సమన్వయంతో పనిచేయాలి

17 Aug, 2016 23:09 IST|Sakshi
  •  మంత్రి జోగు రామన్న
  •  మండలాభివృద్ధిపై సుదీర్ఘంగా కొనసాగిన సమావేశం
  •  గైర్హాజరైన అధికారులపై చర్యలకు ఆదేశం 
  • ఆదిలాబాద్‌ రూరల్‌ : ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందాలంటే అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న సూచించారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెడుతున్నా అధికారులు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించకపోవడంతో రైతులు వాటి ఫలాలు పొందలేకపోతున్నారన్నారు. బుధవారం పట్టణంలోని ఎంపీడీవో సమావేశ మందిరంలో ఎంపీపీ నైతం లక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మండలాభివృద్ధి సుదీర్ఘంగా చర్చ కొనసాగింది.
    –  సమావేశంలో ఆర్‌డబ్ల్యూస్‌ అధికారులు సరైనా రీతిలో సమాధానాలు చెప్పకపోవడంతో ఎన్నిసార్లు చెప్పిన మీరూ మారారా.. అని అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. 
    – రైతుల కోసం అందిస్తున్న పథకాలపై అవగాహన కల్పించాలని వ్యవసాయ, హార్టికల్చర్‌ అధికారులను ఆదేశించారు. రుణాలు ఇవ్వని బ్యాంకుల జాబితాను తమకు అందించాలన్నారు. బిందు సేద్యం ద్వారా వ్యవసాయ సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని, సబ్సిడీ విషయాలు తెలపాలన్నారు. 
    – అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలకు మెనూ ప్రకారం భోజనం అందుతుందా లేదా అనే విషయాలను స్థానిక ప్రజాప్రతినిధులు పరిశీలించాలన్నారు. 
    – వచ్చే మాసంలో వర్షాలు అధికంగా కురిసే అవకాశం ఉన్నందున, విషజ్వరాలు ప్రబలకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. మారుమూల గిరిజన  ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలన్నారు. 
    – తాను భూమి పూజ చేసిన వివిధ అభివృద్ధి పనులు ప్రారంభం కాకపోవడంపై పంచాయతీ రాజ్‌ ఏఈపై మండిపడ్డారు. తప్పుడు సమాచారంతో తననే పక్కతోవ పట్టించాలని చూస్తే సహించేది లేదన్నారు. 
    – శ్మశాన వాటికల ఏర్పాటు కోసం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్థలాలను గుర్తించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. 
    – బట్టిసావర్‌గాం ప్రభుత్వ పాఠశాలలో తోటి విద్యార్థులతో విద్యార్థులు గొడవ పడితే తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా సంబంధిత పాఠశాల హెచ్‌ఎం టీసీ ఇచ్చి ఇంటికి పంపుతున్నారని సర్పంచ్‌ రామారావు మంత్రి దృష్టికి తెచ్చారు. స్పందించిన మంత్రి సంబంధిత పాఠశాల హెచ్‌ఎం కఠిన చర్యలు తీసుకేనేలా డీఈవోకు ఫిర్యాదు చేయాలని ఎంపీడీవోను ఆదేశించారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు ఇజ్జగిరి అశోక్, ఎంపీడీవో ర వీందర్, తహశీల్దార్‌ వర్ణ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.  
    కొందరు అధికారుల గైర్హాజరు
     సమావేశానికి మంత్రి వస్తున్నారని సమాచారం ఉన్నా కొంత మంది అధికారులు సమావేశానికి హాజరుకాకపోవడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గైర్హాజరైన అధికారుల వివరాలను వెంటనే కలెక్టర్‌కు అందించాలని, నామమాత్రంగా నోటీసులు జారీ చేయకుండా, అలాంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. 
    ఆలస్యంగా సమావేశం
     ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కావాల్సిన సర్వసభ్య సమావేశం మంత్రి రావడం ఆలస్యం కావడంతో ఆయన ఆదేశాల మేరకు మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమైంది. ప్రారంభమైన 45 నిమిషాల పాటు వివిధ సమస్యలపై చర్చించి భోజన విరామం ప్రకటించారు. సమావేశం ఆలస్యంగా ప్రారంభం కావడంతో ప్రజాప్రతినిధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొంత మంది ఎదురు చూసి ఇంటికి వెళ్లిపోయారు. భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 2.45 గంటలకు మంత్రి జోగు రామన్న వచ్చారు.   
     
మరిన్ని వార్తలు