నేడు ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి జలజాగరణ

7 May, 2016 09:07 IST|Sakshi
నేడు ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి జలజాగరణ

► హంద్రీ-నీవా ఆయకట్టుకు
 నీరివ్వకపోవడాన్ని నిరసిస్తూ
 ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పోరుబాట
► బెళుగుప్పలో నేటి సాయంత్రం 5 గంటల నుంచి దీక్ష


అనంతపురం: హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకం మొదటిదశ ఆయకట్టుకు నీరివ్వకుండా.. సీఎం సొంత నియోజకవర్గం కుప్పానికి తీసుకుపోవడాన్ని నిరసిస్తూ ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి పోరుబాట పట్టారు. ఉరవకొండ నియోజకవర్గ రైతులతో కలిసి శనివారం సాయంత్రం ఐదు గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఎనిమిది వరకూ బెళుగుప్ప మండల కేంద్రంలో ‘జలజాగరణ’ దీక్షకు దిగుతున్నారు.  హంద్రీ-నీవా మొదటి దశ కింద 1.18 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించాల్సి ఉంది. టీడీపీ అధికారంలోకి వచ్చే సమయానికే మొదటి దశ పనులు 90 శాతం పూర్తయ్యాయి. డిస్ట్రిబ్యూటరీ పనులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పనులపై దృష్టి సారించి ఉంటే గత రెండేళ్ల నుంచే మొదటి దశ ఆయకట్టు భూములు పంటలతో కళకళలాడేవి. కానీ సీఎం చంద్రబాబు ఆయకట్టు విషయాన్ని పక్కన పెట్టేసి.. తన సొంత నియోజకవర్గం కుప్పానికి నీటిని తీసుకుపోవడానికి ప్రధాన కాలువపైనే దృష్టి సారించారు. దీంతో పాటు తమ వారికి లబ్ధి చేకూర్చడానికి ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని అమాంతం పెంచేశారు. రెండోదశలో రూ. 50 కోట్ల పనుల విలువను రూ. 300 కోట్లకు పెంచారు. 

గతేడాది జీవో  22ను విడుదల చేస్తూ.. ఆయకట్టు పనుల జోలికి వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు.  ఈ నిర్ణయంతో ఉరవకొండ నియోజకవర్గంలోని రైతులు, ప్రజలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. మొదటి దశలో కర్నూలు జిల్లా పరిధిలోని 25 వేల ఎకరాలు పోనూ మిగిలిన ఆయకట్టంతా జిల్లాలోనే ఉంది. అత్యధికంగా ఉరవకొండ నియోజకవర్గంలో 75 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. జీడిపల్లి రిజర్వాయర్ కూడా బెళుగుప్ప మండలంలోనే నిర్మించారు. ప్రాజెక్టు కోసం వేల ఎకరాలను ఇక్కడి  రైతులు ఇచ్చారు. రిజర్వాయర్ నిర్మాణంతో  జీడిపల్లి  వాసులు తీవ్రంగా నష్టపోయారు. వారికి ఇప్పటికీ పునరావాసం కల్పించలేదు. ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఒత్తిడి తేవడంతో పాటు రాకెట్ల, ఆమిద్యాల ఎత్తిపోతల పథకాన్ని గతేడాది ఆగస్టులోగానే పూర్తి చేస్తామని ప్రభుత్వం లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చింది. అయితే ఇంత వరకూ అతీగతీ లేదు.

 ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి : విశ్వేశ్వరరెడ్డి, ఉరవకొండ ఎమ్మెల్యే
 సీఎం చంద్రబాబు వైఖరిని నిరసిస్తూ శనివారం సాయంత్రం బెళుగుప్పలో చేపడుతున్న జలజాగరణ  దీక్షకు జిల్లా నలుమూలల నుంచి రైతులు, ప్రజలు తరలిరావాలి. ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా విజయవంతం చేయాలి. ఈ కార్యక్రమానికి పీఏసీ చైర్మన్, డోన్ ఎమ్మెల్యే రాజేంద్రనాథ్‌రెడ్డి,  ఆలూరు ఎమ్మెల్యే జయరాం, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గురునాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్, సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ తదితరులు హాజరవుతున్నారు.

మరిన్ని వార్తలు