బాధ్యులెవరో తేల్చండి

6 Aug, 2016 23:14 IST|Sakshi
బాధ్యులెవరో తేల్చండి
– కొండచరియల ప్రమాదంపై ఈవోకు ఎస్పీ లేఖ
సాక్షి ప్రతినిధి, కర్నూలు: పాతాళగంగ ఘాట్‌కు వెళ్లే మార్గంలో కొండచరియలు విరిగి పడిన ఘటనపై బాధ్యులు ఎవరో తేలనున్నారా? వారిపై చర్యలు తీసుకోనున్నారా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానమే మిగులుతోంది. కొండ చరియలు విరిగిపడిన ఘటనపై బాధ్యులెవరో తేల్చి ఏకంగా క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని స్వయంగా ఎస్పీ ఆకె రవికష్ణ..శ్రీశైలం ఈవో భరత్‌గుప్తకు లేఖ రాసినట్టు తెలిసింది. వాస్తవానికి ఘాట్‌కు రోడ్డు మార్గం వేసే సమయంలోనే కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని స్వయంగా ఎస్పీ రవికృష్ణ...మే నెలలోనే లేఖ రాశారు. అయితే.. సంబంధిత అధికారులు దీనిపై కనీస చర్యలు తీసుకోలేదు. పది రోజుల క్రితం రాత్రి సమయంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ నేపథ్యంలో ఎస్పీ విజయవాడ నుంచి నేరుగా శ్రీశైలం చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఇదే నేపథ్యంలోనే ముందస్తు జాగ్రత్తలు చెప్పినప్పటికీ పట్టించుకోని నేపథ్యంలో ఘటన జరిగేందుకు బాధ్యులు ఎవరనే విషయంలో విచారణ చేసి క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ఎస్పీ..ఈవోకు లేఖ రాసినట్టు తెలిసింది. ఈ పరిస్థితులల్లో విచారణ కూడా జరిగే అవకాశం ఉంది. దీంతో ఎవరిపై క్రిమినల్‌ కేసు నమోదు చేస్తారనే విషయంలో ఇప్పుడు ఆసక్తి నెలకొంది. సంబంధిత కాంట్రాక్టు సంస్థతో పాటు నిర్లక్ష్యం వహించిన అధికారులపైనా చర్యలు తప్పవని తెలుస్తోంది. 
అగ్గిరాజేసిన వ్యవహారం...
వాస్తవానికి కొండచరియలు విరిగిపడిన వ్యవహారం.. జిల్లాలో ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య అగ్గిరాజేసింది. తాను సూచనలు చేసినప్పటికీ ముందస్తుగా మేల్కోలేదని ఎస్పీ వాపోయారు. ఇదే విషయంపై పుష్కరాల సమీక్ష సమావేశాల్లో ఐదారుసార్లు లేవనెత్తినప్పటికీ పట్టించుకోలేదని ఎస్పీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఆయన తన ఉన్నతాధికారుల దష్టికి కూడా తీసుకెళ్లారు. ఈ పరిస్థితుల్లోనే డీఐజీ కూడా ఎస్పీ సూచన పాటించి ఉంటే ఈ  ఘటన జరిగిఉండేది కాదని పేర్కొన్నారు. అయితే, దీనిపై అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారనే విధంగా మరో ఉన్నతాధికారి బాహాటంగానే అధికారుల సమావేశంలో విరుచుపడినంత పనిచేశారు. ఈ నేపథ్యంలోనే సంబంధిత ఘటనపై విచారణ చేసి బాధ్యులని తేలిన వారిపై ఎస్పీ లేఖ రాసిన నేపథ్యంలో ఈ వ్యవహారం ఎటు మలుపు తిరుగుతోందననే చర్చ సాగుతోంది. 
 
>
మరిన్ని వార్తలు