‘ఏకపక్ష’ ప్రజాస్వామ్యం!

23 Mar, 2016 02:34 IST|Sakshi
‘ఏకపక్ష’ ప్రజాస్వామ్యం!

ప్రభుత్వ విధానాల్లోని లోటుపాట్లను చర్చించడమే పార్లమెంటరీ ప్రజాస్వా మ్యంలో చట్టసభల ప్రధాన బాధ్యతని లోక్‌సభ మాజీ స్పీకర్ పీఏ సంగ్మా ఒక సందర్భంలో అంటారు. ఆ బాధ్యతను నిర్వర్తించడానికి అనువైన వాతావరణం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కరువవుతున్నదని ఆ సభ కార్యకలాపాలు గమనిస్తున్న వారికి బోధపడుతుంది. ఈ నెల 5న ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు ఎప్పటి లాగే అధికార పక్షం అడ్డగోలు ధోరణులకు అద్దం పడుతున్నాయి. విపక్షం ఏ సమస్య లేవనెత్తినా, దేనిపైన నిలదీసినా ఎదురు ఆరోపణలు చేసి దబాయించడమే మందని అధికార పక్షం భావిస్తోంది. ఆ క్రమంలో కనీస విలువలకు కూడా తిలోద కాలిస్తోంది.

గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఈ నెల 10న చర్చ సందర్భంగా ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజధాని భూ కుంభకోణాన్ని ప్రస్తావించినప్పుడుగానీ...ఈనెల 14న అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగినప్పుడుగానీ...ఆ మర్నాడు స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానంపై సాగిన చర్చలోగానీ అధికార పక్షం ఈ తోవనే ఎంచుకుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మొదలుపెట్టి మంత్రులు, అధికారపక్ష సభ్యులు ఒకరి తర్వాత ఒకరు జగన్‌మోహన్‌రెడ్డిపై ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. వ్యక్తిగత విమర్శలతో, దూషణలతో ఆయనపై విరుచుకుపడ్డారు. రాజధాని ఎక్కడ వస్తుందో అయినవారికి ముందే లీకులిచ్చి చౌకగా భూములు కొనుగోలు చేయడా నికి వీలు కల్పించారని, అధికార రహస్యాలు కాపాడుతామన్న ప్రమాణాన్ని ఉల్లంఘించారని గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించి సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తే ‘సీబీఐ విచారణే కాదు...ఏ విచారణకూ ఒప్పుకోం...చేతనైంది చేసుకోండి’ అని ప్రకటించి చంద్రబాబు అందరినీ ఆశ్చర్యపరిచారు. పైగా సీబీఐ విచారణ కోరడంలో రాజ ధాని రాకుండా చేయాలన్న ఉద్దేశం ఉన్నదన్న తర్కం లేవదీశారు. దానిపై ఇంకా చర్చ సాగుతుండగానే ముగిసినట్టు ప్రకటించి, విపక్షాన్ని సస్పెండ్ చేసి బయటకు పంపించారు.
 
అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కూడా ఇదే నాటకాన్ని పొల్లుపో కుండా నడిపించారు. బడ్జెట్‌పై చర్చ సమయంలో ఇలాంటి పరిస్థితి తలెత్తితే అధికార పక్షం ఆదుర్దా పడుతుంది. ఆ చర్చ ముగిశాకే దేన్నయినా చేపట్టవచ్చునని వాదిస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరిగింది అందుకు భిన్నం. అవిశ్వాస తీర్మానం ఇచ్చినరోజే అధికార పక్షం దానిపై చర్చకు సిద్ధపడింది. అందుకోసం ఎంతో హడావుడి చేసింది. కారణం స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. విపక్షానికి విప్ జారీచేసే అవకాశం లేకుండా చేయడం ద్వారా తనవైపు ఫిరాయించిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలను రక్షించడమే అధికారపక్షం హడావుడి వెనకున్న ఆంతర్యం. చివరికొచ్చేసరికి ఆ తీర్మానంపై విపక్షం డివిజన్‌కు పట్టుబడుతుండగానే మూజు వాణి ఓటుతో అది వీగిపోయినట్టు ప్రకటించారు. ప్రభుత్వ వైఫల్యాలను, దుర్నీతినీ ప్రజల దృష్టికి తీసుకొచ్చేందుకే ఏ విపక్షమైనా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవే శపెడు తుంది. ఎవరు ఎటువైపున్నారో స్పష్టంగా తెలియడం కోసం ఓటింగ్‌కు పట్టుబడుతుంది. పాలనలో దశాబ్దాల అనుభవం గడించినవారికి ఈ సంగతి తెలియదనుకోలేం.

అయినా విపక్ష నేత ప్రసంగానికి ఒకవైపు శాసనసభ వ్యవహా రాల మంత్రి యనమల రామకృష్ణుడు పదే పదే అడ్డుతగలడం... మరోవైపు తీర్మానం మూజువాణి ఓటుతో వీగిపోయిందని స్పీకర్ ప్రకటించడం పూర్తయి పోయింది. ఆ మర్నాడు స్పీకర్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం విషయంలోనూ అధికారపక్షం తీరు ఇలాగే ఉంది. నోటీసు ఇచ్చాక 14 రోజుల తర్వాతే తీర్మానం ప్రవేశపెట్టాలన్న 71వ నిబంధనను సస్పెండ్‌చేసి అదే రోజు చర్చ జరపాలని నిర్ణయించారు. ఈ చర్యలోని ఆంతర్యమూ ఫిరాయింపు ఎమ్మెల్యేల రక్షణే! సభలో తగినంత బలం ఉన్నప్పుడూ, ప్రజల్లో తనపై చెక్కుచెదరని విశ్వాసం ఉన్నదని భావించినప్పుడూ అధికారపక్షం ఇలాంటి తీర్మానాలకు భయపడాల్సిన పనిలేదు. ఓటింగ్ కారణంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు పడే ప్రమాదం ఉన్నదని, వారిని మళ్లీ నెగ్గించుకోవడం కష్టమని భావించబట్టే పాలకులు ఇన్ని పిల్లిమొగ్గలు వేయాల్సివచ్చింది.

వైఎస్సార్ కాంగ్రెస్ శాసనభ్యురాలు రోజా విషయంలో వ్యవహరించిన తీరు వీటన్నిటికీ పరాకాష్ట. శీతాకాల సమావేశాల్లో ఆమెను సభనుంచి ఏడాదిపాటు సస్పెండ్ చేస్తూ మూజువాణి ఓటుతో తీర్మానం ఆమోదించినప్పుడే ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తి, 340(2) నిబంధన ప్రకారం సభ్యులను ప్రస్తుత సమావేశాలు ముగిసేవరకూ మాత్రమే సస్పెండ్‌చేసే అధికారం స్పీకర్‌కు ఉంటుందని చెప్పినా చెవికెక్కలేదు. సస్పెండ్ చేసేముందు ఆమె చెప్పేదే మిటో విందామన్న మిత్రపక్షం సూచన కూడా బేఖాతరే అయింది. ఆ నిబంధన కింద ఏడాదిపాటు సస్పెండ్ చేయడం ఎలా సాధ్యమని సుప్రీంకోర్టు ప్రశ్నించాక గానీ ప్రభుత్వానికి జ్ఞానోదయం కాలేదు.

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ నేతల ప్రమేయం ఉన్నట్టు ఫిర్యాదులందిన కాల్‌మనీ సెక్స్‌రాకెట్ విషయంలో ఎలాంటి చర్చా లేకుండా చేయడమే రోజా సస్పెన్షన్ వెనకున్న ఆంతర్యం. రికార్డులకెక్కని, లేని అంశాల ఆధారంగా ఒకరిని సస్పెండ్ చేయడం దేశ పార్లమెంటరీ చరిత్రలో కనీవినీ ఎరుగనిది. ఈ సందర్భంగా మొన్న జనవరిలో జరిగిన శాసనసభ నైతిక విలువల కమిటీ సమావేశంలో కొందరు ప్రముఖులు చేసిన సూచనలు పరిగణించదగ్గవి. శాసనసభను నడిపే వ్యక్తి నిబద్ధత కలిగి ఉంటే ఆ పదవికే గౌరవం వస్తుందని ఒకరంటే... అందుకోసం ఎన్నికైన పార్టీకి రాజీనామా చేయాలని మరొకరు సూచిం చారు.

అయితే ప్రత్యేకించి రోజా విషయంలో సాగిన ఏకపక్ష ధోరణిని ఎవరూ వేలెత్తిచూపినట్టు లేదు. రోజాకు సంబంధించిన వీడియోలు మాత్రమే ఎందుకు ప్రచారంలో ఉన్నాయి...అధికారపక్షం ప్రవర్తనను పట్టిచ్చేవి ఎందుకు విడుదల కాలేదని కూడా వారు ప్రశ్నించి ఉండాల్సింది. అప్పుడు అధికారపక్షం అసెంబ్లీని నడుపుతున్న తీరు మరింత తేటతెల్లమయ్యేది. ఏ వ్యవస్థ అయినా రాజ్యాంగానికి లోబడే పనిచేయాలి తప్ప దానికి అలీనంగానో, అతీతంగానో కాదు. సభదే తుది నిర్ణయమని, స్పీకర్‌కే సర్వాధికారాలుంటాయని బల్లగుద్ది చెప్పే అధికారపక్షం  దాన్ని మరోసారి చదువుకోవడం మంచిది.

మరిన్ని వార్తలు