అరుణ్ జైట్లీ అదనంగా ఒరగబెట్టిందేమీ లేదు

28 Oct, 2016 21:16 IST|Sakshi

► ఆర్థిక మంత్రిపై మండిపడ్డ వైఎస్సార్‌సీపీ నేత గౌతమ్‌రెడ్డి

సాక్షి, అమరావతి బ్యూరో: విభజన చట్టంలో ఉన్న అంశాలు మినహా ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అదనంగా ఒరగబెట్టిందేమీ లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గౌతమ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కృష్ణా జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజధాని ప్రాంతంలో ప్రభుత్వ భవనాల సముదాయానికి శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన అరుణ్ జైట్లీ రాష్ట్రానికి ఏవైనా వరాలు కురిపిస్తారని ప్రజలు ఆశించారన్నారు. అయితే ఎలాంటి వరాల జల్లు కురిపించకపోగా విభజన చట్టంలో ఉన్న అంశాలను వల్లె వేస్తూ ఏపీకి కేంద్రం ఎంతో సాయం చేస్తోందన్నట్లుగా చెప్పుకొచ్చారని విమర్శించారు.

కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఇచ్చామని, దుగరాజపట్నం పోర్టు పనులు పీపీపీ పద్ధతితో నిర్మించడానికి పరిశీలిస్తున్నట్లు గొప్పలు చెప్పారని, ఇవేమీ కేంద్రం ఏపీకి అదనంగా ఇచ్చినవి కావని, విభజన చట్టంలో ఉన్నవేనని అన్నారు. ప్రత్యేక హోదా అంశంపై సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని ఎందుకు గట్టిగా నిలదీయడంలేదని ప్రశ్నించారు. రాష్ట్రానికి సాయం అడగడం కూడా బిచ్చమెత్తుకునే రీతిలో టీడీపీ ధోరణి ఉందని ధ్వజమెత్తారు. అమరావతిలో ఇప్పటికే ప్రభుత్వం మూడుసార్లు శంకుస్థాపన కార్యక్రమాలను ఆర్భాటంగా నిర్వహించిందని, తాజాగా శుక్రవారం ఆర్థిక మంత్రి జైట్లీతో చేయించిన ప్రభుత్వ భవనాల సముదాయ శంకుస్థాపన కార్యక్రమం కూడా అలాంటి ప్రచారార్భాటమేనని అన్నారు.
 

మరిన్ని వార్తలు