భారత్‌–జపాన్, 2+2

31 Oct, 2018 00:35 IST|Sakshi

దౌత్య సంబంధాలు ఏర్పడటంలోనూ, అవి చిక్కబడటంలోనూ ఎన్నో అంశాలు కీలకపాత్ర పోషి స్తాయి. అందుకే రెండు దేశాలు సాన్నిహిత్యాన్ని పెంచుకుంటుంటే... ఆ రెండు దేశాలతో లేదా వాటిలో ఒక దేశంతో విభేదాలున్న మూడో దేశం ఆ సాన్నిహిత్యాన్ని సంశయంతో చూస్తుంది. జపా న్‌లో రెండు రోజుల పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఆ దేశంతో కుదుర్చుకున్న ఒప్పం దాలను సహజంగానే ఇతర దేశాలకన్నా చైనా నిశితంగా గమనిస్తుంది. భారత్‌–జపాన్‌ల మధ్య ఏటా జరిగే వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లిన మోదీ ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంత ర్జాతీయ అంశాలపై చర్చలు జరిపారు.

ఈ సందర్భంగా ఆరు ఒప్పందాలపై ఇరు దేశాల మధ్యా సంతకాలయ్యాయి. ముఖ్యంగా రక్షణ రంగంలో ఇరు దేశాల సహకారం మరింత పెంపొందించేం దుకు ఈ శిఖరాగ్ర సమావేశంలో అంకురార్పణ జరిగింది. ఇంతవరకూ అమెరికాతో మాత్రమే ఉన్న మంత్రుల స్థాయి 2+2 చర్చల ప్రక్రియ విధానాన్ని జపాన్‌కు కూడా వర్తింపజేసేందుకు అంగీకారం కుదిరింది. అమెరికాతో రక్షణ శాఖ, విదేశాంగ మంత్రుల స్థాయిలో 2+2 చర్చల ప్రక్రియ సాగు తోంది. జపాన్‌తో ప్రస్తుతం ఇది కార్యదర్శుల స్థాయిలోనే ఉంది. అయితే దాన్ని మరింత విస్తృతం చేయడం కోసం 2+2 చర్చల ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించారు.

2+2 చర్చల్లో ఇరు దేశాలూ వ్యూహాత్మక, భద్రతా అంశాలపై లోతుగా చర్చించుకుంటాయి. రక్షణ రంగానికి సంబం ధించి రెండు దేశాలూ మరో కీలక నిర్ణయం తీసుకున్నాయి. తమ తమ సైనిక స్థావరాలను ఇరు దేశాలకూ చెందిన సైనిక దళాలు అవసర సమయాల్లో పరస్పరం వినియోగించుకోవడానికి వీలు కల్పించే ఒప్పందంపై చర్చలు ప్రారంభించాలని అంగీకారానికొచ్చాయి. ఈ మాదిరి ఒప్పందం మనకు ఇంతవరకూ అమెరికా, ఫ్రాన్స్‌లతో ఉంది.

ఇది జపాన్‌తో కూడా కుదిరితే ఆఫ్రికా ఖండం లోని ఏడెన్‌ జలసంధి సమీపంలో జపాన్‌కున్న జిబౌతి స్థావరం మన నావికా దళానికి అందు బాటులోకొస్తుంది. అలాగే  హిందూ మహా సముద్రంలోని అండమాన్, నికోబార్‌ దీవుల్లో భారత్‌ కున్న సైనిక స్థావరాలు జపాన్‌ ఆత్మరక్షణ దళాలకు వినియోగపడతాయి. మొన్న ఆగస్టులో ఇరు దేశాల రక్షణ మంత్రుల మధ్య చర్చలు జరిగినప్పుడు ఈ అంశం ప్రస్తావనకొచ్చింది. మోదీ, జపాన్‌ ప్రధాని షింజో అబేలు తాజాగా దీనిపై తదుపరి చర్చలు జరపాలన్న నిర్ణయానికొచ్చారు. 

అంతర్జాతీయంగా ఏర్పడుతున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రతి దేశమూ ఖండాంత రాల్లో తన సైనిక స్థావరాలు నెలకొల్పుకోవడానికి ప్రాధాన్యమిస్తోంది. మన దేశం హిందూ మహా సముద్ర ప్రాంత దేశమైన సేషెల్స్‌లో సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఎప్పటినుంచో అనుకుంటోంది. చైనాకు చెందిన పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్‌ఏ) హిందూ మహా సముద్ర ప్రాంతంలో తన ప్రాబల్యాన్ని క్రమేపీ విస్తరించుకోవడాన్ని గమనించాక మన దేశం ఈ నిర్ణయం తీసుకుంది. తొలుత స్థావరాల విషయంలో సేషెల్స్‌ సానుకూలత ప్రదర్శించినా స్వదేశంలో తీవ్ర వ్యతిరేకత రావడంతో మొన్నీ మధ్య వెనకడుగేసింది.

వాస్తవానికి సేషెల్స్‌ 2011లో సైనిక స్థావరం ఏర్పాటు చేయమని చైనాను కోరింది. అది అంగీకరించి ఆ పని పూర్తిచేసింది. సముద్ర దొంగల బెడద నివారణ కోసం ఇది అవసరమని సేషెల్స్‌ భావించింది. ఇప్పుడు భారత్‌ను కూడా అను మతిస్తే ఆ రెండు దేశాలమధ్యా మున్ముందు సమస్యలు తలెత్తి అవి యుద్ధానికి దారితీస్తే తమ భూభాగంలోనే అవి కత్తులు దూసుకునే ప్రమాదం ఏర్పడుతుందని అక్కడి విపక్షాలు ఆందోళన మొదలుపెట్టాయి. పర్యవసానంగా అది కాస్తా ఆగిపోయింది. యుద్ధ సమయాల్లో తమ దళాలకు అవసరమయ్యే ఆహారం, రక్షణ సామగ్రి తదితరాలను సాధ్యమైనంత తక్కువ వ్యవధిలో చేరే యడం కోసం ఈ స్థావరాలను నెలకొల్పుకుంటారు.

నిజానికి హిందూ మహా సముద్ర ప్రాంతాన్ని ఏ దేశమూ సైనిక స్థావరంగా వినియోగించుకోకుండా, దాన్ని శాంతి మండలంగా ప్రకటించాలని మన దేశంతో సహా చాలా దేశాలు కోరేవి. 60, 70 దశకాల్లో ఆసియా, ఆఫ్రికా దేశాలు దానిపై పట్టు బట్టేవి. 1971లో ఐక్యరాజ్యసమితి ఆ మేరకు తీర్మానం కూడా చేసింది. అప్పట్లో అమెరికా– సోవి యెట్‌ యూనియన్‌ల మధ్య ఉండే విభేదాల పర్యవసానంగా పసిఫిక్‌ మహా సముద్ర ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులుండేవి. తమ దగ్గర అలాంటి స్థితి ఏర్పడకూడదని హిందూ మహా సముద్ర ప్రాంత దేశాల భావన.

అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఎవరికి వారు పోటీలు పడి సుదూర తీర ప్రాంతాల్లో తమ సైనిక స్థావరాలుండాలని కలలు కంటున్నారు. జిబౌతి నిరంకుశ పాలనలో ఉన్న అతి చిన్న దేశం కనుక అక్కడ జపాన్‌ సైనిక స్థావరానికి అడ్డంకులు ఏర్పడలేదు. ఇప్పుడా స్థావరాన్ని మనం కూడా వినియోగించుకోవడానికి జపాన్‌ సంసిద్ధత వ్యక్తం చేసింది గనుక సేషెల్స్‌ వెనకడుగేయడం వల్ల వచ్చే నష్టం పెద్దగా ఉండదు. 
తూర్పు చైనా సముద్రంలోని కొన్ని దీవుల విషయమై చైనాతో ఏర్పడ్డ వివాదాల నేపథ్యంలో అంతర్జాతీయంగా తనకు మద్దతు కూడగట్టుకునేందుకు జపాన్‌ ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది.

అందులో భాగంగానే ఆ దేశం మనతో సాన్నిహిత్యాన్ని మరింత పటిష్టపరుచుకోవాలన్న ఉత్సు కతతో ఉంది. అయితే ఇరు దేశాల మధ్యా వాణిజ్యం అనుకున్నంతగా విస్తరించడం లేదు. ద్వైపాక్షిక వాణిజ్యంపై 2011లో భారత్‌–జపాన్‌లు ఒప్పందం కుదుర్చుకున్నా అందులో పెద్దగా పురోగతి లేదు. 2017–18లో మూడేళ్లనాటితో పోల్చినా వాణిజ్యం అంతంతమాత్రమే. ఆ దేశానికి మన ఎగు మతులైనా, అక్కడినుంచి మన దేశానికి దిగుమతులైనా ఒకలాగే ఉన్నాయి. ఈ శిఖరాగ్ర చర్చల సందర్భంగా ఆ అంశం కూడా ప్రస్తావనకొచ్చింది. అయితే జపాన్‌ తాను రూపొందించిన నావి కాదళ విమానాలను మనతో డజను వరకూ కొనిపించాలని అయిదేళ్లుగా ప్రయత్నిస్తోంది. ఈసారి కూడా ఆ విషయంలో జపాన్‌కు నిరాశే ఎదురైంది. ఏదేమైనా ఈ శిఖరాగ్ర సమావేశం సాధించింది తక్కువేమీ కాదు.

మరిన్ని వార్తలు