ప్రయోగం లేని సైన్సు

9 Sep, 2016 00:47 IST|Sakshi
బైరెడ్డిపల్లె బాలుర పాఠశాలలో హెచ్‌ఎం గదే ల్యాబ్‌గా వాడుకుంటున్న దృశ్యం
– పాఠశాలల్లో కరువైన ప్రయోగశాలలు, పరికరాలు 
– ఈ ఏడాది సీసీఈ పద్ధతిలో పదోతరగతి పరీక్షలు
–ప్రయోగాలపై అవగాహనలేకుంటే విద్యార్థులకు నష్టమే
జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలోని బైరెడ్డిపల్లెలోని జెడ్పీ బాలుర ప్రభుత్వ పాఠశాలలో 517 మంది విద్యార్థులు ఆరు నుంచి పదో తరగతి వరకు విద్యనభ్యసిస్తున్నారు.  ఆ పాఠశాలలో విద్యార్థులకు ప్రయోగాలను బోధించడానికి ప్రత్యేకంగా సైన్సుల్యాబ్‌ లేదు. హెచ్‌ఎం గదిలో గల బీరువాలో ప్రయోగపరికరాలను పెట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. జిల్లా మొత్తం మీద ఇదే పరిస్థితులు ఉన్నాయి.
చిత్తూరు ఎడ్యుకేషన్‌: ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ప్రయోగాత్మక విద్య విద్యార్థులకు అందని ద్రాక్షలా మారుతోంది. కొన్ని చోట్ల గదుల కొరత ఉంటే మరికొన్ని చోట్ల ప్రయోగపరికరాల కొరత ఉండడంతో విద్యార్థులకు ప్రయోగపాఠాలు అందడంలేదు. ఉన్నత  పాఠశాలల్లో సైన్సు ప్రయోగాల కోసం ప్రభుత్వం ఏటా నిధులను మంజూరు చేస్తోంది. అయితే అంతకు తగ్గట్టుగా ప్రయోగశాలకు సంబంధించి ప్రత్యేక గదులు ఉండడంలేదు. ప్రయోగశాలల నిర్వహణ దేవుడెరుగు సైన్సు పరికరాలను భద్రపరచడమే టీచర్లకు ఇబ్బంది కరంగా మారుతోంది.  జిల్లాలో అన్ని యాజమాన్యాలు కలిపి 1126 పాఠశాలలుండంగా,  అందులో  ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 612 పాఠశాలలున్నాయి. విద్యార్థుల్లో శాస్త్ర పరిజ్ణానం పెంపొందించాలంటే ప్రయోగాత్మక భోదన చాలా అవసరం. అయితే ప్రభుత్వం వీటిపై అంతగా దృష్టిసారించకపోవడంతో విద్యార్థులు చేసేదేమిలేక ౖసైన్సు చదువులను బట్టి పడుతూ నెట్టుకొస్తున్నారు. దీంతో వారికి సాంకేతిక పరిజ్ఞానం అందడంలేదు.  సైన్సు ప్రయోగాలను చేయిద్దామని టీచర్లకు ఆసక్తి ఉన్నప్పటికి  సంబంధిత రసాయనాలు, పరికరాలు లేకపోవడంతో మిన్నకుండిపోతున్నారు.
ఇలాగైతే ఈ ఏడాది కష్టమే
 ఈ పరిస్థితుల్లో  ఈ ఏడాదిలో పదోతరగతి పరీక్షలు రాయబోయే విద్యార్థుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతోంది.  ఈ ఏడాది నుంచి వారు సీసీఈ(సంగ్రహణాత్మక మూల్యాంకన పద్ధతి)లో పరీక్షలు రాయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నూతన పద్దతి ప్రకారం విద్యార్థుల కు ఎక్కువగా ప్రయోగాత్మక ప్రశ్నలను అడిగే అవకాశం ఉంది. విద్యార్థులకు ప్రయోగాలపై అవగాహన కల్పించకపోతే ఈ సారి సైన్సు సబ్జెక్టుల్లో తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని ఉపాధ్యాయులు హెచ్చరిస్తున్నారు. 
ల్యాబ్‌కు ప్రత్యేక రూం లేదు 
మా పాఠశాలలో ల్యాబ్‌కు ప్రత్యేకంగా గది లేదు. మా పాఠశాలలో ఈ ఏడాది 107 మంది విద్యార్థులు పదోతరగతి పరీక్షలకు హజరవుతున్నారు. ఈ ఏడాది నుంచి వారికి సీసీఈ విధానంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ల్యాబ్‌లో ప్రయోగాలను చేసి చూపితేనే వారికి అవగాహన కలుగుతుంది. లేకుంటే నష్టపోయే అవకాశం ఉంది.
– లక్ష్మీనారాయణ, హెచ్‌ఎం, జెడ్పీ బాలురఉన్నత పాఠశాల, బైరెడ్డిపల్లె 
 

 

మరిన్ని వార్తలు