థర్డ్‌పార్టీ తహతహ !

23 Aug, 2019 00:20 IST|Sakshi

ఎవ్రీబడీ లవ్స్‌ ఎ గుడ్‌ డ్రాట్‌..  90వ దశకం ప్రారంభంలో పలు రాష్ట్రాలను కుదిపేసిన కరువు రక్కసి పై ప్రముఖ జర్నలిస్టు సాయినాథ్‌ రాసిన వ్యాస సంకలనం పేరిది. ఇది ఆయనకు రామన్‌ మెగసెసే అవార్డును సంపాదించి పెట్టింది. ఏదైనా సమస్య కనిపిస్తే దాని సకల లక్షణాల పై సవాలక్ష తీర్పులిచ్చేయడానికి, వాస్తవ దూరమైన వ్యాఖ్యానాలు చేయడానికే అందరూ ఉబలాటపడతారు తప్ప సరైన పరిష్కారాల పై సర్కారు సహా ఎవరూ చేసిందేమీ లేదన్నది దాని సారాంశం. దశాబ్దాల తరబడి రావణ కాష్టంలా రగులుతున్న కాశ్మీర్‌ సమస్య విషయంలోనూ ఇదే జరుగుతోంది.  

కాశ్మీర్‌ పై అనేక దేశాలు... మరీ ముఖ్యంగా అగ్రదేశమైన అమెరికా అంతులేని ఆసక్తిని ప్రదర్శిస్తుంటుంది. వీలు చిక్కినప్పుడల్లా అందులో జోక్యం చేసుకోవడానికి తహతహలాడుతుంటుంది. అత్యుత్సాహానికి పెట్టింది పేరైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా కాశ్మీర్‌ విషయంలో తన సహజ లక్షణాన్ని తరచూ బయటపెట్టుకుంటున్నారు. వివాదాస్పదమైన కాశ్మీర్‌ సమస్యపై భారత్‌ – పాకిస్తాన్‌ ప్రధాన మంత్రులతో తాను మాట్లాడానని, అవసరమైతే ఈ విషయంలో మధ్యవర్తిత్వం వహించేందుకు తాను సిద్ధమేనని తాజాగా ఆయన మరోమారు ప్రకటించారు. పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌తో ఇప్పటికే మాట్లాడేశానని, త్వరలో ఫ్రాన్స్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకుని కాశ్మీర్‌పై చర్చిస్తానని ట్రంప్‌ చెబుతున్నారు. ఫ్రాన్స్‌లోని తీరప్రాంత నగరం బియారిట్జ్‌లో జరగనున్న జీ 7 సదస్సు సందర్భంగా తాను మోదీని కలుస్తానని ఆయన అంటున్నారు. జీ7లో భారత్‌ సభ్యదేశం కాకపోయినా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మేక్రాన్‌ ఆహ్వానం మేరకు ఈ సదస్సుకు మోదీ హాజరవుతున్నారు. ఈ అవకాశాన్ని తనకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని ట్రంప్‌ భావిస్తున్నట్లు అర్ధమౌతోంది.  

వాస్తవానికి కాశ్మీర్‌లో ఏ చిన్న అలజడి కనిపించినా అమెరికా వెంటనే అలర్ట్‌ అయిపోతుంటుంది. మధ్యవర్తిగా జోక్యం చేసుకునేందుకు, పెద్ద మనిషి తరహాలో తీర్పులిచ్చేందుకు తహతహలాడుతుంటుంది. సరిగ్గా నెలరోజుల క్రితం కూడా అమెరికా అధ్యక్షుడు ఇలాంటి ప్రకటనే చేశారు. భారత ప్రధాని మోదీ అభ్యర్థిస్తే భారత్‌ – పాకిస్తాన్‌ మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి తాను సిద్ధమేనని అన్నారు. అమెరికా పర్యటిస్తున్న పాక్‌ ప్రధానిని కలుసుకున్న తర్వాత ట్రంప్‌ ఈ ప్రకటన చేశారు. దీని పై భారత్‌ నిరసన వ్యక్తం చేయడంతో కొద్ది రోజులకు ట్రంప్‌ తన స్వరం కొంచెం తగ్గించారు. ఉభయదేశాలు కోరుకుంటేనే కాశ్మీర్‌ విషయంలో తాను జోక్యం చేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు. అయినా అమెరికా అధ్యక్షుడి వైఖరిలో మార్పు లేదని, అవకాశం కోసం.. అదును కోసం ఎదురుచూస్తున్నారని తాజా ప్రకటనతో తేటతెల్లం అవుతోంది.  

కాశ్మీర్‌ సమస్యను ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలనేది భారత్‌ అనుసరిస్తున్న విధానం. 370 అధికరణం రద్దు, కాశ్మీర్‌లో తాజా పరిణామాల నేపథ్యంలో మరోమారు తతీయపక్ష మధ్యవర్తిత్వం అంశం తెరపైకి వచ్చింది. కానీ భారత్‌ వైఖరికే రష్యా, బ్రిటన్‌ మద్దతు పలికాయి. కాశ్మీర్‌ సమస్యకు ద్వైపాక్షిక చర్చలే పరిష్కారమన్న తమ వైఖరిలో మార్పులేదని మోదీతో బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ తెలియజేశారు. అమెరికా అధ్యక్షుడితో పాకిస్తాన్‌ ప్రధానమంత్రి చర్చలు జరుపుతున్న సమయంలోనే పాక్‌ విదేశాంగ మంత్రి ఖురేషి ఫ్రాన్స్‌ విదేశాంగ మంత్రి జీన్‌ యెస్‌ లీడ్రియన్‌తో మాట్లాడి భంగపడ్డారు. ‘కాశ్మీర్‌ మీ రెండు దేశాల అంతర్గత సమస్య, దానిని చర్చల ద్వారా పరిష్కరించుకోండి’ అని ఫ్రెంచి విదేశాంగ మంత్రి స్పష్టం చేయడం పాక్‌కు చెంపపెట్టు వంటిదే.

ఫ్రాన్స్‌ మాత్రమే కాదు బంగ్లాదేశ్‌ కూడా పాకిస్తాన్‌కు ఇలాంటి షాకే ఇచ్చింది. 370 అధికరణం రద్దు అనేది భారత ప్రభుత్వ నిర్ణయం.. అది ఆ దేశ అంతర్గత సమస్య.. అందులో జోక్యం చేసుకోవడానికేమీ లేదు అని బంగ్లాదేశ్‌ స్పష్టం చేయడం పాక్‌కు అశనిపాతంలా తగిలింది.  కాశ్మీర్‌ విషయంలో ట్రంప్‌ ఆత్రత వెనుక కారణాలు తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. అటు పశ్చిమాసియాలో ప్రాబల్యాన్ని కాపాడుకోవడం, ఇటు భారత ఉపఖండాన్ని చెప్పు చేతల్లో ఉంచుకునేందుకు ప్రయత్నాలు కొనసాగించడం అమెరికాకు చాలా అవసరం.. అమెరికా ‘పథకాలు’ నెరవేరాలంటే వ్యూహాత్మకంగానూ, భౌగోళికంగానూ అనుకూలంగా ఉన్న పాకిస్తాన్‌ చాలా కీలకం. అందుకే అది పాకిస్తాన్‌కు వంతపాడుతుంటుంది.

1962 చైనా – భారత్‌ యుద్ధ సమయంలో భారత్‌కు అమెరికా సహాయం చేసింది. విమానాలను, సైనిక సామగ్రిని అందించింది. అందుకు ప్రతిఫలంగా కాశ్మీర్‌పై మధ్యవర్తిత్వం వహించేందుకు అంగీకరించాలని భారత్‌ పై వత్తిడి చేసిందంటే అమెరికా ఈ విషయానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నదో అర్ధం చేసుకోవచ్చు. 1962 నవంబర్‌ 21న చైనా యుద్ధం ముగియగానే భారత, పాక్‌ విదేశాంగ మంత్రుల సమక్షంలో 24 మంది అమెరికా అధికారులు ఆరు రౌండ్లు చర్చలు జరిపారు. అవి 1963 జనవరిలో అసంపూర్తిగా ముగిసాయి. ఆ తర్వాత ఇక అమెరికా జోక్యానికి భారత్‌ ఎన్నడూ ఒప్పుకోలేదు. తతీయపక్ష జోక్యానికి ఏ నాడూ తావివ్వలేదు. 1972లో బంగ్లా యుద్ధం తర్వాత కుదిరిన సిమ్లా ఒప్పందమైనా, 1999లో సంతకాలు జరిగిన లాహోర్‌ డిక్లరేషనైనా ద్వైపాక్షిక చర్చల పర్యవసానమే తప్ప ఎవరి జోక్యాన్నీ భారత్‌ అంగీకరించలేదు. 2003–2008 మధ్య నాలుగంచెల ఫార్ములాపై పలు సందర్భాలలో జరిగిన చర్చలు కూడా ద్వైపాక్షికమే తప్ప మరెవరి ప్రమేయమూ లేదు. అంతెందుకు నల్ల సూరీడు నెల్సన్‌ మండేలా, ఐక్యరాజ్యసమితి చీఫ్‌ ఆంటానియో గుట్టెరాస్, నార్వే ప్రధాని ఎర్నా సోల్‌బర్గ్‌ సహా పలువురు అంతర్జాతీయ నాయకులు కాశ్మీర్‌ పై మధ్యవర్తిత్వానికి ముందుకొచ్చినా భారత్‌ వైఖరిలో మార్పులేదు. ఇక ముందూ ఇదే కొనసాగుతుంది తప్ప ట్రంప్‌ తహతహలకు తాళం వేసే పరిస్థితి ఉండదనే చెప్పాలి. 

మరిన్ని వార్తలు