ప్రభుత్వాలు కళ్లు తెరవాలి

7 Feb, 2018 03:13 IST|Sakshi
సుప్రీంకోర్టు

లేని పెద్దరికాన్ని తెచ్చుకుని సమాజంపై స్వారీ చేస్తున్న బృందాలకు మళ్లీ  సర్వోన్నత న్యాయస్థానం నుంచి మొట్టికాయలు పడ్డాయి. పెళ్లీడు వచ్చిన ఆడ, మగ వివాహం చేసుకుంటే అందులో జోక్యం చేసుకునే హక్కు వ్యక్తులకు గానీ, బృందాలకుగానీ, కుల పంచాయతీలకుగానీ లేదని సోమవారం సుప్రీంకోర్టు ధర్మాసనం విస్పష్టంగా చెప్పింది. హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌లలో సమా జానికి, ముఖ్యంగా మహిళలకు బెడదగా పరిణమించిన ఖాప్‌ పంచాయతీల తీరును, వాటి విషయంలో పట్టనట్టు ఉంటున్న ప్రభుత్వాల వైఖరిని ప్రశ్నిస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరుపుతున్న సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రేమ పెళ్లి చేసుకున్నవారిని ఊరి నుంచి వెలేయడం దగ్గరనుంచి వారిని హత్య చేసేవరకూ ఈ ఖాప్‌ పంచాయతీలు సాగి స్తున్న అరాచకాలకు అంతూ పొంతూ లేదు. ఆడపిల్లలు బయటకు వెళ్తే సెల్‌ఫోన్‌ వాడకూడదని, 40 ఏళ్లలోపు మహిళలు బయటకు వెళ్లాల్సివస్తే తలపై వస్త్రం కప్పుకోవాలని, ఒంటరిగా వెళ్లకూడదని, సూర్యాస్తమయం అనంతరం బయటికే రాకూడదని, వారి దుస్తులు ఫలానా విధంగా మాత్రమే ఉండాలని, సగోత్రీకుల మధ్య వివాహం జరిగితే ఊరుకోబోమని అయిదేళ్లక్రితం హర్యానాలోని ఖాప్‌ పంచాయతీ తీర్మానాలు చేసింది. ఈ ఖాప్‌ పంచాయతీల ఆగడాలపై వ్యంగ్య చిత్రాన్ని నిర్మించిన దర్శకుడి తల తెచ్చి ఇచ్చినవారికి 51 గేదెలు బహుమానంగా ఇస్తామని 2015లో ఉత్తరప్రదేశ్‌లోని ఖాప్‌ పంచాయతీ ప్రకటించింది. అదే ఏడాది హర్యానాలో తల్లిదండ్రులు కుదిర్చి చేసిన పెళ్లిని సైతం ఒక ఖాప్‌ పంచాయతీ రద్దు చేసింది. పెళ్లయి అయిదు నెలలయ్యాక ఇద్దరూ అన్నాచెల్లెళ్లలా ఉండాలంటూ ఫర్మానా జారీచేసింది. గ్రామం వెలివేసిన పరిస్థితుల్లో వారిద్దరూ గత్యంతరం లేక పంజాబ్‌ హర్యానా హైకోర్టును ఆశ్రయించవలసి వచ్చింది.

నిజానికి ఈ దేశంలో ప్రజలెన్నుకున్న చట్టసభలున్నాయి. వాటి ద్వారా ఏర్ప డిన ప్రభుత్వాలున్నాయి. ఇటీవలి కాలంలో ప్రభుత్వాల ఉనికి పోలీసుల అత్యు త్సాహం వల్లా, పన్నుల విధింపు ద్వారా తప్ప ప్రజలకు ఇతరత్రా తెలియడం లేదు. అధికార పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలే అధికారులపైనా, సామాన్యులపైనా దాడు లకు దిగడం పెరిగింది. ఇక ఖాప్‌ పంచాయతీలనూ, గోరక్షణ బృందాలనూ, మతోన్మాదంతో రెచ్చిపోయే ముఠాలనూ అదుపు చేయడం గురించి అడిగేదే ముంటుంది? అందువల్లే ‘శక్తివాహిని’ అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టును ఆశ్ర యించాల్సివచ్చింది. ఈ వ్యాజ్యం దాఖలై కూడా అయిదేళ్లవుతోంది. ఎప్పుడో ఒకప్పుడు న్యాయస్థానానికి సంజాయిషీ ఇచ్చుకోవాల్సివస్తుందని, కనుక ఒళ్లు దగ్గర పెట్టుకుని వ్యవహరించాలని ఇన్నేళ్లలో ఏ ఒక్క ప్రభుత్వానికీ అనిపించలేదు. ఈ అయిదేళ్లలో పలు రాష్ట్రాల్లో వేరే పార్టీల ప్రభుత్వాలు వచ్చాయి. కేంద్రంలో యూపీఏ నిష్క్రమించి, ఎన్‌డీఏ ఏలుబడి ప్రారంభమైంది. అయినా ఈ బృందాల ఆగడాలు మాత్రం యథాప్రకారం సాగుతున్నాయి. పైగా ఈ మాదిరి బృందాలు, వాటి ఆగడాలు మరింతగా పెరిగాయి. సారాంశంలో రాజకీయ పక్షాలన్నీ ఈ బృందాల ముందు మోకరిల్లుతున్నాయి. వాటి చేతుల్లో ఓటు బ్యాంకులున్నాయన్న ఏకైక కారణంతోనే ఇలా వ్యవహరిస్తున్నాయి. బహుశా సుప్రీంకోర్టు కూడా ఈ సంగతిని గ్రహించి ఉండొచ్చు. అందువల్లే సమాజంపై స్వారీ చేస్తున్న ఈ నానా రకాల బృందాల విషయంలో ఏం చేయాలన్న సూచనలిచ్చేందుకు సీనియర్‌ పోలీస్‌ అధికారులతో కమిటీని నియమించే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఈ విషయమై రెండు వారాల్లో మార్గదర్శకాలను తయారు చేస్తుందని అదనపు సొలిసిటర్‌ జనరల్‌ సుప్రీంకోర్టుకు తాజాగా చెబుతున్నారు. 

 విచారణ సందర్భంగా ఖాప్‌ పంచాయతీల తరఫు న్యాయవాది వినిపించిన వాదనలు గమనించదగ్గవి. 1955నాటి హిందూ వివాహ చట్టంలోని సెక్షన్‌ 5 సగోత్రీకుల మధ్య వివాహబంధాన్ని నిషేధిస్తున్నదని ఆ న్యాయవాది వివరించారు. ఖాప్‌ పంచాయతీలు అలాంటి వివాహాలను మాత్రమే వ్యతిరేకిస్తున్నాయని సంజా యిషీ ఇచ్చారు. అయితే పెళ్లీడు వచ్చిన ఇద్దరు వ్యక్తుల మధ్య వివాహం జరి గినప్పుడు ఏ ఒక్క వ్యక్తి లేదా బృందం, సమాజం జోక్యం చేసుకోవడానికి, ఆ దంపతులను వేధించడానికి వీల్లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎవరితో సహ జీవనం చేయాలో, జీవితాంతం కలిసి ఉండాలో ఎంపిక చేసుకునే హక్కు యుక్త వయస్కులందరికీ ఉంటుందని చెప్పింది. ఆ వివాహం చెల్లుతుందో, లేదో...అది సక్రమమో కాదో చెప్పేందుకు న్యాయస్థానాలకు తప్ప మరెవరికీ అధికారం లేద న్నది. ఇది సామాజికాంశం తప్ప, చట్టపరమైనది కాదని ఖాప్‌ న్యాయవాది చేసిన వాదనను అంగీకరించలేదు. 

ఖాప్‌ పంచాయతీలు, ఇతర ప్రైవేటు బృందాలు నిర్వహిస్తున్నవారికి చదువు సంధ్యలు సక్రమంగా లేని కారణం వల్లనే ఇలా అనాగరికంగా వ్యవహరిస్తారని చాలామందిలో అపోహలుంటాయి. తోటి మనుషులతో మర్యాదగా మెలగాలని, వారిని అగౌరవపర్చడం, వారిపై పెత్తనం చలాయించడం, దౌర్జన్యం చేయడం నాగరిక లక్షణం కాదని తెలియడానికి చదువు అవసరం లేదు. ఇంగితజ్ఞానం ఉంటే చాలు. తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పరిశీలించడం ద్వారా వచ్చే అతి సాధారణ జ్ఞానాన్నే ఇంగితజ్ఞానం అంటారు. ఈ బాపతు బృందాలను వెంటేసుకు తిరిగే వారికి ఆ జ్ఞానం కూడా లోపిస్తోంది. ఇలాంటివారు సమాజాన్ని బాగు చేస్తామని బయల్దేరితే ఆ సమాజం ఎంతటి దురవస్థలో పడుతుందో చెప్పనవసరం లేదు. విచారణ సందర్భంగా న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు ఎటూ మూర్ఖత్వంలో కూరుకుపోయినవారిలో మార్పు తీసుకురాలేవు. కఠిన శిక్షలే వారికి మందు. కనీసం ప్రభుత్వాలైనా కళ్లు తెరవాలి. ఈ బృందాల కారణంగా రాజ్యాంగ విలువలు, పౌరు లకు అది ప్రసాదించిన హక్కులు ధ్వంసమవుతున్నాయని గుర్తించాలి. కనీసం ఓటేసి గద్దెనెక్కించిన పౌరుల మాన ప్రాణాలు కాపాడటం తమ ప్రాథమిక కర్తవ్య మని తెలుసుకోవాలి. ప్రైవేటు బృందాల ఆగడాలను అరికట్టేందుకు సమగ్రమైన, కఠినమైన చట్టం తీసుకురావాలి. 

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా