మళ్లీ మొదటికి...!

19 Aug, 2014 22:47 IST|Sakshi

 సంపాదకీయం

ప్రతి కథా కంచికి చేరినట్టుగానే పాకిస్థాన్‌తో స్నేహ సంబంధాలు నెల కొల్పుకొనేందుకు చేసే ప్రతి యత్నమూ వైఫల్యంతో ముగుస్తున్నది. నరేంద్ర మోడీ ఆహ్వానాన్ని మన్నించి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆయన ప్రమాణస్వీకారానికి వచ్చాక ఏర్పడిన ఆశావహ వాతావరణం కాస్తా తాజా పరిణామాలతో భగ్నమైంది. విదేశాంగ కార్యదర్శుల స్థాయి చర్చలు మరో అయిదారు రోజుల్లో ప్రారంభం కానుండగా, కేంద్ర ప్రభుత్వ అభీష్టానికి భిన్నంగా పాకిస్థాన్ హైకమిషన ర్ అబ్దుల్ బాసిత్ కాశ్మీర్ వేర్పాటువాదులతో సమావేశం కావడంవల్ల ఈ స్థితి ఏర్పడింది. వాస్తవానికి ఈ సమావే శానికి చాలా ముందే... షరీఫ్ వచ్చి వెళ్లిన కొన్ని రోజులకే సరిహద్దులు ఎప్పటిలా ఉద్రిక్తంగా మారాయి. తాను శాంతి సందేశంతో వచ్చానని న్యూఢిల్లీ విమానాశ్రయంలో దిగిన వెంటనే షరీఫ్ ప్రకటించినప్పుడు అందరిలోనూ ఆశలు మోసులె త్తాయి. ఇరు దేశాలమధ్యా పరస్పర విద్వేషాల అధ్యాయం ఇక ముగు స్తుందని చాలామంది భావించారు. ఇదంతా మే నెలాఖరునాటి సం గతి. జూన్ నెల కొద్దో గొప్పో సజావుగా సాగింది. జూలైనుంచి సరిహ ద్దులు ఎప్పటిలా కాల్పులతో మోతెక్కాయి. అధీన రేఖ వద్ద కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలు యధావిధిగా మొదలయ్యాయి. గత పదిరోజుల్లోనూ కాల్పుల విరమణ ఉల్లంఘన ఘటనలు డజను వరకూ చోటుచేసుకున్నాయి. ఇవన్నీ మోడీ ప్రమాణానికి నవాజ్ షరీఫ్ వచ్చి వెళ్లాక జరిగినవి. అంత మాత్రాన అంతకుముందు అంతా బాగుందను కోవడానికి లేదు. సరిహద్దుల్లో కాల్పుల మోత ఎప్పుడూ ఆగిందే లేదు. మరి అలాంటపుడు మోడీ నవాజ్ షరీఫ్‌ను ప్రమాణ స్వీకారానికి ఎలా పిలిచారన్న ప్రశ్న ఆనాడే తలెత్తింది.

అయితే, సమస్యలున్నంత మాత్రాన చర్చలకు తలుపులు మూసే యాలనుకోవడం సరికాదు. అలాంటి సమస్యలున్నాయి గనుక చర్చల అవసరం మరింతగా ఉంటుంది. ఇరుగు పొరుగు దేశాలన్నాక పొరపొ చ్చాలు రాకతప్పదు. అందులోనూ భారత్, పాక్‌లు రెండూ దాయాది దేశాలు గనుక వీటి తీవ్రత మరింత ఎక్కు వగా ఉంటుంది. కనుక షరీఫ్‌ను ఆహ్వానిం చడం సరైందేనని శాంతి కాముకులు బలంగా వాదించారు. అలాగే, ఒకపక్క సరిహద్దుల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుంటున్నా కార్యదర్శుల స్థాయి చర్చలకు సిద్ధపడ టాన్ని కూడా అందరూ ఆహ్వానించారు. నిజానికి కాల్పుల విరమణ ఉల్లంఘనలు జరిగిన సందర్భాల్లో పాకిస్థాన్‌తో చర్చలు నిలిపేయాలని గట్టిగా డిమాండు చేసింది బీజేపీయే. నిరుడు నవంబర్‌లో న్యూయార్క్ లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ షరీఫ్‌తో సమావేశమైనప్పుడు దాన్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఆ సమావేశానికి ముందు సరిహ ద్దుల్లో గస్తీలో ఉన్న మన జవాన్లు అయిదుగురిని పాక్ సైనికులు కాల్చి చంపారు. అనంతర కాలంలో కూడా పాకిస్థాన్ ఈ బాణీనే కొనసాగించింది.

నవాజ్ షరీఫ్ న్యూఢిల్లీ వచ్చినప్పుడు కూడా ఆయనను కాశ్మీర్ వేర్పాటువాదులు కలవడానికి ప్రయత్నించారని, మోడీ అభ్యర్థనతో షరీఫ్ అందుకు నిరాకరించారని ఇప్పుడు ప్రభుత్వ వర్గాలు అంటు న్నాయి. ఈ సంగతినే పాక్ హైకమిషనర్‌కు చెప్పి, వేర్పాటువాదులను కలవొద్దని సూచించినా వినలేదన్నది కేంద్రం అభియోగం. అయితే, ఇరు దేశాలమధ్యా చర్చలు సాగే ప్రతి సందర్భంలోనూ, కాశ్మీర్‌లో జరిగే ఎన్నికల ముందు అక్కడి వేర్పాటువాదులతో పాక్ హైకమిషనర్  సమావేశం కావడం చాన్నాళ్లనుంచి రివాజుగా మారింది. గతంలో వాజ పేయి సర్కారు ఉన్నప్పుడు కూడా ఈ సంప్రదాయం ఉంది. అంతమా త్రాన ఆయనకు ఇలాంటి సమావేశాలపై సానుకూలత ఉందని భావిం చనవసరం లేదు. లోలోపల వ్యతిరేకత ఉన్నా వాజపేయి అయినా, తర్వాత వచ్చినా మన్మోహన్ అయినా అభ్యంతరం చెప్పలేదు. దీన్ని ఇకపై అంగీకరించరాదన్న దృఢ నిశ్చయం మోడీ సర్కారుకు ఉన్నదని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. అందుకు త్వరలో జరగబోయే జమ్మూ-కాశ్మీర్ ఎన్నికలు కారణమా లేక ఇటీవలికాలంలో సరిహద్దుల్లో తరచు చోటు చేసుకుంటున్న కాల్పుల విరమణ ఉల్లంఘనలు కార ణమా అనే ప్రశ్నలు అంత ముఖ్యం కాదు. సరిహద్దుల్లో కాల్పుల ఘట నలు జరుగుతున్న తరుణంలోనే కార్యదర్శుల సమావేశం తేదీలు ఖరా రయ్యాయి. జమ్మూ-కాశ్మీర్ ఎన్నికల ముందు వేర్పాటువాదులు ఇలా పాకిస్థాన్‌కు చెందిన ముఖ్యులతో సమావేశం కావడం...ఆ తర్వాత రాష్ట్రంలో నిరసన ప్రదర్శనలు ఊపందుకోవడం, ఉద్రిక్త వాతావర ణంలో ఎన్నికలు ముగియడం సంభవిస్తున్నది. ఈసారి కూడా అదే తంతు కొనసాగవచ్చునన్న అభిప్రాయం కేంద్రానికి ఉంటే ఉండొచ్చు. అయితే వేర్పాటువాదులకు కాశ్మీర్‌లో గతంలో ఉన్నంత ప్రజాదరణ లేదు. అందువల్ల వారివల్ల ఏదో అవుతుందనుకోనవసరం లేదు.

ఇప్పుడు కార్యదర్శుల స్థాయి చర్చలను నిలిపేయడం ద్వారా చర్చలకు ఒక కొత్త ప్రాతిపదికను కేంద్రం ఏర్పరిచింది. భవిష్యత్తులో తమతో చర్చలు జరపాలంటే ఈ తరహా చర్యలను పాక్ విరమించు కోవాల్సి ఉంటుందని చెప్పడమే కేంద్రం ఉద్దేశం.  చర్చలు సాగడానికి ఈ విషయంలో స్పష్టత ఇవ్వాల్సిన స్థితి పాక్‌కు ఏర్పడుతుంది. అక్కడి సైన్యానికీ, ప్రపంచ దేశాలకూ కూడా ఇది అర్ధమవుతుంది. ఇప్పటికైతే కాశ్మీర్ వేర్పాటువాదులను కలవడానికి తమకు ఎవరి అనుమతీ అవసరం లేదని పాక్ బింకంగా చెప్పవచ్చుగానీ భవిష్యత్తులో అది సాధ్యంకాదు. ఇరు దేశాలమధ్యా సామరస్యతకు కొత్తగా ఒక పెద్ద అడ్డంకి ఏర్పడటం ఇరు దేశాల్లోనూ శాంతిని కోరుకునే శక్తులకు నిరాశ కలిగించే పరిణామమే. అయితే, చర్చల దారి చర్చలదీ... తమ దారి తమదీ అన్నట్టుండే పాక్ తీరు కూడా మారాలి. తన విధానాలను అది పునస్సమీక్షించుకోవాలి.
 
 
 

 
 
 
 

మరిన్ని వార్తలు