వెంటాడిన మృత్యువు

7 Sep, 2017 11:52 IST|Sakshi
వెంటాడిన మృత్యువు

వంతెన గోడను బైక్‌ ఢీకొన్న ఘటనలో యువకుడి మృతి
మరొకరికి తీవ్ర గాయాలు
బ్యాంకు నుంచి డబ్బులు తీసుకువస్తుండగా ప్రమాదం
విషాదంలో చినకొవ్వాడ


లావేరు: బైక్‌పై ప్రయాణిస్తూ వంతెన గోడను ఢీకొట్టిన ఘటనలో రణస్థలం మండలం చినకొవ్వాడ గ్రామానికి చెందిన మైలపల్లి పోలయ్య(22) ప్రాణాలు కోల్పోయాడు. బైకు వెనుక కూర్చున్న మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. లావేరు మండలం తాళ్లవలస సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి లావేరు ఎస్‌ఐ సీహెచ్‌ రామారావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి..  

రణస్థలం మండలంలోని చినకొవ్వాడ గ్రామానికి చెందిన మైలపల్లి పోలయ్య తన బంధువు కారి రాములుతో కలిసి బుధవారం శ్రీకాకుళం పట్టణంలోని ఓ బ్యాంకుకు వెళ్లాడు. రూ.50 డ్రా చేసుకుని తిరిగి గ్రామానికి వస్తుండగా అదుపు తప్పి తాళ్లవలస సమీపంలో జాతీయ రహదారి పక్కన ఉన్న వంతెన గోడను బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో పోలయ్య ఎగిరిపడటంతో తల, కాళ్లు, చేతులకు బలమైన గాయాలయ్యాయి. రాములు సైతం తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే లావేరు ఎస్‌ఐ రామారావు సిబ్బందితో సంఘటన స్థలానికి వచ్చి క్షతగాత్రులిద్దరినీ 108 అంబులెన్సులో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడికి వెళ్లిన కాసేపటికే పోలయ్య మృతి చెందాడు. రాములు చికిత్స పొందుతున్నాడు. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న వెంటనే బాధిత కుటుంబ సభ్యులు రిమ్స్‌ ఆస్పత్రికి పరుగులు తీశారు. పోలయ్య మృతి వార్త తెలుసుకుని బోరున విలపించారు.
 
హెల్మెట్‌ ధరించకపోవడం వల్లే..
హెల్మెట్‌ ధరించకపోవడం వల్లే యువకుడి తలకు బలమైన గాయాలయ్యాయని పోలీసులు చెబుతున్నారు. వంతెనను ఢీకొట్టిన వెంటనే పోలయ్య రోడ్డుపై పడటంతో తలకు బలమైన గాయాలు తగిలి తీవ్ర రక్తస్రావం జరిగిందని, అదే హెల్మెట్‌ ధరించి ఉంటే అంతగా గాయాలు కావని అంటున్నారు.   

సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ, సీఐలు
తాళ్లవలస హైవేపై ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న వెంటనే శ్రీకాకుళం డీఎస్పీ భార్గవనాయుడు, జేఆర్‌పురం సీఐ రామకృష్ణలు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును లావేరు ఎస్‌ఐ రామారావును అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అన్నారు.

మరిన్ని వార్తలు