చరిత్రకు మూలాధారం

12 Dec, 2014 23:27 IST|Sakshi
చరిత్రకు మూలాధారం

భాష మానవ అస్తిత్వానికి మూలం. భావ వ్యక్తీకరణకే కాదు, బుద్ధి వికాసానికీ ఆలంబనగా నిలిచేది భాష మాత్రమే. చరిత్రగతిలో మార్పులు చెందుతూ కొత్తకొత్త రూపాలు సంతరించుకుంటుంది. భాష లిపిబద్ధమయ్యాక, ఒక తరం నుంచి మరో తరానికి ప్రవహిస్తూ వచ్చింది. చరిత్రకు ఆధారంగా నిలుస్తున్న శాసనాలే అందుకు నిదర్శనాలు.

శాసనాల చదువరులు ఇప్పుడు అతి కొద్దిమంది మాత్రమే ఉన్నారు. నేటితరంలో అరుదైన శాసనాల చదువరి గండవరం వెంకటరత్నం. పురావస్తు సహాయక సంచాలకుడిగా శాసనాలపై పరిశోధన సాగించిన ఆయన, అత్యంత ప్రాచీనమైన లిపిని సైతం చదవగల నేర్పరి ఆయన. చరిత్రకు మూలాధారమైన శాసనాలపై ‘సిటీప్లస్’తో పలు విషయాలను ముచ్చటించారు. అవి ఆయన మాటల్లోనే..
 
‘సూర్య చంద్రాదులు ఉన్నంత వరకు.. ఈ ధర్మాన్ని నిర్వర్తించగలరు’.. శాసనాల్లో లిఖితమైన తొలి పదం ఇదే. ఆనాడే ధర్మాన్ని గురించిన ప్రస్తావన శాసనాల్లో ఉంది. తెలుగునాట కనిపించే మొట్టమొదటి శాసనం క్రీస్తుశకం 200 నాటిది. బ్రహ్మీలిపిలో ఉన్న ఆ శాసనం గుంటూరు జిల్లా అమరావతిలో దొరికింది. అంతకు పూర్వం బౌద్ధమత ప్రచారం కోసం అశోకుడు తన దూతలను ఆంధ్ర దేశానికి పంపాడు. అశోకుడి నాటి శాసనాల ద్వారా ఈ విషయం తెలుస్తోంది.

పూర్తిగా తెలుగులో రాసిన శాసనాలు మనకు క్రీస్తుశకం ఆరో శతాబ్ది నుంచి దొరుకుతున్నాయి. భాషలో, లిపిలో ప్రతి మూడు శతాబ్దాలకు మార్పు సహజం. చరిత్రకు మూలాధారాలు శాసనాలే. భారతదేశంలో అశోకుడి ముందు లిపి అంటే సింధు నాగరికత నాటి పిక్టోగ్రఫీ మాత్రమే. దీనినే పిట్టల లిపి లేదా బొమ్మల లిపిగా వ్యవహరిస్తారు. తర్వాత రాజరాజ నరేంద్రుడి తామ్రశాసనం పశ్చిమగోదావరి జిల్లా పాతగండిగూడెంలో లభించింది. దక్షిణ భారతదేశంలో దొరికిన తొలి తామ్రశాసనం ఇదే.
 
హైదరాబాద్‌లో శాసనాలు..

శాసనాల్లో హైదరాబాద్ నగరానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. నగరానికి 30 కి.మీ దూరంలోని కీసరగుట్ట గుండురాతిపై పెద్ద అక్షరాలు తొలచబడి ఉన్నాయి. అది క్రీ.శ. 4వ శతాబ్దంలో పాలించిన విష్ణుకండినుల నాటిది. అక్కడ క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాల నాటివిగా గుర్తించిన బొమ్మల లిపికి సంబంధించి 400 ముద్రలు లభ్యమయ్యాయి. వాటిపై ఇప్పటికీ పరిశోధనలు జరుగుతున్నాయి. మూసీ ఒడ్డున చైతన్యపురి కాలనీలో పెద్దకొండరాతిపై క్రీస్తు శకం 4వ శతాబ్ది నాటి శిలాశాసనం బయటపడింది. తొలిసారి 1986లో ఆ శాసనాన్ని కాపీ చేయించాను.
 
అనుభవంతోనే సాధ్యం..

శాసనాలు చదవడం అనుభవంతోనే సాధ్యం. వేద పాఠశాలలో మూడు నుంచి పదో తరగతి వరకు సంస్కృతం చదువుకున్నాను. ఎస్‌వీయూలో సాహిత్య శిరోమణి, సంస్కృతంలోనే బీఈడీకి సమానమైన ‘శిక్షా శాస్త్రి’ పూర్తి చేశాను. తర్వాత కేంద్రీయ విద్యాపీఠంలో ఆచార్య కోర్సు, ఎంఏ సంస్కృతం, ఎంఏ ఆర్కియాలజీ చదువుకున్నాను. పురావస్తు శాఖలో 1985లో ఉద్యోగం వచ్చింది. అప్పటి నుంచి శాసనాల పరిశోధన మొదలైంది. శాసనాల పరిశోధనకు నేటితరం యువత ముందుకు రావాలి.

చరిత్ర పరిశోధనలపై అభిలాష పెంచుకోవాలి. అందుకు ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. లేకుంటే, భవిష్యత్తులో శాసనాలు చదివేవారే కరువైపోతారు. ‘ఎపిగ్రఫీ’ పూర్తిగా భాషా సాంస్కృతిక శాఖకు సంబంధించిన అంశం. ఇదివరకు భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడిగా పనిచేసిన చెల్లప్ప ఈ అంశంలో కొంతవరకు దీని అభివృద్ధి కోసం కృషి చేశారు. తర్వాత పట్టించుకున్న వారే లేరు. తెలుగు వర్సిటీ, భాషా సాంస్కృతిక శాఖలు ముందుకొచ్చి కృషిచేస్తే, శాసనాలను చదవగలవారు తయారవుతారు.
 
 సుధాకర్
 ఫొటోలు: కె. రమేష్ బాబు

 

మరిన్ని వార్తలు