చరితార్థుడు సోమనాథ్‌ ఛటర్జీ

14 Aug, 2018 00:44 IST|Sakshi

ఉన్నత పదవుల నిర్వహణలో అందరిచేతా ప్రశంసలు అందుకునే నేతలు రెండు రకాలు. ఆ పద వికుండే బాధ్యతలు, పాటించాల్సిన ప్రమాణాలు, ఉండే పరిమితులు తెలుసుకుని వాటికి లోబడి చిత్తశుద్ధితో పనిచేసేవారు కొందరు. మరికొందరు అలా కాదు. ఆ పదవి ప్రాముఖ్యతనూ, అంత  రార్ధాన్నీ అవగాహన చేసుకుని, దాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లటానికి ప్రయత్నిస్తారు. కొత్త ప్రమాణాలు నెలకొల్పుతారు. భవిష్యత్తరాలకు మార్గదర్శకులుగా నిలుస్తారు. పది దఫాలు పార్ల మెంటేరియన్‌గా, ఒకసారి అత్యున్నత చట్టసభ లోక్‌సభకు స్పీకర్‌గా పనిచేసిన సోమనాథ్‌ ఛటర్జీ ఈ రెండో కోవకు చెందినవారు. 2004లో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆ కూటమికి వెలుపలి నుంచి మద్దతునిస్తున్న సీపీఎంకు స్పీకర్‌ పదవి ఇవ్వడానికి నిర్ణయించాక ఆ పార్టీ సహజంగానే సోమనాథ్‌ ఛటర్జీని ఎంపిక చేసింది. 33 ఏళ్లపాటు పార్టీ అధికార ప్రతినిధిగా, పార్ల మెంటులో పార్టీకి ప్రభావవంతమైన స్వరంగా నిలిచిన ఛటర్జీని సభా నిర్వహణలో తలమునకలై ఉండే పదవికి పరిమితం చేయాల్సిరావడం సీపీఎంకు అప్పట్లో ఇబ్బందికరమే.

ఏదైనా అంశంపై పది నిమిషాలు మాట్లాడవలసి వస్తే ఆ అంశంపై అవగాహన కోసం ఎంత సమయాన్నయినా వెచ్చించటం ఆయనకుండే అలవాటు. తాను ప్రసంగించాల్సిన సమస్యపై సమస్త వివరాలనూ సేకరించటం, గణాంకాల సహితంగా చెప్పటం ఆయన అనుసరించే విధానం. సభలో ఆయన నడవడి, సమస్యలపై ప్రసంగించే తీరు అందరినీ ఆకట్టుకోవడం వల్లే 1996లోఉత్తమ పార్ల మెంటేరియన్‌ అవార్డు నెలకొల్పినప్పుడు తొలిసారి ఆ అవార్డుకు ఆయన్ను ఎంపిక చేశారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీలో చదువుకునేటపుడు తరచు అక్కడి దిగువ సభ హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌కు హాజరవుతూ ఆ సభా నిర్వహణను గమనించడం, ప్రత్యేకించి విన్‌స్టన్‌ చర్చిల్, క్లెమెంట్‌ అట్లీల ప్రసంగాలనూ వినడం అనంతరకాలంలో ఆయన పార్లమెంటేరియన్‌గా రాణించడానికి దోహదపడ్డాయి.

ఆయనకు ముందూ, ఆ తర్వాత స్పీకర్‌ పదవిలోకొచ్చినవారు పార్టీలకతీతంగా పని చేస్తామని చెప్పినవారే. కానీ ఎక్కడో ఒకచోట దానికి భిన్నమైన అభిప్రాయం అందరిలోనూ ఏర్పడటానికి చోటివ్వనివారు తక్కువ. అయితే సోమనాథ్‌ ఛటర్జీ త్రికరణశుద్ధిగా తట స్థతను పాటించారు. అన్ని పక్షాల చేతా ప్రశంసలు అందుకున్నారు. అలాగని ఆయన ‘మర్యాద రామన్న’గా ఉండిపోలేదు. సభకు అంత రాయం కలిగించేవారిపై కటువైన వ్యాఖ్యలు చేసిన సందర్భాలున్నాయి. ‘పార్లమెంటును నిరవధిక వాయిదా వేయడమే ఉత్తమం అనుకుంటున్నాను. మీకందరికీ వృధాగా జీతభత్యాలివ్వడం శుద్ధ దండగ’ అని ఒక సందర్భంలో ఆయన ఆగ్రహంతో వ్యాఖ్యానించారు. వాస్తవానికి లోక్‌సభ సమా వేశాల ప్రత్యక్ష ప్రసారాలు ఆయన పట్టుబట్టడం వల్లనే సాధ్యమైంది. ఎంపీలెవరికీ ఇది నచ్చదని అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌  చెప్పారు. అయినా సోమనాథ్‌ ఛటర్జీ వినలేదు. తాము ఓట్లేసి గెలిపించిన చట్టసభల సభ్యులు అక్కడికెళ్లి ఏం చేస్తున్నారో తెలుసుకునే హక్కు ప్రజలకుందని, అందువల్ల ఈ ప్రసారాలు ప్రారంభించాల్సిందేనని ఆయన ప్రగాఢంగా విశ్వసించారు. ఒకసారి ఓటేశాక తాము ఎన్నుకున్నవారేం చేస్తున్నారో తెలుసుకోవాల్సిన అవసరం ప్రజలకు లేదని అను కునేవారికి నిజమైన ప్రజాస్వామ్యమంటే ఏమిటో ఛటర్జీ తెలియజెప్పారు.

సోమనాథ్‌ ఛటర్జీ రాజకీయ జీవితంలో 2008 అత్యంత కీలకమైన సంవత్సరం. యూపీఏ సర్కారు అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఆ ప్రభుత్వానికి వామ పక్షాలు మద్దతు ఉపసంహరించుకున్నాయి. పార్టీ నిర్ణయాన్ని గౌరవించి స్పీకర్‌ పదవినుంచి తప్పు కోవాలని, యూపీఏ సర్కారు ప్రతిపాదించిన విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేయాలని సీపీఎం ఇచ్చిన ఆదేశాలను ఆయన తోసిపుచ్చారు. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించవద్దని ఆయనకు కొందరు నేతలు నచ్చజెప్పడానికి ప్రయత్నించగా... మరికొందరు ఆయనపై తీవ్ర నిర్ణయం తీసు కోవద్దని పార్టీ నాయకత్వాన్ని ఒప్పించే ప్రయత్నం చేశారు. ఆ రెండు ప్రయత్నాలూ విఫలమై చివ రకు సీపీఎం పొలిట్‌బ్యూరో ఆయనను పార్టీ నుంచి బహిష్కరించింది. తనకు మార్గదర్శిగా, తాత్వి కుడి, హితుడిగా ఉన్న అగ్రనేత జ్యోతిబసు కూడా జోక్యం చేసుకుని చెప్పినా ఛటర్జీ తన వైఖరి మార్చుకోలేదు.

స్పీకర్‌గా ఎన్నికైన మరుక్షణం నుంచి పార్టీలకు అతీతంగా వ్యవహరిస్తున్నానని, అందువల్ల సీపీఎం నిర్ణయాన్ని శిరసావహించాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ బహిష్కరణ తన జీవితంలో ‘అత్యంత విషాదకరమైన రోజ’ని ఆయన వ్యాఖ్యానించినా ఏనాడూ పార్టీకి వ్యతిరేకంగా ఒక్క ప్రకటన కూడా చేయలేదు. ఎన్‌డీఏకు వ్యతిరేకంగా భావసారూ ప్యత గల పక్షాలన్నీ ఏకమై ఒక కూటమిగా ఏర్పడాలని బలంగా కోరుకున్నది ఆయనే. అప్పటికింకా పార్టీ నుంచి గ్రీన్‌సిగ్నల్‌ లేకపోయినా స్వీయ చొరవతో 2003 చివరిలో కాంగ్రెస్‌ అధినేత సోనియాగాంధీని కలిసి కూటమి అవసరాన్ని ఆమెకు ఛటర్జీ వివరించారని అంటారు. తర్వాత కాలంలో ఆ కూటమి ఊహించని రీతిలో విజయం సాధించటమే కాక వరసగా రెండు దఫాలు అధికారంలో కొనసాగింది. చివరకు ఆ కూటమి విషయంలో పార్టీతో వచ్చిన విభేదాలే సోమనాథ్‌ ఛటర్జీని రాజ కీయంగా కనుమరుగయ్యేలా చేశాయి.

రాజకీయాల్లో గెలుపోటములు, ఎదురుదెబ్బలు సహజం. కానీ ఎలాంటి పరిస్థితులేర్పడినా అనుకున్న సిద్ధాంతాలకూ, విలువలకూ కట్టుబడి ఉండటం... వాటికోసం దృఢంగా పోరాడటం చాలా అరుదు. స్పీకర్‌ స్థానంలో ఉన్నవారు ఎలా వ్యవహరించాలో, ఎంత నిష్పక్షపాతంగా ఉండాలో సోమనాథ్‌ ఆచరించి చూపారు. తమ కురచ బుద్ధులతో ఆ స్థానానికే కళంకం తెస్తున్న వారు ఇలాంటి ఉన్నతస్థాయి ఆచరణ నుంచి కాస్తయినా నేర్చుకోగలిగితే మన చట్టసభల విశ్వసనీ యత పెరుగుతుంది. ప్రజలకు ప్రజాస్వామ్యంపై నమ్మకం కలుగుతుంది. ఛటర్జీకి అదే నిజమైన నివాళి అవుతుంది.
 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఇంటర్‌ బోర్డుకు భంగపాటు

నిర్లక్ష్యానికి మూల్యం

సమస్యల ‘చదువు’

పడకేసిన ‘జెట్‌’

ఉగ్రవాద అస్త్రం

దొంగలపాలైన ‘ఆధార్‌’

ఈసీ కొరడా!

ఏదీ క్షమాపణ!

పారదర్శకతకు నీరాజనం

ఆఖరి ఎత్తులు!

‘తొలి దశ’కు అంతా సిద్ధం

ఇకనైనా శంకలు తీరేనా?

బ్రిటన్‌ను వణికిస్తున్న ‘బ్రెగ్జిట్‌’

మాఫియా రాజ్యానికి ఎదురుదెబ్బ

సమాచారహక్కుకు మరో గండం

మళ్లీ ‘సంక్షేమ బాట’లో...

నాయకుల ‘అవాక్కులు’!

‘వయనాడ్‌’ కలకలం

ఉత్పాతాల కాలం!

బాబుకు చెంపపెట్టు!

ట్రంప్‌కు క్లీన్‌చిట్‌!

అందరి దృష్టి ఎన్నికల కమిషన్‌పైనే

అడ్వాణీ మౌన నిష్క్రమణ

దక్కని న్యాయం

కనీసం ఇప్పుడైనా...

ఎట్టకేలకు లోక్‌పాల్‌

విలక్షణ వ్యక్తిత్వం

ఉన్మాద కాండ

మళ్లీ మోకాలడ్డిన చైనా

భద్రతే ప్రాణప్రదం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కొత్త సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌..వెరీ స్పెషల్‌!

షూటింగ్‌ సెట్‌లో అయాన్‌, అర్హా

వారి మధ్య స్మాష్‌ అయిపోయా..!!

రూ 18 లక్షల బ్యాగ్‌తో సోనం జిగేల్‌..

‘సీత’ ఎప్పుడొస్తుందో!

హీరోయిన్‌ను నిజంగానే ఏడిపించారు!