'తెలుగుపై ప్రభుత్వానికి చిన్నచూపు'

23 Aug, 2016 19:49 IST|Sakshi

విశాఖపట్నం : భవిష్యత్తులో తెలుగు భాషను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవల్సిన దుస్థితి రానుందని లోక్‌నాయక్ ఫౌండేషన్ చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి తెలుగు భాష పట్ల చిత్తశుద్ధి లేదన్నారు. మంగళవారం విశాఖపట్నంలో పోలవరపు కోటేశ్వరరావు రచించిన కృష్ణవేణి నృత్య రూపకానికి సంబంధించి ఏర్పాటులో భాగంగా లక్ష్మీప్రసాద్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ...రానున్న రోజుల్లో తెలుగు సంస్కృతి గూర్చి తెలుసుకునేందుకు విదేశాలపై ఆధారపడాల్సిన దుస్థితి నెలకొంటుందన్నారు.

ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు తెలుగును సబ్జెక్ట్‌గా బోధించాలని ప్రభుత్వానికి చెబితే... తప్పనిసరి చేస్తామని చెప్పిన ప్రభుత్వం తర్వాత ఆ విషయాన్ని విస్మరించిందని ఆరోపించారు. రాష్ట్రంలో సుమారు నాలుగు వేల తెలుగు మీడియం పాఠశాలలను మూసివేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని విమర్శించారు. తెలుగు భాష, సంస్కృతి అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. దీనిపై ప్రభుత్వంతో చర్చించేందుకు తాను సిద్ధమని యార్లగడ్డ ఈ సందర్భంగా ప్రకటించారు.

ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు. కార్మిక దినోత్సవం మేడే నాడు మహాకవి శ్రీశ్రీ గృహాన్ని మ్యూజియంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చినా ఆ దిశగా పనిచేయకపోవడం శోచనీయమన్నారు. ఈ నెల 24న కూచిపూడి అకాడమీ ఆఫ్ సెయింట్ లూయిస్ (అమెరికా) కు చెందిన వింజమూరి సుజాత బృందంచే విశాఖలోని కళాభారతి ఆడిటోరియంలో కృష్ణవేణి 'నృత్యరూపకం' ప్రదర్శన నిర్వహిస్తున్నట్టు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ వెల్లడించారు.

ఈ బృందంలో అమెరికాకు చెందిన నలుగురు కళాకారులు ఉన్నారని పేర్కొన్నారు. తెలుగు సంస్కృతిని పరిరక్షించే క్రమంలో ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ సమావేశంలో కళాకారులు వింజమూరి సుజాత, మానస, శైలజ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు