మేము మారం..!

3 Aug, 2016 00:09 IST|Sakshi
  • రిమ్స్‌లో మారని వైద్యుల తీరు
  • మరో శిశువును ప్రైవేటు ఆస్పత్రికి రిఫర్‌ చేసిన వైద్యుడు
  • గమనించి విచారణ చేపట్టిన డైరెక్టర్‌
  • రిమ్స్‌లోనే వైద్యం అందించాలని 
  • కలెక్టర్‌ చెప్పినా.. వీడని నిర్లక్ష్యం
  •  
    ఒంగోలు సెంట్రల్‌ : మంత్రులు, కలెక్టర్, ఎమ్మెల్యే.. ఎవరైనా డోంట్‌కేర్‌. మా తీరే వేరు.. మేం మారేది లేదు...అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు ఒంగోలు రిమ్స్‌లో పనిచేస్తున్న వైద్యులు. వైద్యం కోసం రిమ్స్‌కు ఎవరు వచ్చినా అందుబాటులో ఉన్న అన్ని రకాల వైద్య సేవలను మెరుగ్గా అందించాలని, ప్రైవేటు వైద్యశాలలకు రిఫర్‌ చేయవద్దని వైద్యశాఖ మంత్రి నుంచి రిమ్స్‌ డైరెక్టర్‌ వరకూ అక్కడ పనిచేస్తున్న వైద్యులకు పదేపదే చెబుతున్నారు. అయినప్పటికీ వారి పనితీరులో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు.
     
    రోగులకు ఎలాంటి సేవలూ అందించకుండా, పెద్దగా కష్టపడకుండా వేలకు వేల రూపాయల జీతం తీసుకోవచ్చన్న భావనతో ఉన్నారు. అంతేగాకుండా రిమ్స్‌కు వచ్చిన రోగులను కమీషన్ల కోసం ప్రైవేటు వైద్యశాలలకు రిఫర్‌ చేస్తూ అక్రమ సంపాదన కోసం పాకులాడుతున్నారు. రిమ్స్‌లో ఇప్పటికే ఇలాంటి సంఘటనలు అనేకం చోటుచేసుకోగా, మంగళవారం తాజాగా జరిగిన మరో సంఘటన రిమ్స్‌ వైద్యుల నిర్లక్ష్యపు ధోరణి, కమీషన్ల కోసం పాకులాటను మరోసారి తేటతెల్లం చేసింది.
     
    ఆ వివరాల్లోకెళ్తే.. రిమ్స్‌ డైరెక్టర్‌ రాజ్‌కుమార్‌ మంగళవారం మధ్యాహ్నం రిమ్స్‌ ఆవరణలో తిరుగుతుండగా, అంబులెన్స్‌ వచ్చి ఉంది. అంబులెన్స్‌ ఎవరి కోసం వచ్చింది.. అంటూ ఆయన సాధారణంగా అడగ్గా, రిమ్స్‌లోని నవజాత శిశుకేంద్రం నుంచి ప్రైవేటు ఆస్పత్రికి ఓ శిశువును తరలించేందుకు వచ్చిందని సిబ్బంది సమాధానం చెప్పారు. రిమ్స్‌కు వచ్చిన రోగులను ఇక్కడి వైద్యులు కమీషన్ల కోసం ప్రైవేటు ఆస్పత్రులకు రిఫర్‌ చేస్తున్నట్లు ఇప్పటికే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఆయన పూర్తి వివరాలు సేకరించారు.
     
    రిమ్స్‌ వైద్యశాల అభివృద్ధి కమిటీ సభ్యుడైన నరసింగరావు అనే వైద్యుడు రిమ్స్‌ నవజాత శిశు కేంద్రానికి చికిత్స నిమిత్తం వచ్చిన శిశువును ప్రైవేటు వైద్యశాలకు రిఫర్‌ చేసినట్లు తెలుసుకున్నారు. రిమ్స్‌లో ఆధునిక వైద్యం లేదని, మెరుగైన వైద్యం అందించలేమని ఆ డాక్టర్‌ తమకు చెప్పారని, కానీ, తమ వద్ద ప్రైవేటు వైద్యం చేయించే స్థోమత లేదని అక్కడే ఉన్న ఆ శిశువుకు చెందిన వారు రిమ్స్‌ డైరెక్టర్‌తో ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తీవ్రస్థాయిలో స్పందించిన రిమ్స్‌ డైరెక్టర్‌ రాజ్‌కుమార్‌ వెంటనే ఆర్‌ఎంఓ, ఇతర సిబ్బందితో ఎస్‌ఎన్‌సీయూకు వెళ్లి విచారించారు.
     
    సదరు శిశువుకు అవసరమైన చికిత్స చేసేందుకు రిమ్స్‌లో అవకాశం ఉన్నప్పటికీ కమీషన్లకు కక్కుర్తిపడే ప్రైవేటు వైద్యశాలకు సిఫార్సు చేసి తరలిస్తున్నట్లు విచారణలో తేలింది. అంతేగాకుండా ఆ సమయంలో విధుల్లో ఉండాల్సిన సిబ్బంది ముందుగానే వెళ్లిపోయిన విషయం కూడా వెలుగుచూసింది. ఇలాంటివి జరిగితే సంబంధిత వైద్యులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే కలెక్టర్‌ ఆదేశించిన నేపథ్యంలో రిమ్స్‌ డైరెక్టర్‌ రాజ్‌కుమార్‌ పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. 
మరిన్ని వార్తలు