తల్లీబిడ్డల్ని కలిపిన వాట్సాప్

19 Oct, 2015 23:18 IST|Sakshi
తల్లీబిడ్డల్ని కలిపిన వాట్సాప్

కేసముద్రం(వరంగల్): తప్పిపోయిన మూడేళ్ల చిన్నారి వాట్సాప్ సహకారంతో తల్లి చెంతకు చేరిన ఘటన వరంగల్ జిల్లా కేసముద్రంలో సోమవారం వెలుగుచూసింది. కేసముద్రం గ్రామానికి చెందిన చిట్టె సునీత తన మూడేళ్ల కూతురు రచనతో తల్లిగారి ఊరైన ఉప్పరపల్లికి తండ్రితో బయలుదేరింది. తొలుత కొన్ని వస్తువులు కొనుగోలు చేసి సునీత ఆటో ఎక్కాక ఓ వస్తువు మరిచిపోవడంతో కుమార్తెను తండ్రికి అప్పగించి మళ్లీ వెళ్లింది.

మూడేళ్ల రచన కూడా ఆటో దిగింది. తల్లి వెనుకే వెళ్తుందిలే అని సునీత తండ్రి భావించాడు. కానీ, చిన్నారి తల్లిని చేరుకోలేక తప్పిపోయింది. ఆ తరువాత కొద్దిసేపటికి రైల్వేస్టేషన్‌ లో కూర్చొని ఏడుస్తున్న రచనను కల్వలకు చెందిన దుర్గమ్మ అనే మహిళ గమనించి వెంట తీసుకెళ్లింది.

నేరుగా మండల కేంద్రానికి చెందిన పీడీఎస్‌ఎస్ వ్యవస్థాపకుడు బనిషెట్టి వెంకటేశ్ వద్దకు పాపను తీసుకెళ్లింది దుర్గమ్మ. అక్కడ పాప ఫొటో తీసి వాట్సాప్ గ్రూపులో పెట్టాడు వెంకటేశ్. ఇదే క్రమంలో బిడ్డ కోసం వెతుకుతున్న సునీతకు తారసపడిన... శ్రీహరి తన గ్రూప్‌కు వచ్చిన ఫొటోను చూపించాడు. ఆమె తన కుమార్తెనని చెప్పడంతో వెంటనే వెంకటేశ్ వద్దకు తీసుకువెళ్లి కేసముద్రం గ్రామ ఉపసర్పంచ్ మేకల వీరన్న సమక్షంలో అప్పగించారు. వాట్సాప్‌లో ఫోటో పెట్టిన వెంకటేశ్‌ను పలువురు అభినందించారు.

మరిన్ని వార్తలు