తాగునీరు లేకుండా బతికేదెలా?

26 Jul, 2016 19:21 IST|Sakshi
తాగునీరు లేకుండా బతికేదెలా?
వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో ఆందోళన
ఖాళీ బిందెలతో స్వచ్ఛందంగా పాల్గొన్న మహిళలు
మున్సిపల్‌ కార్యాలయం ఎదుట రెండు గంటలపాటు ధర్నా
 
వినుకొండ టౌన్‌: ఓ వైపు బోర్లు పనిచేయవు, కుళాయి నీళ్లు రావు, పట్టణ వాసులు ఏం తాగి బతకాలి, ఎలా బతకాలి అంటూ బొల్లా బ్రహ్మనాయుడు ధ్వజమెత్తారు. మంచినీటి సమస్యపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి మున్సిపల్‌ కార్యాలయం ముందు ధర్నాను సోమవారం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు స్వచ్ఛందంగా ఖాళీ బిందెలతో ర్యాలీలో ప్రదర్శనగా పాల్గొనటం ప్రత్యేకతను సంతరించుకుంది. పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా బొల్లా నాయకత్వంలో బయలుదేరిన పార్టీ శ్రేణులు, నాయకులు, అభిమానులు, నీటి సమస్యపై పాలకుల నిర్లక్ష్యధోరణిని ఎండగడుతూ నినదిస్తూ ముందుకు సాగారు. పురపాలక సంఘం గేటు ముందు రెండు గంటల పాటు సాగిన ధర్నా కార్యక్రమంలో బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ పట్టణవాసులకు ప్రధానంగా మున్సిపల్‌ కుళాయి నీరు ఆధారమన్న విషయం పాలకులకు తెలియందికాదని, సింగర చెరువు ఎండిపోతే పరిస్థితి ఎంటి అన్న కనీస విజ్ఞత కరువైన ప్రజాప్రతినిధులు మనకు దొరకటం దౌర్భాగ్యమన్నారు. రెండు నెలల క్రితం సింగర చెరువును పూర్తిగా నింపాలని ధర్నా చేస్తే పాలకులు, అధికారులు పట్టించుకున్నపాపాన పోలేదని, వారి నిర్లక్ష్యతీరు ఫలితమే ప్రజలు గుక్కెడు  నీటి కోసం నేడు అల్లాడిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మున్సిపల్‌ కమిషనర్‌ రవీంద్రకు నీటి సమస్యను త్వరగా పరిష్కరించాలంటూ వినతి  అందచేశారు. 
మరిన్ని వార్తలు