మాకు పండుగల్లేవా?

19 Oct, 2015 02:07 IST|Sakshi
మాకు పండుగల్లేవా?

- కుటుంబసభ్యులతో సంతోషంగా గడపొద్దా అంటున్న ఉద్యోగులు
- ప్రతి పండుగకు ప్రభుత్వ కార్యక్రమాల్లోనే గడపాల్సి వస్తోందని ఆవేదన
 
సాక్షి, హైదరాబాద్: అమ్మకు ఆదివారం లేదా? అంటూ అప్పట్లో స్త్రీవాదులు సంధించిన ప్రశ్న అందరినీ ఆలోచింపజేసింది. ఇప్పుడు.. మాకు పండుగల్లేవా? ఆరోజు మేము కుటుంబసభ్యులతో గడపొద్దా? అంటూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రతి పండక్కీ తమతో ఏదోవిధమైన పని చేయిస్తోందని, తద్వారా ప్రభుత్వం ఏదో చేసేస్తోందనే భ్రమ ప్రజల్లో కల్పించడానికి తాపత్రయపడుతున్నట్టుగా ఉందని అంటున్నారు.
 
 ఏడాదిన్నరగా ఇదే తంతు!
 టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాదిన్నర కాలంగా ప్రతి పండుగకు ఏదో అధికారిక కార్యక్రమంలో ఉద్యోగులు పాల్గొనాల్సిన పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోంది. గత సంక్రాంతి రోజున.. ప్రభుత్వం అన్ని గ్రామాల్లో సంక్రాంతి సంబరాలు పేరిట ఆటలు, ముగ్గుల పోటీలు నిర్వహించి ఉద్యోగులకు ఊపిరాడకుండా చేసింది. తెలుగు సంవత్సరాది ఉగాదికీ అలాంటి పరిస్థితే కల్పించింది. ఇక డిసెంబర్‌లో వచ్చిన క్రిస్‌మస్ రోజునా ఇలానే చేసింది.
 
 ఇప్పుడు దసరా రోజున అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుండటంతో కృష్ణా, గుంటూరు జిల్లాల ఉద్యోగులకు సెలవులు ఇప్పటికే రద్దు చేశారు. ఇక మిగతా 11 జిల్లాల ఉద్యోగులనూ ఆ రోజు బిజీగా ఉంచే యోచనలో ప్రభుత్వం ఉంది. ప్రజలకు సేవ చేయడానికి సెలవు రోజుల్లో పనిచేయడానికి సిద్ధమేనని, అయితే ప్రజలకు ఉపయోగపడే విధంగా తమ సేవలు ఉండాలని ఉద్యోగులు అంటున్నారు. తమ కుటుంబాల సంగతీ ఆలోచించాలంటున్నారు.

మరిన్ని వార్తలు