసెళ్లిపోతోంది..

26 Aug, 2017 21:49 IST|Sakshi
ఊరు వలసెళ్లిపోతోంది..

కార్తెలు కరిగినా..
- చెరువుల్లోకి చేరని నీరు
- మత్య్సకారుల వలసబాట
- పట్టించుకోని ప్రభుత్వం   


గుమ్మఘట్ట: కరువు ప్రాంతంలో కల్పతరువైన వేదావతి పరివాహక ప్రాంతం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు దాటి కార్తెలన్నీ కరిగిపోతున్నా చెరువుల్లో మోకాలిలోతు నీరు చేరని దుస్థితి నెలకొంది. కర్ణాటక సరిహద్దున ఉన్న బీటీ ప్రాజెక్టులోకి సైతం చుక్కనీరు చేరక బీటలు వారింది. నీటి జాడ కనుమరుగై ఎడారిని తలపిస్తున్నాయి. నీటి నమ్ముకున్న మత్స్యకారుల బతుకుబజారుపాలైంది. ఈ దుస్థితి బీటీ ప్రాజెక్టుకే కాదు.. జిల్లాలో ఉన్న పేరూరు, చిత్రావతి, యోగివేమన, పెండేకల్లు, పీఏబీఆర్, మిడ్‌పెన్నర్‌ రిజర్వాయర్లకూ పాకింది.

అలాగే 325 చెరువల్లోనూ 50 చెరువులకు సైతం అరకొర నీరు చేరలేదు. వీటిపై ప్రత్యేక్షంగా ఆధారపడిన వేలాది మత్స్యకారుల కుటుంబాలు ఉపాధి కోల్పోయి దిక్కుతోచని స్థితిలో వలసబాట పడుతున్నారు. కర్ణాటక రాష్ట్రం దాటుకుంటూ బీటీపీ రిజర్వాయర్‌ వద్ద తన సంతతి పెంచుకోవడానికి వచ్చిన పక్షులకు నీరు, గూడు, నీడ కరువైంది. ఆహారం దొరక్క పక్షులు అలమటిస్తున్నాయి. ఎండల తీవ్రతకు కొన్ని మృత్యువాత పడగా, మరిన్ని మారెకణం రిజర్వాయర్‌ వద్దకు తిరుగుముఖం పట్టాయి. ఇక్కడ కనిపిస్తున్న పక్షులు ఆ ప్రాంతంలో సంచరిస్తున్నాయని పలువురు మత్స్యకారులు చెపుతున్నారు.

వలసలు మొదలయ్యాయ్‌..  : జిల్లా వ్యాప్తంగా లైసెన్సులు కలిగిన మత్స్యకారులు 10 వేల మందికి పైగా ఉండగా, ఇందులో సుమారు నాలుగు వేల మంది వలస వెళ్లి పోయారు. పీఏబీఆర్, మిడ్‌పెన్నార్, చిత్రవతి రిజర్వాయర్లకు తుంగభద్ర జలాలు, జీడిపల్లికి హంద్రీనీవా నీరు అందుతుండటంతో ఆ ప్రాంతాల్లో కొంత పరువాలేదనిపించినా మిగిలిన నాలుగ రిజర్వాయర్లతో పాటు సుమారు 280 చెరువుల పరిధిలో మత్స్య సంపద క్షీణించింది. నీరున్నచోటకెళ్లి అరకొరగా పట్టుకోవడం కన్నా కూలీ పనులు చేసుకోవడమే ఉత్తమమని భావించి హైదరాబాద్‌తో పాటు కర్ణాటకలోని బెంగళూరు, మంగళూరు వంటి ప్రాంతాలకెళ్లిపోతున్నారు. దీనికి కారణం వర్షాభావంతో పాటు మత్స్య సంపదపై ప్రభుత్వం దృష్టి సారించక పోవడమే అని మత్య్సకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 40 ఏళ్లలో ఇంతటి దుర్భర జీవితాలు అనుభవించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

ఐదు కిలోల వరకు దిగుబడి సాధించాం
జిల్లాలో మరెక్కడా లేనంతగా బీటీపీ రిజర్వాయర్‌లో ఐదు కిలోలకు పైగా చేపను ఉత్పత్తిచేసి విక్రయాలు చేపట్టాం. జిల్లా కేంద్రం నుంచి ఇక్కడి చేపల కొనుగోలుకు వ్యాపారులు క్యూ కట్టేవారు. ఇలాంటి తరుణంలో ప్రకృతి పగబడితే, ఎలాంటి రాయితీలు అందించక ప్రభుత్వం మరోలా దగా చేస్తోంది. మత్స్యకారుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి ఆదుకోవాలి.
– వీరభద్ర, మత్స్యకారుడు, కోనాపురం

వెయ్యి కుటుంబాలు వీధిన పడ్డాయి
బీటీపీ రిజర్వాయర్‌ను నమ్ముకుని సుమారు వెయ్యి కుటుంబాల మత్స్యకారులు జీవనోపాధి పొందేవి. ప్రస్తుతం అడుగంటడంతో వలసలే శరణమయ్యాయి. రెండు రోజుల నుంచి 70 కుటుంబాల వారు వలసలు వెళ్లారు. కర్నూలు జిల్లా కృష్ణగిరి రిజర్వాయర్‌ వద్ద చేపలు పట్టి దినకూలీగా బతకాల్సి వచ్చింది. ప్రభుత్వం తమ జీవనోపాధిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. తగిన ఆర్థిక సహాయంతో తమ కుటుంబాలను ఆదుకోవాలి.
– రామంజనేయులు, మత్స్యకారుడు, తాళ్లకెర

మరిన్ని వార్తలు