ఒకేసారి ఓటు ప్రజాస్వామ్యానికి చేటు

18 Sep, 2023 00:29 IST|Sakshi

కామెంట్‌

‘ఒకే దేశం– ఒకే ఎన్నిక’ను సమర్థించే వారి దగ్గర రెండు వాదనలు ఉన్నాయి. మొదటిది – ఖర్చు తగ్గుతుంది. రెండవది – ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల ఎన్నికల నియమావళి ఆంక్షలు దేశవ్యాప్తంగా ఒకే కాలానికి వర్తింపులో ఉంటాయి. దాని వల్ల అభివృద్ధి కుంటుపడదు. ఇక వ్యతిరేక వాదనలు వివేచన, వాస్తవికతల్లోంచి జనించినవి.

ఓటు హక్కును ‘ప్రజాస్వామ్యంలోని అత్యంత ప్రాథమికమైన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ’ అని చెబుతారు. ఆ హక్కుకు ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ విధానం పరిమితులను విధిస్తుంది. పార్లమెంటరీ ఎన్నికలు ఇప్పటికే అధ్యక్ష తరహా ఎన్నికలుగా మారుతున్న పరిస్థితుల్లో, ఈ ఏకకాల ఎన్నికలు పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని మొత్తంగానే నాశనం చేసే ప్రమాదం ఉంది.

‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ వల్ల ప్రయోజ నాలు, నిష్ప్రయోజనాలను నేను సరిగ్గా, సరళంగా, సమతులంగా చెప్పగలనేమో చూద్దాం! ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ అనే భావన పైన, ఆ ఆవశ్యకత పైన అవగాహన కోసం ఇది మీకు సహాయకారిగా ఉండవచ్చు.  

‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ను సమర్థించే వారి దగ్గర రెండు వాదనలు ఉన్నాయి. మొదటిది, ఖర్చు తగ్గుతుంది. కదా మరి, దేశ వ్యాప్తంగా ఒకేసారి ఐదేళ్లకు జరిగే ఎన్నికల ఖర్చు... వివిధ సమయా లలో అనేకసార్లు జరిగే పలు ఎన్నికల మొత్తానికీ అయ్యే ఖర్చు కంటే తక్కువగానే ఉంటుంది. అయితే థరూర్, చక్రవర్తి అదేమంత చెప్పు కోదగిన పొదుపు కాదని అంటున్నారు. ఏడాదికి రూ. 5,000 కోట్ల లోపే ఉండే ఆ పొదుపు మొత్తం లేకున్నా కూడా భారత్‌ వంటి ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థలో అది ఏమంత నిర్ణయాత్మకమైన ఆందోళన కారకం కాదనేది వారి వాదన.  

రెండవ అనుకూల వాదన ఏమిటంటే, దేశం మొత్తానికీ ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల ఎన్నికల నియమావళి ఆంక్షలు దేశవ్యాప్తంగా ఒకే కాలానికి వర్తింపులో ఉంటాయి. దాని వల్ల ఎప్పుడూ ఏదో ఒకచోట అమలులో ఉండే ఎన్నికల ఆంక్షల కారణంగా అభివృద్ధి కుంటుపడటం అనే సమస్య ఉండదు.

ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల నియమావళి అన్నది దేశవ్యాప్తంగా అమలుకావలసి ఉన్నప్పటికీ రాష్ట్ర స్థాయిలో ఆ నియమావళి అమలు పెద్ద విషయంగా ఉండటం లేదు. అసలు అమలవుతోందా అన్నది కూడా ముఖ్యమైన ప్రశ్న. అక్కడ ఆంక్షల్ని అతిక్రమిస్తున్నది అధికార పార్టీకి చెందినవారైతే నియమావళి నిస్సందేహంగా అమలు కానట్లే! 

ఇక వ్యతిరేక వాదనలు వివేచన, వాస్తవికతల్లోంచి జనించే ప్రాథమికమైన స్వభావం కలిగి ఉన్నవి. ఓటు హక్కును  ‘‘ప్రజాస్వా మ్యంలోని అత్యంత ప్రాథమికమైన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ’’ అని చెబుతారు. ఆ హక్కుకు ‘ఒకే దేశం– ఒకే ఎన్నిక’ పరిమితులను విధిస్తుంది. ఉదాహరణకు, ప్రభుత్వం తన మెజారిటీ కోల్పోయి నప్పుడు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ఓటర్లకు ఉన్న హక్కును హరించేలా పార్లమెంటును కొనసాగించే మార్గాల అన్వేషణ జరిగే అవకాశం ఉంటుంది.

అలాగే ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ అనే ఈ భావన మనం కోరుకుంటున్న ప్రజాస్వామ్య ప్రయాణ మార్గాన్ని విఘాత పరచనూవచ్చు. ఆ మార్గాన్ని మనం విస్తృతపరచుకోవడానికి, మరింత లోతుకు తీసుకు వెళ్లడానికి ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ విధానం అడ్డుపడుతుంది. ఉదా హరణకు, ఓటు వేసి ఎన్నుకున్న నాయకులను తిరిగి వెనక్కు పంపే హక్కు మనకు ఉండాలి.

50 ఏళ్ల క్రితమే 1974లో వాజ్‌పేయి ఈ ‘రీకాల్‌’ హక్కు అవసరాన్ని గుర్తించారు. అయితే ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ ఈ హక్కుకు విరుద్ధమైనది. ఐదేళ్లకోసారి ఎన్నికలు అనే విధానం... ఓటు వేసి, ప్రభుత్వాలను ఎన్నుకునేందుకు పౌరులకున్న అవకాశాన్ని కుదించడం ద్వారా మన ప్రజాస్వామ్యాన్ని ఇరుకైనదిగా మార్చేస్తుంది. 

ఇప్పుడిక ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ విధానం అమలుకు అవసర మైన రాజ్యాంగ సవరణల చిక్కుల దగ్గరికి వద్దాం. మొదటిది–ఎన్నికల ఏకకాలీనత కోసం సవరణలు! ఆ సవరణల వల్ల కొన్ని రాష్ట్రాల్లో శాసనసభలు పొడిగింపును పొందుతాయి. మరికొన్ని చోట్ల శాసనసభల కాలపరిమితిని కుదించాల్సి వస్తుంది. అప్పుడది కచ్చితంగా ప్రజాతీర్పునకు వ్యతిరేకంగా ఆడుతున్న ఆట అవదా?

ఓటర్లు ఇచ్చిన ఐదేళ్ల కాలాన్ని ఏకపక్షంగా తగ్గించడమో, పెంచడమో చేసినట్లే కదా! ఐదేళ్ల కన్నా ముందే ప్రభుత్వం పడిపోతే అప్పుడు రెండో రకం సవరణలు అవసరం అవుతాయి. మిగిలిన కాలానికి రాష్ట్రపతి పాలన రాష్ట్ర స్థాయిలో అవాంఛనీయమైనదీ, కేంద్రస్థాయిలో అసాధ్యమైనదీ. 

ఇందుకు ఒక పరిష్కారం– జర్మనీ తరహా నిర్మాణాత్మక అవిశ్వాస తీర్మానం. ఎలాగంటే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలం ఉంటే తప్ప అవిశ్వాస తీర్మానంతో ప్రభుత్వాన్ని పడగొట్టడానికి లేదక్కడ. పడగొట్టినవాళ్లే ప్రభుత్వాన్ని నిలబెట్టాలి. వినడానికి బాగుంది కానీ, ఆచరణలో ఎల్లవేళలా ఇది సాధ్యమా? ఉదాహరణకు, పాలకపక్షం నుంచి చీలిపోయిన పక్షం, ప్రతిపక్షం వైపు మొగ్గు చూపడానికి నిరా కరిస్తే అప్పుడేం జరుగుతుంది? ఆ పరిస్థితుల్లో ప్రభుత్వం తన మెజా రిటీని కోల్పోతుంది, కానీ ఆ స్థానంలోకి వచ్చేవారెవరూ లేకపోవడం వల్ల అలాగే కుంటుతూ నడుస్తుంది.

లేదా ఒకవేళ సంకీర్ణ కూటమిలోని భేదాభిప్రాయాల వల్ల బడ్జెట్‌కు పార్లమెంటులో ఆమోదం లభించలేదనే అనుకుందాం? అప్పుడిక పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో అటువంటి ప్రభుత్వం తప్పనిసరిగా రాజీనామా చేయాల్సిందే. కానీ çసభ్యుల బలం ఉన్న కారణంగా బడ్జెట్‌కు ఆమోదం పొందలేని ఆ ప్రభుత్వం ఏమీ కుప్పకూలి పోదు.

ఇలాంటి సందర్భాలలో ఐదేళ్ల కాల వ్యవధిలో మిగిలి ఉన్న కాలానికి మాత్రమే ఎన్నికలు నిర్వహించుకోవచ్చని ఎన్నికల సంఘం సూచించింది. అయితే అది ఓటు అనే వనరును నిర్లక్ష్యంగా ఉపయో గించుకున్నట్టు అవదా? ఓటు విలువ కొన్నిసార్లు ఐదేళ్ల కాలానికీ, మరి కొన్నిసార్లు ఐదేళ్లలో మిగిలిన భాగానికీ ఉంటుందా? ప్రజాస్వామ్యంలో రెండు రకాల ఓట్లు ఉండొచ్చా? 

ఇవీ ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ భావనకు సంబంధించి పైపైన ఆలో చిస్తేనే ఉత్పన్నమయ్యే ప్రాథమిక ఆందోళనలు. భారతదేశ ప్రజాస్వా మ్యానికి సంబంధించి మరొక మూడు ఆందోళనకరమైన ప్రశ్నలు కూడా ఉన్నాయి.

మొదటిది – పార్లమెంటరీ ఎన్నికలు ఇప్పటికే అధ్యక్ష తరహా ఎన్నికలుగా మారుతున్న పరిస్థితుల్లో, ఈ ఏకకాల ఎన్నికలనేవి ఆ ధోరణిని తీవ్రతరం చేసి మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని మొత్తంగానే నాశనం చేసే ప్రమాదం లేదా? రెండవది – ఒక జాతీయ పార్టీ మంచి ఊపులో ఉన్నప్పుడు, ఏక కాల ఎన్నికలు బహుళ పార్టీ వ్యవస్థను ఒకే పార్టీ ఉన్న దేశంగా మార్చకుండా ఉంటాయా? మూడవది – ఎన్నికలు మన ప్రజా శాసన సభ్యులను ప్రతిస్పందించే వారిగా, జవాబుదారీగా ఉండేవారిగా చేస్తాయని మనకొక నమ్మకం. అయితే ఐదేళ్లకోసారి మాత్రమే ఎన్నికలను నిర్వహిస్తే మధ్యలో ఏం జరిగినా వారు తమకు పట్టనట్లుగా, అహంకారంగా ఉండిపోయే అవకాశం లేదా?

ఈ సమస్యల గురించి జాగ్రత్తగా ఆలోచించండి. మరీ ముఖ్యంగా మూడు అంశాలపై మీరు దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది: ఏకకాల ఎన్నికల ఆవశ్యకత, వాటిని అమలు చేయడంలో వచ్చే చిక్కులు, అనంతరం వచ్చే పర్యవసానాలు. ఆ తర్వాత ‘ఇది సరైనదేనా?’ అనే ప్రశ్నకు జవాబు ఇచ్చుకోండి.
కరణ్‌ థాపర్‌ 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌

మరిన్ని వార్తలు