నికార్సయిన చర్య

24 Aug, 2019 00:52 IST|Sakshi

విపక్షంలో ఉన్నప్పుడు ఒకవిధంగా, అధికారంలో ఉన్నప్పుడు మరొకలా మాట్లాడటమే రివాజుగా మారిన వర్తమాన కాలంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అందరి ప్రశంసలూ అందుకొనే రీతిలో నిర్ణయాలు తీసుకుంటున్నారు.  రాష్ట్రంలో లోకాయుక్త నియామకం వీలయ్యేవిధంగా తీసుకొచ్చిన లోకాయుక్త సవరణ చట్టం–2019 అమలుకు గురువారం గెజెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయడం ఇందుకు తాజా ఉదాహరణ. అధికారంలోకొచ్చిన నెలరోజుల వ్యవధిలోనే లోకాయుక్త సవరణ బిల్లు ఆమోదానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇప్పుడు ఆ చట్టం అమలును నోటిఫై చేసింది. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారికి చిత్తశుద్ధి, సంకల్ప దీక్ష ఉంటే పను లు ఎంత చకచకా జరిగిపోతాయో చెప్పడానికి లోకాయుక్త సవరణ చట్టం మరో ఉదాహరణ.

తాను అధికారంలోకొస్తే పారదర్శక పాలనను అందిస్తానని, ప్రజలకు జవాబుదారీగా ఉంటానని ప్రజా సంకల్పయాత్ర సందర్భంగా జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. పారదర్శకమైన, నీతిమంతమైన పాలన అందిస్తానని ప్రమాణస్వీకారం రోజునే చెప్పారు. అధికారం ఒళ్లో వాలిన మరుక్షణమే వాగ్దా నాలన్నిటినీ గాలికొదిలే దుష్ట సంస్కృతే అన్నిచోట్లా రాజ్యమేలుతున్న కాలంలో  ఆయన తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను అదే వేదికపై చూపుతూ దీన్ని తాను ఖురాన్‌లా, బైబిల్‌లా, భగవద్గీతలా భావిస్తానని...అందులోని ప్రతి ఒక్క వాగ్దానాన్నీ నెరవేర్చడానికి త్రికరణ శుద్ధిగా కృషి చేస్తానని ప్రకటించారు. అంతక్రితం అయిదేళ్లూ రాష్ట్రాన్ని మహమ్మారిలా చుట్టుముట్టిన అవినీతిని అంతం చేయడానికి తీసుకోబోయే చర్యలేమిటో కూడా ఆరోజే వెల్లడించారు. టెండర్ల విధానంలో పార దర్శకత ప్రవేశపెడతామని, అవినీతికి కాస్తయినా చోటీయనివిధంగా రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు. ఇప్పుడు అమల్లోకి తీసుకొచ్చిన లోకాయుక్త సవరణ చట్టం ఆ వరసలో తదుపరి చర్యగా భావించాలి. 

మన దేశంలో రాజకీయ అవినీతి  ఎంతగా ఊడలు వేసిందో కనబడుతూనే ఉంది. ఎన్నడో 1966లో తొలిసారి మొరార్జీ దేశాయ్‌ నాయకత్వంలోని పాలనా సంస్కరణల సంఘం(ఏఆర్‌సీ) తాత్కాలిక నివేదికలో లోక్‌పాల్, లోకాయుక్తల ప్రస్తావన చేసింది. ఈ రెండు వ్యవస్థలూ అందు బాటులోకొస్తే ప్రజా సమస్యలు చాలావరకూ తీరుతాయని భావించింది. కానీ ఆ తర్వాత మరో అయిదారేళ్లకుగానీ తొలి లోకాయుక్త వ్యవస్థ ఆవిర్భవించలేదు. ఆ పని మహారాష్ట్ర చేసింది. చిత్ర మేమంటే...అనంతరకాలంలో మొరార్జీ దేశాయ్‌ ప్రధానిగా పనిచేసినా జాతీయ స్థాయిలో ఆయన లోక్‌పాల్‌ వ్యవస్థ తీసుకురాలేకపోయారు. మొన్న మార్చిలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ పినాకిచంద్ర ఘోష్‌ను తొలి లోక్‌పాల్‌గా నియమించారు. అవినీతి అంతం విషయంలో మన రాజకీయ నాయకత్వం ఎలా నత్త నడక నడుస్తుందో చెప్పడానికి ఇదో ఉదాహరణ.

ఆంధ్రప్రదేశ్‌లో నిక్షేపంలా ఉండే లోకాయుక్త వ్యవస్థకు  చంద్రబాబు తన హయాంలో తూట్లు పొడిచారు. ప్రస్తుత హైకోర్టు న్యాయమూర్తి లేదా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి లోకాయుక్త పదవికి అర్హులన్న ఆ చట్టంలోని నిబంధన అడ్డు పెట్టుకుని ఆ రెండు కేటగిరీల్లోనివారూ లభ్యం కావడంలేదని సాకు చెప్పి లోకాయుక్త నియామకం జోలికే బాబు పోలేదు. ఏ చట్టమైనా, నిబంధనైనా పనులు సజావుగా, సక్రమంగా సాగడానికే తప్ప వాటికి నిలువుగా, అడ్డంగా అడ్డుపడటానికి కాదు. అమలులో సమస్యలుంటే వాటిని అధిగమించడానికి ఏం చేయాలో ఆలోచించాలి. తనకు తోచకపోతే నిపుణుల సలహా తీసుకోవాలి. కానీ బాబు ఈ రెండూ చేయలేదు. ఇదే అదునని ఎడాపెడా నొల్లుకున్నారు. కుమారుడు లోకేష్‌ను కూడా తోడు తెచ్చుకున్నారు. వెరసి ఆంధ్రప్రదేశ్‌ అప్పట్లో అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. అదే సమయంలో ఆయన సూక్తిముత్యాలు వల్లించడానికి ఎక్కడా వెరవలేదు. నిప్పులాంటివాడినని చెప్పుకోవడం ఆపలేదు.  

జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన లోకాయుక్త సవరణ చట్టం అవినీతిపై బ్రహ్మాస్త్రమే. ఎక్కడ అక్రమాలు జరిగాయని భావించినా, ప్రజాధనం దుర్వినియోగమైందనుకున్నా లోకాయుక్త తనంత తానే దర్యాప్తు చేస్తుంది. ఎవరి ఫిర్యాదులనైనా విచారణకు స్వీకరిస్తుంది. అవినీతి, అక్రమాలపై వివిధ మాధ్యమాల్లో వచ్చే ఆరోపణలను పరిగణనలోకి తీసుకుంటుంది. ఆఖరికి ఊరూ పేరూ లేకుండా రాసే ఉత్తరాలకు సైతం విలువనిచ్చి విచారణ జరిపిస్తుంది. సారాంశంలో ఇది పాలనా వ్యవస్థలోని ఏ ఒక్కరూ అవినీతికి పాల్పడకుండా కట్టడి చేస్తుంది. అలాగే బాధ్యతారహితంగా నోటికొచ్చినట్టు మాట్లాడే రాజకీయ నాయకులకు, గాలి వార్తలు పోగేసే మాధ్యమాలకు కూడా క్రమశిక్షణ నేర్పుతుంది.

ఇష్టానుసారం ఏదంటే అది ఆరోపణ చేయడంకాక, చేసినవాటికి సాక్ష్యాధారాలు సమర్పించాల్సి వస్తుంది. లోకాయుక్త సవరణ చట్టం అమలైతే ఏమవుతుందో అందరికన్నా బాబుకు బాగా తెలుసు. అందుకే కాబోలు సంబంధిత బిల్లుపై శాసనసభలో చర్చ జరుగుతున్నప్పుడు అసంబద్ధమైన అంశాలను లేవనెత్తడానికి ఆయన విఫలయత్నం చేశారు. చివరకు తన పాచిక పారడంలేదని గ్రహించాక, సభలో ఉంటే ఎక్కడ మాట్లాడక తప్పని స్థితి ఏర్పడుతుందోనని జడిసి వాకౌట్‌ అస్త్రాన్ని ప్రయోగించి నిష్క్రమించారు. అంతక్రితం శాశ్వత బీసీ కమిషన్‌ ఏర్పాటుతోసహా అట్టడుగు వర్గాలకు, మహిళలకు లబ్ధి చేకూర్చే వివిధ చరిత్రాత్మక బిల్లుల విషయంలోనూ ఆయన ప్రవర్తన డిటోయే. అవినీతిని అంతం చేయడానికి మాటలు చాలవు. చేతలు అవసరం. ఒక్క రూపాయి ప్రజాధనం కూడా దుర్వినియోగం కానీయరాదన్న సత్సంకల్పం పాలకులకు ఉన్నప్పుడే ఆ ఆదర్శం అట్టడుగు స్థాయి వరకూ విస్తరిస్తుంది. కనుకనే లోకాయుక్త సవరణ చట్టం నోటిఫై చేయడం ప్రశంసించదగ్గ చర్య. ఇక నియామకం ప్రక్రియ కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తయి రెప్పవాల్చని నిఘాతో అది కర్తవ్య నిర్వహణకు పూనుకుంటుందని ఆశించాలి.

మరిన్ని వార్తలు