ఇట్లయితే పనులు చేయలేం బాబోయ్‌..!

6 Jul, 2017 22:24 IST|Sakshi
ఇట్లయితే పనులు చేయలేం బాబోయ్‌..!
- పూడికతీత పనుల్లో అధికార పార్టీ నేతల బెదిరింపులు
- రక్షణ కల్పించాలని ఎస్‌ఈకి ఇంజినీర్ల విజ్ఞప్తి 
- నేడు సీఈతోపాటు జిల్లా ఎస్పీ దృష్టికి
 
కర్నూలు సిటీ: నీరు - చెట్టు కింద చేపట్టిన పూడికతీత పనుల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాలంటూ అధికార పార్టీ నాయకులు ఇంజినీర్లపై ఒత్తిడి తెస్తున్నారని రాయలసీమ నీటిపారుదలశాఖ ఏఈఈల అసోసియేషన్‌ అధ్యక్షులు వెంకటేశ్వరరెడ్డి అన్నారు. మాట వినని వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నారని, పరిస్థితి ఇలాగే కొనసాగితే పని చేయలేమంటూ రక్షణ కల్పించాలని కోరారు. గురువారం స్థానిక జలమండలిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పూడిక తీత పనులకు సంబంధించి వారికి అనుకూలంగా పని చేయలేకపోతుండడంతో టీడీపీ నేతలు ఇంజనీర్లను బెదిరిస్తున్నారన్నారు.
 
ఆస్పరి మండలం హలిగేర, తంగరడోణలో చేపట్టిన పనుల్లో తమకు అనుకూలంగా కొలతలు వేసి బిల్లులు చెల్లించాలని వారం రోజులుగా ఎంపీపీ కృష్ణ, హలిగేర సర్పంచు యువరాజ్‌ తదితరులు జేఈఈ రఘుచరణ్, క్వాలిటీ కంట్రోల్‌ అధికారి వెంకటచలంను బెదిరిస్తున్నారన్నారు. తమ కోసమే సీఎం చంద్రబాబు ఈ పనులు పెట్టాడని, తమకు కాకపోతే ఇంకెవరికి పనులు చేసి పెడతారంటూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. తక్షణమే వారిపై చర్యలు తీసుకొని ఇంజినీర్లకు రక్షణ కల్పించకపోతే విధులు నిర్వహించలేమని వెంకటేశ్వరెడ్డి తెలిపారు. విషయంపై సాయంత్రం జలవనరుల శాఖ ఎస్‌ఈ చంద్రశేఖర్‌రావుకు చిన్ననీటి పారుదల శాఖ కర్నూలు డివిజన్‌ ఈఈ చెంగయ్యకుమార్‌ ద్వారా వినతిపత్రం ఇచ్చారు. వీరిలో సంఘం నాయకులు రాఘవేంద్ర రావు, కె.వెంకటాచలం తదితరులున్నారు. 
 
మరిన్ని వార్తలు