బడి ఎన్నికల జడి

1 Aug, 2016 18:01 IST|Sakshi
బడి ఎన్నికల జడి
  • సర్కారీ స్కూళ్లలో ఎస్‌ఎంసీ ఎన్నికలు
  • మూడేళ్ల తర్వాత నిర్వహణ
  • ఈ నెల 10లోగా ఎన్నికలు పూర్తి
  • పాఠశాలల బలోపేతానికి ఊతం
  • కొన్నిచోట్ల ఎన్నికలకు రాజకీయ రంగు

  • పాపన్నపేట:ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీల ఎన్నికలకు నగారా మోగింది. మూడేళ్ల తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను ఈ నెల 10లోగా పూర్తి చేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇందుకోసం సర్వశిక్ష అభియాన్‌ పరిధిలోకి వచ్చే 8వ తరగతి వరకు ఎస్‌ఎంసీల ఏర్పాటుకు ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలు రంగం సిద్ధం చేస్తున్నారు. కాగా ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన ఈ ఎన్నికలు కొన్నిచోట్ల రాజకీయ రంగును పులుముకునే వాతావరణం కనిపిస్తుంది.
    మెదక్‌ జిల్లాలో 2,940 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ప్రభుత్వ పాఠశాలల మెరుగుకు ప్రజల భాగస్వామ్యాన్ని కల్పించే లక్ష్యంతో 2013లో ఎస్‌ఎంసీలను ఏర్పాటు చేశారు. విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచి, కనీస మౌలిక సౌకర్యాలను కల్పిస్తూ.. మూతబడుతున్న పాఠశాలను బతికించుకునేందుకు ప్రజల సహకారం తప్పనిసరి అనేది ఇందులోని ఉద్దేశం.
    ఎస్‌ఎంసీలకు రాజకీయ రంగు..
    సేవాభావంతో బడులను గుడులుగా మార్చి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు తోడ్పడాల్సిన ఎస్‌ఎంసీలు రాజకీయ రంగును పులుముకుంటున్నాయన్న ఆరోపణలున్నాయి. గత ఎన్నికల్లో ఇలాంటి వాతావరణం స్పష్టంగా కనిపించింది. పలుచోట్ల రాజకీయ ప్రాతిపదికన అభ్యర్థులు ఎస్‌ఎంసీ ఎన్నికల రంగంలోకి దిగారు. కొన్నిచోట్ల ఘర్షణలు చెలరేగడంతో ఎన్నికలే వాయిదా వేసి తిరిగి నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది.

    పాపన్నపేట మండలం కొడుపాకలో ఎస్‌ఎంసీ చైర్మన్‌ పదవి కోసం ఓ అభ్యర్థి సుమారు రూ.25 వేలు ఖర్చు చేసి, విందు వినోదాలతో పోషకులను ఆకట్టుకొని చైర్మన్‌ పదవిని పొందారన్న ఆరోపణలున్నాయి. అవి కూడా పార్టీ ప్రాతిపదికన కైవసం చేసుకునేందుకు సంబంధిత పార్టీల నాయకులు తాజా ఎన్నికలకు సిద్ధమవుతున్నారు.
    కాంట్రాక్టుల ఆశలో కాసుల వేట
    సాధారణంగా పాఠశాలకు మంజూరయ్యే అదనపు గదులు, టాయిలెట్లు, వంటషెడ్లు తదితర నిర్మాణ బాధ్యతలను ఖరారు చేసే అధికారం ఎస్‌ఎంసీలకే ఉంటుంది. ఫలితంగా నిర్మాణ కాంట్రాక్టు తామే పొందితే నాలుగు పైసలు వెనకేసుకోవచ్చనే ఆశతో కూడా చాలామంది ఎన్నికల రంగంలోకి చాలామంది దిగుతున్నారు.
    ఎన్నిక ఇలా..
    సర్వశిక్షా అభియాన్‌ పరిధిలోకి వచ్చే 1 నుండి 8వ తరగతి వరకు ఎస్‌ఎంసీలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. పాఠశాల ప్రదానోపాధ్యాయుని ఆధ్వర్యంలో పోషకులను సమావేశ పరిచి ఎన్నికలు నిర్వహించాలి.ఈ నెల 10లోగా జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఎస్‌ఎంసీలను ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రతి తరగతి నుండి ముగ్గురు పోషకులను సభ్యులుగా ఎన్నుకోవాలి. ఈ ముగ్గురిలో ఇద్దరు మహిళలై ఉండాలి.

    ఇందులో సామాజికంగా వెనుకబడిన అభ్యర్థులు ఒకరు (ఎస్సీ, ఎస్టీ, ఆర్ఫన్స్, వలస జీవులు, వీధిబాలలు, వికలాంగులు, హెచ్‌ఐవి బాధిత వర్గాలు), మరొకరు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారు (వార్షికాదాయం రూ.60వేల లోపు ఉన్న బీసీ, మైనార్టీ, ఓసీ వర్గాలు), ఇంకొకరు జనరల్‌ కేటగిరి అభర్థులై ఉండాలి. తరగతికి ముగ్గురు మెంబర్లు ఎన్నికైన తర్వాత వారంతా కలసి అందులో నుండి ఒకరిని చైర్మన్‌గా, మరొకరిని వైస్‌చైర్మన్‌గా ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఆ ఇద్దరిలో ఒకరు తప్పనిసరిగా సామాజికంగా వెనుకబడిన వారై ఉండాలి. మరొకరు మహిళ అయి ఉండాలి.
    ఎక్స్‌అఫీషియో సభ్యుల ఎన్నిక..
    - పాఠశాల ప్రదానోపాధ్యాయులు మెంబర్‌ ఆఫ్‌ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.
    - అదే పాఠశాలకు చెందిన మరో టీచర్‌ను ఎంఈఓ మెంబర్‌గా నియమిస్తారు.
    - వీరితో పాటు పాఠశాల పరిధిలోకి వచ్చే వార్డు మెంబర్, అంగన్‌వాడి, ఏఎన్‌ఎం, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సభ్యులుగా ఉంటారు.
    కో ఆప్టెడ్‌ మెంబర్లు ఇలా..

    పాఠశాలకు ఉపయోగపడే విద్యావేత్తలు, స్వచ్ఛంద సంస్థ సభ్యులు, ఫిలాసఫర్స్‌లో ఇద్దరు వ్యక్తులను కో ఆప్టెడ్‌ మెంబర్లుగా నియమిస్తారు. సర్పంచ్‌లు ఎస్‌ఎంసీ సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు