మన్యంలో మళ్లీ అలజడి

25 Sep, 2018 03:26 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కొన్నాళ్లుగా ప్రశాంతంగా ఉంటున్న ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ ఏజెన్సీలో మళ్లీ తుపాకుల మోత మోగింది. అరకు ఎమ్మెల్యే కిడారు సర్వేశ్వరరావు, అదే స్థానం నుంచి గతంలో గెలిచిన మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ ఆదివారం నక్సలైట్ల తుపాకి గుళ్లకు బలయ్యారు. తెలుగుదేశం ఆధ్వర్యంలో జరిగే గ్రామదర్శిని సభలో పాల్గొనేందుకు వెళ్తున్న ఆ ఇద్దరినీ దాదాపు 65మందికిపైగా నక్సలైట్లు అడ్డగించి అతి సమీపం నుంచి కాల్చిచంపారు. 2016 అక్టోబర్‌లో ఆంధ్రా–ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో దాదాపు 30మంది మావోయిస్టులు, గ్రేహౌండ్స్‌ కమాండర్‌ ఒకరు మరణించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులుండేవి. హత్యలు, ఎన్‌కౌంటర్లు, మందుపాతర పేలుళ్లతో అది అట్టుడికేది. కానీ విభజన తర్వాత 2016 నాటి ఎన్‌కౌంటర్‌ ఉదంతం మినహా చెప్పుకోదగిన ఘటన చోటుచేసుకోలేదు. అయితే అలాగని ఆ ప్రాంతం నక్సలైట్ల ప్రభావం నుంచి పూర్తిగా బయటపడలేదు.

అడపా దడపా వారి కార్యకలాపాల జాడ కనబడుతూనే ఉంది. పైగా మావోయిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 21 నుంచి విలీన వారో త్సవాలు మొదలయ్యాయి. ఇలాంటి నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలి. అంతేగాక కిడారి నిర్వహిస్తున్న మైనింగ్‌ వ్యాపారంపైనా, ఆయన నడుపుతున్న క్వారీపైనా మావో యిస్టులు హెచ్చరిస్తున్నారని చెబుతున్నారు. ఈ కారణం వల్లనే తాను గ్రామదర్శిని సభకు వెళ్లలేనని కిడారి చెప్పినా చంద్రబాబు వెళ్లితీరాలని ఆదేశించారని, చివరకు ఈ దారుణం చోటుచేసుకున్నదని అంటున్నారు. కనీసం ఏజెన్సీలో పోలీసు నిఘా సక్రమంగా ఉన్నా వారిద్దరూ క్షేమంగా తిరిగి రాగ లిగేవారు. ఇది లేదు సరిగదా... వారు పోలీసులకు సమాచారం అందించకుండా వెళ్లారని హోం మంత్రి చిన రాజప్ప అంటున్నారు. కానీ తాము బందోబస్తు కల్పించాలని స్థానిక పోలీసులను కోరా మని, కానీ వారు పట్టించుకోలేదని కిడారి వ్యక్తిగత సహాయకుడు చెబుతున్నారు.

ఇలాంటి సమ యాల్లో హోంమంత్రి స్థాయి నాయకుడు అన్నివైపుల నుంచీ సమాచారం తెలుసుకుని మాట్లాడాలి. కానీ ఆయన పోలీసులిచ్చిన ప్రకటన చదివి చేతులు దులుపుకున్నారని అర్ధమవుతోంది. వీరిద్దరి హత్య తర్వాత స్థానికంగా ఏ స్థాయిలో ఉద్రిక్త పరిస్థితులున్నాయో ఆయనకు తెలియనిది కాదు. నక్సలైట్ల ఘాతుకం గురించి ఫోన్‌లో సమాచారం ఇస్తే, అక్కడి నుంచి మృతదేహాలను మీరే తీసు కురండని ఒక ఎస్‌ఐ సలహా ఇచ్చారని కిడారి అనుచరుడొకరు చెబుతున్నారు. నాలుగు గంటల పాటు వారి మృతదేహాలు ఘటనాస్థలి వద్దే ఉండిపోయాయి. చివరకు అనుచరులే వాటిని తీసు కెళ్లాల్సివచ్చింది.

పోలీసులు చూపిన ఈ నిర్లక్ష్య వైఖరికి ఆగ్రహించి కిడారి, సోమ అభిమానులు రెచ్చిపోయి అరకు, డుంబ్రిగూడ పోలీస్‌స్టేషన్లపై దాడి చేశారు. భారీ విధ్వంసం సృష్టించారు. రికా ర్డులు, వాహనాలు కాలిబూడిదయ్యాయి. పోలీసులు ప్రాణభయంతో పరుగులు తీయాల్సి వచ్చింది.  కిడారి సర్వేశ్వరరావు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నుంచి గెలిచి ఏడాదిక్రితం తెలుగుదేశంలోకి ఫిరాయించారు. అధికార పార్టీలో చేరి, ఆ పార్టీ ఆదేశాలతో ఒక సభ నిర్వహించడానికెళ్తున్న ఎమ్మెల్యే మాటకే అక్కడ దిక్కులేని స్థితి ఉన్నదంటే చంద్రబాబు పాలన ఎంత అస్తవ్యస్థంగా సాగుతున్నదో అర్ధం చేసుకోవచ్చు. 
నక్సలైట్లు చీకటి మాటున ఈ దాడి చేయలేదు. మిట్ట మధ్యాహ్నం ప్రధాన రహదారి పక్కనే కాపుగాశారు.

అది మరీ మారుమూల ప్రాంతమేమీ కాదు. సెల్‌ఫోన్‌ టవర్లకు సమీపంలోనే ఘటనా స్థలి ఉంది. ఎలాంటి సమాచారాన్నయినా క్షణాల్లో బయటి ప్రపంచానికి చేరేయటం చాలా సులభం. కానీ నక్సలైట్ల దాడి తర్వాత అరగంటకుగానీ పోలీసులకు ఆ సంగతి తెలియలేదు. ఇంకా విచిత్రమేమంటే దాడికి పాల్పడినవారు నలుగురైదుగురు కాదు... వారు భారీ సంఖ్యలో ఉన్నారు. పైగా వారంక్రితమే వారంతా పొరుగు రాష్ట్రమైన ఒరిస్సా నుంచి వచ్చి ఉంటారని అంచనా వేస్తున్నారు. ఇంతమంది ఏజెన్సీలో ప్రవేశించినా నిఘా వర్గాలకు సమాచారం లేకపోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది. సాధారణంగా నక్సలైట్లు ఏదైనా వారోత్సవాలకు పిలుపునిచ్చినప్పుడు పోలీసులు ఏజెన్సీ ప్రాంతాన్ని జల్లెడ పడతారు. కానీ ఈసారి అలా జరగలేదు సరిగదా నిఘా సైతం లేదు. కనీసం మావోయిస్టులు వారోత్సవాలు నిర్వహిస్తున్నారు గనుక, అటువైపు వెళ్లొద్దని ప్రజా ప్రతినిధులకైనా సూచనలివ్వలేదు. 

ఇటీవలికాలంలో అధికారంలో ఉంటున్నవారు నిఘా వ్యవస్థలను ప్రతిపక్షాలపై నిఘా ఉంచేం దుకు వాడుకుంటూ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. చంద్రబాబు దీన్ని మరింతగా దిగజా ర్చారు. పొరుగునున్న తెలంగాణ రాష్ట్రంలో తమ పార్టీకి ఎక్కడెక్కడ గెలిచే అవకాశాలున్నాయో ఆరా తీసేందుకు ఇంటెలిజెన్స్‌ వ్యవస్థను అక్కడికి తరలించారు. కొన్నేళ్లక్రితం తెలంగాణలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించి ఆయన భంగ పడ్డారు. ఆయన సన్నిహితుడు రేవంత్‌రెడ్డి డబ్బు సంచులతో పోలీసులకు దొరికిపోయారు. టీఆర్‌ ఎస్‌ ఎమ్మెల్యేతో బాబు సంభాషణల ఆడియో బయటికొచ్చింది. తెలంగాణ పోలీసులు ఇంత పెద్ద ఆపరేషన్‌ నిర్వహిస్తే మీరేం చేస్తున్నారని అప్పట్లో బాబు ఇంటెలిజెన్స్‌ విభాగంపై విరుచుకుపడ్డా రని కథనాలు వెలువడ్డాయి.

బహుశా ఆ కారణం వల్ల ఈసారి ఇంటెలిజెన్స్‌ సిబ్బంది మొత్తం తెలం గాణలో మోహరించినట్టు కనబడుతోంది. ఇలాంటి అధ్వాన్నమైన పరిస్థితుల్లో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోవడంలో ఆశ్చర్యమేముంది? నక్సలైట్ల దాడి అనంతరం ఏజెన్సీ ప్రాంతంలో తీవ్ర స్థాయిలో గాలింపు మొదలైంది. అయితే ఇదంతా జాగ్రత్తగా సాగాలి. అమాయకు లైన గిరిజనులను వేధించకుండా దాడికి కారకులైనవారిని పట్టుకోవటంపైనే దృష్టి సారించాలి. అలాగే గిరిజనుల్లో అసంతృప్తిని రేకెత్తిస్తున్న మైనింగ్‌ కార్యకలాపాలు మూతబడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అప్పుడు మాత్రమే నక్సలైట్ల కార్యకలాపాలను నివారించటం సాధ్యం. 

మరిన్ని వార్తలు