దేశంలో 7.6 కోట్ల మందికి క‘న్నీరు’!

23 Mar, 2016 02:40 IST|Sakshi

సురక్షిత నీరందని వారు  భారత్‌లోనే అధికం
 
  కొచ్చి/న్యూఢిల్లీ: ప్రపంచంలో సురక్షిత నీరు అందుబాటులో లేక అత్యధిక మంది ఇబ్బందులు పడుతున్నది భారత్‌లోనే అన్న విషయం తాజా అధ్యయనంలో వెల్లడైంది. భారత్‌లో 7.6 కోట్ల మంది ప్రజలకు మంచినీరు అందుబాటులో లేదు. టాప్ 10 జాబితాలో భారత్ అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాత చైనా, నైజీరియా ఉన్నాయని వాటర్‌ఎయిడ్ సంస్థ నివేదిక వెల్లడించింది. పాక్ పదో స్థానంలో నిలిచింది. మంచి నీటి కోసం ఎక్కువ రేటు పెట్టి కొనాల్సిన పరిస్థితి నెలకొందని, నీటి వనరుల అస్తవ్యస్త నిర్వహణే దీనికి ప్రాథమిక కారణమని తేల్చింది. ప్రాజెక్టుల వద్ద సరైన సదుపాయాలు లేకపోవడమో లేదా పైపులైన్లు లేకపోవడం వల్లనో ప్రజలకు నీరు అందడం లేదని పేర్కొంది. మంగళవారం ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ఈ నివేదికను విడుదల చేసింది.

భారత్‌లో సురక్షిత నీరు లేక బాధపడుతున్న వారిలో అత్యధిక మంది రోజువేతనం రూ.300 కన్నా తక్కువగా ఉందని, వారు ట్యాంకర్ నుంచి నీటిని కొనాలంటే లీటర్‌కు ఒక రూపాయిపైనే వెచ్చించాల్సి వస్తోందని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో రెట్టింపు వ్యయం చేయాల్సి వస్తోందని పేర్కొంది. అభివృద్ధి చెందిన దేశాల్లో కనీస వేతనం పొందుతున్న వారికి నీటి వ్యయం లీటర్‌కు 0.1 శాతం ఉండగా, అది భారత్ లాంటి దేశాల్లో 17 శాతం వరకు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో 85 శాతం మందికి జలాశయాలు తాగునీటిని అందిస్తున్నా, 56 శాతం మందికి మాత్రమే అందుతోందని పేర్కొంది.

మరిన్ని వార్తలు