టీడీపీ అవినీతిని ఎండగడతాం

14 Jun, 2017 01:05 IST|Sakshi

విజయనగరం : ప్రజాబలంతో అధికార టీడీపీ అవినీతి, అనైతిక చర్యలు ఎండగట్టాలని పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్‌, శాసన మండలి సభ్యుడు కోలగట్ల వీరభద్రస్వామి కార్యకర్తలు, నాయకులకు పిలుపునిచ్చారు. పూల్‌బాగ్‌లోని జగన్నాథ కల్యాణ మండపంలో పార్టీ జిల్లా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, పార్టీ అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్‌లతో కలిసి మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రజాధనంతో అధికార టీడీపీ విజయవాడలో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తే, కార్యకర్తల బలంతో అందుకు ధీటుగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర స్థాయి ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. జూలై 8, 9 తేదీల్లో విజయవాడలో జరిగే రాష్ట్ర ఫ్లీనరీకి జిల్లా నుంచి అత్యధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలందరమూ కలిసి తరలి వెళ్దామన్నారు. ఈ నెల 24న భారీ స్థాయిలో నిర్వహించనున్న జిల్లా ప్లీనరీ సమావేశానికి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు పలువురు రాష్ట్ర స్థాయి నాయకులు హాజరవుతారని తెలిపారు. అధికారం చేపట్టిన మూడు సంవత్సరాల్లో టీడీపీ ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితమైందని ఆరోపించారు. జన్మభూమి కమిటీలు ప్రతిపనికి రేటును నిర్ణయించి ప్రజల సొమ్మును దోచుకుంటున్నారన్నారు. గృహ నిర్మాణానికి సంబంధించి మూడేళ్లలో ఒక్క ఇల్లు కూడా మంజూరుకాలేదన్నారు.

పార్టీ జిల్లా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ టీడీపీ నేతలు అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలను అమ్ముకుంటున్నారని, నీరు–చెట్టు కార్యక్రమం నిధులు దోచుకుంటున్నారన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్‌ మాట్లాడుతూ జిల్లా ప్లీనరీకి సంబంధించి స్థల పరిశీలన, పార్టీ బలోపేతం చేసే అంశంపై చర్చించామన్నారు. బూత్‌ కమిటీలు, మండల స్థాయి కమిటీల నియామకాలు త్వరితగతిన పూర్తిచేస్తామన్నారు. జిల్లా ప్లీనరీలో ప్రధాన సమస్యలపై పలు తీర్మానాలు చేస్తామని చెప్పారు.

రానున్న ఎన్నికల్లో జిల్లాలో 9 నియోజకవర్గాలు, రెండు ఎంపీ స్థానాలలో పార్టీ విజయఢంకా మోగించేలా పార్టీ శ్రేణులను మరింత ఉత్తేజపరుస్తామన్నారు. సమావేశంలో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు, సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, మాజీ ఎమ్మెల్యేలు బొత్స అప్పలనర్సయ్య, బడుకొండ అప్పలనాయుడు, పార్వతీపురం నియోజకవర్గం సమన్వయకర్త జమ్మాన ప్రసన్నకుమార్, ఎస్‌.కోట నియోజకవర్గసమన్వయకర్త నెక్కల నాయుడుబాబు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు