‘ఎన్నికల’ విస్తరణ

6 Jul, 2016 01:15 IST|Sakshi

చాన్నాళ్లుగా ఊహాగానాలకే పరిమితమైన కేంద్ర కేబినెట్ విస్తరణ పని పూర్త యింది. మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గంలో మరో 19మంది చేరారు. అయిదుగురు మంత్రులను కేబినెట్‌నుంచి తొలగించారు. కొందరి శాఖలు మార్చారు. 2014 మే లో తొలిసారిగా ఏర్పాటుచేసిన మంత్రివర్గంలో 45మంది ఉండగా, ఆ ఏడాది నవంబర్‌లో మరో 21మందికి చోటు కల్పించారు. అయితే గోపీనాథ్ ముండే కన్నుమూత, సర్వానంద సోనోవాల్ అస్సాం ముఖ్యమంత్రిగా, రావుసాహెబ్ దన్వే మహారాష్ట్ర బీజేపీ చీఫ్‌గా వెళ్లడంవంటి పరిణామాలతో ప్రస్తుతం కేబినెట్‌లో 63మంది మంత్రులున్నారు.
 
 తాజా కూడికలు, తీసివేతలతో ఆ సంఖ్య 78కి చేరుకుంది. సహాయమంత్రి హోదాలో ఉంటున్న ప్రకాష్ జావదేకర్‌కు పదోన్నతి లభించి ఆయన కేబినెట్ మంత్రి అయ్యారు. అంతేకాదు... కీలకమైన మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖను కూడా అప్పగించారు. ఇంతవరకూ ఆ శాఖను చూస్తున్న స్మృతి ఇరానీ చేనేత, జౌళి శాఖకు మారాల్సివచ్చింది. ఆమె తీసుకున్న నిర్ణయాలపైనా, పనితీరుపైనా విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈ మార్పు జరిగిందనుకోవాలి. పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాలను చూస్తున్న వెంకయ్యనాయుడు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు మారారు. ఇంతవరకూ సమాచార శాఖ ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ అధీనంలో ఉంది. సీనియర్ పాత్రికేయుడు,ఎంపీ ఎంజే అక్బర్ విదేశీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి అయ్యారు. వాస్తవానికి కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని అందరూ భావిం చారు. కానీ ప్రమాణస్వీకారానికి ముందురోజే అందుకు సంబంధించిన ఊహా గానాలకు మోదీ తెరదించారు.
 
 ఎన్‌డీఏ ప్రభుత్వం రెండేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకుని మూడో ఏట అడుగు పెట్టింది. అందువల్ల ఇది సమీక్షకు సముచితమైన సమయంగా భావిస్తున్నానని, కనుకనే ఈ విస్తరణ అవసరమవుతున్నదని ఒక ఇంటర్వ్యూలో మోదీ చెప్పారు. అయితే సమీక్షకు మించి వివిధ రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల దృష్టే ఇందులో ప్రధానంగా ఉన్నదని విస్తరణ జరిగిన తీరును చూసి అంచనా వేయొచ్చు. రాజకీయ పక్షాలన్నీ ప్రధాన ఎన్నికల రణక్షేత్రంగా భావించే అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది మొదట్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆ రాష్ట్రంనుంచి ఇప్పుడు కొత్తగా తీసుకున్న ముగ్గురు కొత్త మంత్రులతో కలుపుకుంటే అక్కడినుంచి మొత్తంగా 16మందికి స్థానం కల్పించినట్టయింది.
 
 కేంద్ర మంత్రివర్గంలో ఇంతటి ప్రాతినిధ్యం మరే రాష్ట్రానికీ లేదు. ఆ ముగ్గురిలో కృష్ణరాజ్ దళిత మహిళకాగా, అనుప్రియ పటేల్ ఓబీసీల్లోని కుర్మీ కులస్తురాలు. మరేంద్రనాథ్ పాండే బ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తి. ఈ ముగ్గురిలో అనుప్రియ గత ఎన్నికల్లో బీజేపీ మిత్ర పక్షంగా పోటీచేసిన అప్నా దళ్ పార్టీ అధినేత. అదే కులానికి చెందిన బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) నేత నితీష్‌కుమార్ ఈమధ్య యూపీలో పలు సభల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో గణనీయంగా ఉన్న కుర్మీ కులానికి చెందినవారు అటువైపు ఆకర్షితులు కాకుండా చూడటమే అనుప్రియను తీసుకోవడంలోని ఆంతర్యమని సులభంగానే చెప్పొచ్చు. రెండు దశాబ్దాలుగా యూపీ దళితులు మాయావతి వెన్నంటే ఉంటున్నారు. దళిత వర్గానికి చెందిన కృష్ణరాజ్‌కు అవకాశం ఇవ్వడం ద్వారా ఆ ప్రభావాన్ని తగ్గించడానికి బీజేపీ ప్రయత్నించింది.
 
 రాష్ట్ర జనాభాలో 12 శాతంగా ఉన్న బ్రాహ్మణ కులస్తులను ఆకట్టుకోవడానికి పాండేకు అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న 75 ఏళ్ల కల్‌రాజ్ మిశ్రాను తప్పిస్తారని ఊహా గానాలొచ్చినా ఈ కారణంవల్లనే ఆయన జోలికి వెళ్లలేదనుకోవచ్చు. యూపీలో అధికారంలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ(ఎస్‌పీ)పై ఎటూ ప్రజల్లో వ్యతిరేకత వస్తు న్నది గనుక రాగల అసెంబ్లీ ఎన్నికల్లో తనకు మాయావతి నుంచే ప్రధానంగా పోటీ ఉంటుందని బీజేపీ అగ్ర నాయకత్వం అంచనా వేస్తోంది. కాంగ్రెస్‌కు కనీసం ఓట్లు చీల్చగల సత్తా కూడా లేదు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో యూపీ నుంచి బీజేపీ 73 ఎంపీ స్థానాలను గెల్చుకుంది. రాగల అసెంబ్లీ ఎన్నికల్లో అందుకు దీటుగా గెలిస్తే తప్ప అధికారాన్ని చేజిక్కించుకోవడం సాధ్యం కాదు. ఈ లక్ష్య సాధనే ఇప్పుడు ప్రధానంగా పనిచేసింది. అయితే వారణాసి నుంచి గెలిచిన మోదీ, లక్నో నుంచి ఎన్నికైన రాజ్‌నాథ్‌లు మినహాయిస్తే ఇప్పుడు కొత్తగా మంత్రులైనవారితో సహా అందరూ సహాయమంత్రులే.
 
  అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే మరో రాష్ట్రం ఉత్తరాఖండ్. సీనియర్ నేతలు భగత్‌సింగ్ కోషియారి, రమేష్ పోఖ్రియాల్ వంటి మాజీ సీఎంలను కూడా కాదని పెద్దగా ఎవరికీ తెలియని దళిత ఎంపీ అజయ్‌తాంతాకు అక్కడినుంచి అవకాశం ఇవ్వడం ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కావొచ్చు. ఇక గుజరాత్ కూడా ఏడాదిన్నరలో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లబోతోంది. పటేల్ కులస్తులు సాగించిన ఉద్యమం వల్ల బీజేపీ అక్కడ ఒడిదుడుకుల్లో ఉంది. అందువల్లే ఆ రాష్ట్రానికి కూడా సముచిత ప్రాతినిధ్యం లభించింది. 2018లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాజస్థాన్‌లో సైతం బీజేపీ పరిస్థితి ఏమంత సవ్యంగా లేదు.
 
 ఈమధ్య అక్కడ జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ మెరుగుపడిన దాఖలాలు కనిపించాయి. విస్తరణలో దీన్ని పరిగణనలోకి తీసుకున్నారు. తొలగించిన అయిదుగురిలో ఒకరైన నిహాల్‌చంద్ మేఘ్వాల్‌పై మాత్రమే అత్యాచారం వంటి తీవ్ర ఆరోపణలున్నాయి. మిగిలినవారి తొలగింపు కారణాలేమిటో తెలియాల్సి ఉంది. ఎన్నికల ప్రచారంలో తానే పలుమార్లు ప్రస్తావించిన ‘కనిష్ట ప్రభుత్వం-గరిష్ట పాలన’ సిద్ధాంతాన్ని ఈ విస్తరణలో నరేంద్ర మోదీ వదులుకోవాల్సి వచ్చింది. 78మంది మంత్రులుండటం ఉన్న పరిమితితో పోలిస్తే తక్కువే. అయితే జంబో కేబినెట్‌గా పేరుబడ్డ మన్మోహన్ సింగ్ కేబినెట్‌లో సైతం ఇంతమంది లేరన్నది నిజం. మొత్తానికి రాజకీయ సమీ కరణాలు, అవసరాల్లో కొన్ని రాజీలు తప్పవని ఈ కేబినెట్ విస్తరణ ద్వారా మోదీ రుజువు చేశారు.

>
మరిన్ని వార్తలు