రోజుకు 40 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం.. | Sakshi
Sakshi News home page

రోజుకు 40 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం..

Published Wed, Jul 6 2016 1:13 AM

రోజుకు 40 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం..

సాధ్యం చేస్తామంటున్న నిర్మాణ సంస్థలు
హైవేస్ కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీపై 14 - 15న సదస్సు

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15,000 కిలోమీటర్ల మేర హైవేల నిర్మాణం పూర్తి చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. పెద్ద సవాల్‌తో కూడుకున్నప్పటికీ రోజుకు 40 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం పరిశ్రమకు సాధ్యమేనని సీఐఐ నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ హైవేస్ కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ చైర్మన్, జీఎంఆర్ హైవేస్ సీవోవో ఎన్.వి.శెట్టి తెలిపారు. సీఐఐ ఈ నెల చేపట్టనున్న సదస్సు వివరాలను మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు. లక్ష్యాన్ని చేరుకోవాలంటే నూతన తరం సాంకేతిక పరిజ్ఞానం, నిర్మాణ విధానాలను భారతీయ కంపెనీలు అవలంభించాల్సిన తరుణం వచ్చిందని అన్నారు.

 నూతన విధానంలో..
గతంలో స్థలం, నిధులు ఉన్నా లేకపోయినా డెవలపర్లు బిడ్డింగ్‌లో పాల్గొనేవారు. తీరా స్థల సేకరణలో సమస్యలు తలెత్తేవి. నిర్మాణాలు ఆలస్యం అయ్యేవి. ప్రాజెక్టులు ఆగిపోయిన సందర్భాలూ ఉన్నాయని శెట్టి తెలిపారు. ‘ప్రస్తుతం హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ కింద హైవేల నిర్మాణ  ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ మోడల్ కింద ప్రాజెక్టు వ్యయంలో 40 శాతం మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తుంది. స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి ఎన్‌హెచ్‌ఏఐకి అప్పగిస్తుంది. ఇది పరిశ్రమకు పెద్ద ఊరటనిచ్చే అంశం’ అని వివరించారు.

 రెండు రోజుల సదస్సు..
హైవేస్ కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీపై జూలై 14 - 15 తేదీల్లో జాతీయ సదస్సును హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో సీఐఐ నిర్వహిస్తోంది. పర్యావరణ ప్రభావం, భద్రత, వేగవంతంగా నిర్మాణం తదితర అంశాలపై సదస్సు చర్చిస్తుందని సీఐఐ ట్రేడ్ ఫెయిర్స్ డెరైక్టర్ అశుతోష్ దేశ్‌పాండే తెలిపారు. ఈపీసీ విభాగంలో ప్రతి ప్రాజెక్టుకు ప్రత్యేక ఎస్క్రో ఖాతా ఉండాలన్న తమ విన్నపంపై కేంద్రం సానుకూలంగా స్పందించిందని ఆర్వీ అసోసియేట్స్ డెరైక్టర్ ఎం.కిశోర్‌కుమార్ చెప్పారు.

Advertisement
Advertisement