జనాభిప్రాయం నిషిద్ధమా!

5 Nov, 2013 01:43 IST|Sakshi

ఎన్ని లోటుపాట్లున్నా మన దేశంలో ప్రజల ఆశలనూ, ఆకాంక్షలనూ ప్రతిబింబించేవి ఎన్నికలే. తమకు నచ్చిన ప్రతినిధిని ఎంచుకోవడానికి, నచ్చిన పార్టీకి పట్టంగట్టేందుకు అయిదేళ్లకోసారి సామాన్య పౌరులకు లభించే అవకాశమది.  రెండు దశాబ్దాలక్రితం ఎన్నికల సర్వేలూ, ఎగ్జిట్ పోల్స్ వంటివి మన దేశంలో ప్రవేశించాయి. అప్పటినుంచీ ఫలానా పార్టీకి ప్రజలు పట్టంగట్టబోతున్నారని మీడియా సంస్థలు ప్రకటించడం ప్రారంభమైంది. ఎన్నికల సమయంలోనూ, ఫలితాల ప్రకటనకు ముందూ ఈ సర్వేలు, ఎగ్జిట్ పోల్ ఫలితాలు ప్రజల్లో ఒకరకమైన ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఆ సర్వేలపై విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. అయితే, అలాంటి సర్వేలు ఎన్నికల వాస్తవ ఫలితాలను ప్రభావితం చేసినట్టు ఇంతవరకూ రుజువులేమీ లేవు. సర్వేలు ఏం ప్రకటించాయన్న అంశంతో నిమిత్తంలేకుండానే ఓటర్లు తీర్పునిస్తున్నారు. అయినా సరే...ఎన్నికల సర్వేలను నిషేధించాలని కేంద్రంలో యూపీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘాన్ని కోరింది. ఇలా కోరడం రాజ్యాంగం ప్రకారం పౌరులకుండే భావప్రకటనాస్వేచ్ఛకు విఘాతం కలిగించడమేనని ఆ పార్టీ గుర్తించినట్టు లేదు.
 
  ప్రభుత్వాల విధానాలపైనా, పోకడలపైనా... వాటి గుణదోషాలపైనా చర్చ జరిగి పాలకులు తమ పొరపాట్లను సరిదిద్దుకునే స్థితి ఉండటం నిజానికి ప్రజాస్వామ్యంలో ఆరోగ్యకరమైన లక్షణం. అయితే, మన దేశంలో కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ఇలాంటి చర్చ ఎంతో కొంత జరుగుతోంది. అదే సమయంలో ప్రజలు వేటిని సమస్యలుగా భావిస్తున్నారో, ఎలాంటి పరిష్కారాలను ఆశిస్తున్నారో తెలుసుకోవడానికి ఈ ఎన్నికల సర్వేలు ఉపయోగ పడుతున్నాయి. పోలింగ్ జరిగే రోజున ఓటేసి వస్తున్నవారిని ఎవరికి ఓటేశారో కనుక్కోవడం... ఏ పార్టీ విజేత కాబోతున్నదో అంచనా వేయడం కూడా ఉంది. ప్రజాశ్రేణులను భిన్న వర్గాలుగా, తరగతులుగా విభజించి ఎవరెవరిలో ఎలాంటి అభిప్రాయాలున్నాయో... ఆ వర్గాలూ, తరగతులూ ఏం కోరుకుంటున్నాయో చెప్పగలగడం నిజానికి ఒక సైన్స్. ఇలాంటి సర్వేలు నిర్వహించే సంస్థలు ఎదుర్కొనే సవాళ్లు సామాన్యమైనవి కాదు. సర్వేలో ప్రజాభిప్రాయం సరిగ్గా ప్రతిబింబించాలంటే ఎలాంటి ప్రశ్నలు వేయాలో, అందుకు ఏఏ అంశాలను ప్రాతి పదికలుగా తీసు కోవాలో, ప్రజలను ఎలా వర్గీకరించుకోవాలో సంస్థ నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. అలాగే, ఏ సంస్థ అయినా దేశమంతా తిరగడం, అందరి ప్రజలందరి అభిప్రాయాలు సేకరించడం ఆచరణ సాధ్యంకాదు. కొన్ని శాస్త్రీయమైన విధానాలను పాటిస్తే ఎన్నికల్లో ఏ గాలి వీస్తున్నదో, దేశం మొత్తం ఎటు మొగ్గబోతున్నదో చెప్పడం కష్టమేమీ కాదని మన దేశంలో అనేకసార్లు రుజువైంది. అలాగే, ఓటర్ల నాడిని పసిగట్టడంలో విఫలమైనవారూ ఉన్నారు. వీరిద్దరే కాక... తాము గెలవాలనుకుం టున్న పార్టీకి విజయాన్ని ‘అంటగట్టి’ అదే ప్రజాభిప్రాయమని దబాయించి, చివరాఖరిలో విశ్వసనీయతను పోగొట్టుకుని నగుబాటుపాలైనవారూ ఉంటున్నారు.
 
  కొత్తగా అందుబాటులోకొచ్చే ఏ సాధనాన్నయినా సద్వినియోగం చేసేవారూ, దుర్వినియోగం చేసేవారూ ఎప్పుడూ ఉంటారు. అంతమాత్రాన ఫలానా విధానాన్ని నిషేధించాలని కోరుకోవడ ం అప్రజాస్వామికమవుతుంది. ఎన్నికల సర్వేల్లో తమకు నచ్చని ఫలితం వచ్చినప్పుడు రాజకీయ పార్టీలు వాటిని వ్యతిరేకించడం, ఆ సర్వే నిర్వహించినవారికి ఉద్దేశాలను ఆపాదించడం కొత్తేమీ కాదు. 1997లో ఆనాటి కేంద్ర ప్రభుత్వం ఇలాంటి సర్వేలు నిర్వహించడం, ప్రకటించడం నిషిద్ధమని ప్రకటించింది. అయితే, ఆ నిషేధాన్ని ధిక్కరించి మీడియా సంస్థలన్నీ సర్వేలను నిర్వహించాయి. ఫలితాలను ప్రకటించాయి. అంతేకాదు...ఆ నిషేధాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. సర్వేల నిషేధం రాజ్యాంగ వ్యతిరేకమని అప్పట్లో సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. అయితే, ఎన్నికల్లోని అన్ని దశలూ పూర్తిగాకుండా వెల్లడించే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలవల్ల... ఇంకా ఎన్నికలు జరగాల్సిన ప్రాంతాల్లోని ప్రజలు ప్రభావితు లవుతున్నారని ఎన్నికల సంఘం గుర్తించి అలాంటివాటిపై నిషేధం పెట్టింది. మొత్తంగా పోలింగ్ పూర్తయ్యాకే ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించవచ్చని తెలిపింది. అలాగే, ఎన్నికలకు 48 గంటలముందు సర్వేల ఫలితాలను వెల్లడించడంపై కూడా నిషేధం ఉంది. అంతవరకూ ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు.
 
 కానీ, మొత్తంగా ఎన్నికల సర్వేలనే నిషేధించాలని సంకల్పించడం మన పాలకుల అంతరాంతరాల్లో గూడుకట్టుకుని ఉన్న అప్రజాస్వామిక వైఖరికి అద్దం పడుతున్నది. సర్వేలను నిషేధించాలన్న తన వాదనకు మద్దతుగా కాంగ్రెస్ చేస్తున్న వాదన వింతగా ఉంది. ఆ సర్వేలు బూటకమైనవట. ఆ సర్వేల మాటున ప్రజాభిప్రాయాన్ని మార్చడానికి ప్రయత్నిస్తున్నారట. అన్నిటిలోనూ అసలు, నకిలీ ఉన్నట్టే సర్వేల్లోనూ ఉండొచ్చు. కానీ, అలాంటి నకిలీ సర్వేలవల్ల నష్టపోయేదీ, నగుబాటుపాలయ్యేదీ ఆ సర్వే నిర్వహించే సంస్థలే. మన రాష్ట్రం విషయానికేవస్తే... తెలుగుదేశం అధికారంలోకి రావడం ఖాయమని 2004లోనూ, 2009లోనూ కొన్ని మీడియా సంస్థలు ప్రకటించాయి.

 

కానీ, జరిగిందేమిటి? రెండుసార్లూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ఘనవిజయం సాధించింది. ఆ రెండు సందర్భాల్లోనూ వైఎస్ సర్వే ఫలితాలపై కంగారు పడలేదు.  కానీ, కాంగ్రెస్ ఇప్పుడు భిన్నంగా వ్యవహరిస్తోంది. వచ్చే ఎన్నికల్లో తన ఓటమి ఖాయమని తెలిసి, సర్వేలను తొక్కిపెట్టడంద్వారా ఆ సంగతిని దాచడానికి ప్రయత్నిస్తోంది. ఇలాంటి ప్రయత్నాలద్వారా తనను తాను కాపాడుకోవడానికి, ప్రజల్ని వంచించడానికి ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే సర్వేలను నిషేధించాలని కోరుకుంటోంది. ఈ తరహా ప్రతిపాదన అసలు ఎన్నికల సంఘం నుంచే రావడం, మీ అభిప్రాయమేమిటో తెలపాలని అది వివిధ పార్టీలను కోరడం ఆందోళనకరమైన విషయం. ఇటువంటి ఆలోచనలు ప్రజాస్వామ్య వాతావరణానికి దోహదపడబోవని ఇలాంటి వారంతా గ్రహించాలి.

మరిన్ని వార్తలు