రైల్వే సంస్కరణలకు గ్రీన్‌సిగ్నల్‌

27 Dec, 2019 01:54 IST|Sakshi

రవాణా రంగంలో శతాబ్దిన్నరకు మించి అనుభవం గడించి, రోజూ 22,000 రైళ్లు నడుపుతూ ప్రపంచ రైల్వేల్లోనే నాలుగో స్థానం ఆక్రమించిన మన రైల్వే వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ దిశలో తొలి అడుగుగా దాని పాలనా వ్యవహారాలను పర్యవేక్షించే రైల్వే బోర్డును కుదించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది.  స్వాతంత్య్రం వచ్చేనాటికి మన దేశంలో 53,596 కిలోమీటర్ల రైలు మార్గంవుంది. అదిప్పుడు మరో 13,772 కిలోమీటర్ల మేర మాత్రమే పెరిగిందంటే దాని వృద్ధి ఏమేరకువుందో అర్ధమవుతుంది. అప్పటితో పోలిస్తే అది నిత్యం నిర్వహించాల్సిన రైళ్ల సంఖ్య ఎన్నో రెట్లు పెరిగింది. 

స్టేషన్లు ఎక్కు వయ్యాయి. ప్రయాణికుల సంఖ్య కూడా ఊహకందనివిధంగా పెరిగింది. 29 రాష్ట్రాలూ, మూడు కేంద్ర పాలిత ప్రాంతాలూ, 8,500 స్టేషన్లువున్నాయి. వేలాది రైళ్లు రోజూ 2 కోట్ల 30 లక్షలమంది ప్రయాణికులను చేరేస్తాయి. సరుకు రవాణా రోజుకు 30 లక్షల టన్నులమేర విస్తరించింది. ఈ కార్యనిర్వహణంతా 17 జోన్లు, 68 డివిజన్లు పరిధిలోవుండే 13 లక్షలకుపైగా సిబ్బంది చేతుల మీదుగా సాగుతుంది. ప్రపంచంలో అమెరికా, చైనా, రష్యా తర్వాత మన రైల్వే వ్యవస్థే అతి పెద్దది. కానీ ఈ వ్యవస్థ నిత్యం ఆర్థిక సమస్యలతోనే కొట్టుమిట్టాడుతోంది. 

2017–18లో రైల్వే శాఖ ఆర్జించిన ప్రతి రూపాయిలో 98.44 పైసల వరకూ నిర్వహణకే పోయిందని ఇటీవల కాగ్‌ నివేదిక తెలిపింది. ఇది గత పదేళ్లతో పోలిస్తే అత్యంత అధమ స్థాయిలో ఉందని వ్యాఖ్యానించింది. ఇంత కన్నా దారుణమేమంటే ఎన్టీపీసీ, ఇండియన్‌ రైల్వేస్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ లిమిటెడ్‌(ఇర్‌కాన్‌) సంస్థలు రైల్వేలకిచ్చిన అడ్వాన్సుల వల్ల ఈమాత్రమైనావుంది కానీ, లేనట్టయితే ఇది 102. 66 పైసలుగా నమోదయ్యేదని కాగ్‌ తెలిపింది. ఈ అడ్వాన్సుల కారణంగా రైల్వేల జమాఖర్చుల పద్దులో రూ. 1,665.61 కోట్లు మిగులు కనబడింది. ఆ రెండింటినీ మినహాయిస్తే 5,676.29 కోట్ల నష్టం నమో దయ్యేది. సరుకు రవాణా నుంచి వచ్చే లాభాల్లో 95 శాతాన్ని ప్రయాణికుల సర్వీసులో ఎదురయ్యే నష్టాన్ని భర్తీ చేయడానికి వినియోగించాల్సివస్తోంది.

వచ్చే అయిదేళ్లలో రూ. 8.5 లక్షల కోట్ల మేర ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులు సమీకరించి రైల్వేశాఖకు జవసత్వాలు కల్పిస్తామని నాలుగేళ్లక్రితం ఎన్‌డీఏ ప్రభుత్వం చెప్పింది. ప్రయాణికుల సంఖ్య, సరుకు రవాణా పరిమాణం భారీగా పెంచడం, కొత్త రైల్వే ట్రాక్‌ల నిర్మాణం, అధునాతన రైళ్లను సమకూర్చుకోవడం రైల్వేల ప్రణాళికలో ప్రాధాన్యతాంశాలని వివరించింది. అన్నీ పూర్తయితే రైల్వేల ఆదాయం మరిన్ని రెట్లు పెరుగుతుందని అంచనా వేశారు. 

కానీ ఇదంతా ఆశించినంతమేర జరగలేదు. నిజానికి బడ్జెట్‌లలో ప్రకటించిన ప్రాజెక్టులన్నీ సక్రమంగా అమలు చేయడానికి అవస రమైన నిధులు ఆ శాఖ దగ్గర ఉండవు. కనుక ప్రాథమికమైన పనులు మొదలు కావడానికే ఏళ్లూ పూళ్లూ పడుతూంటుంది. మన రైల్వేలు 30 ఏళ్లకిందటి ప్రాజెక్టుల్ని కూడా ఇంకా పూర్తిచేయాల్సే వున్నదని ఆమధ్య ఒక నివేదిక ప్రకటించింది. రైల్వేల్లో వున్న అనేకానేక విభాగాలు మధ్య సరైన సమన్వయం వుండకపోవడం వల్ల అడుగడుగునా ఇబ్బందులు తలెత్తడమేకాక, తలపెట్టినవేవీ సక్ర మంగా సాగటం లేదని ఆ నివేదిక తెలిపింది.  

ఒకపక్క అయిదేళ్లలో అయిదు లక్షల కోట్ల ఆర్థికవ్యవస్థ సాధనను కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా, అందులో కీలకపాత్ర పోషించాల్సిన రైల్వే వ్యవస్థ మాత్రం ఇంతటి దుస్థితిలో వుండ టం ఆందోళన కలిగించే అంశమే. కనుకనే కేంద్రమంత్రివర్గం రైల్వే ప్రక్షాళనకు నడుం బిగించా నంటున్నది. సమస్యలెదురైనప్పుడు సాధారణంగా ప్రభుత్వాలు సిబ్బంది సంఖ్యపై దృష్టి పెడ తాయి. రిటైరవుతున్నవారు అవుతుండగా వారి స్థానంలో కొత్తవారి నియామకం విషయంలో శ్రద్ధ తీసుకోవడం లేదు. కానీ ఈసారి పైస్థాయినుంచి ప్రక్షాళన మొదలుపెట్టాలని నిర్ణయించడం మెచ్చదగిందే. 

రైల్వే బోర్డులో ఇప్పుడున్న ఎనిమిది మంది సభ్యుల సంఖ్యను అయిదుకు తగ్గించాలని, వేర్వేరు కేడర్‌లనూ, విభాగాలనూ విలీనం చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇంజనీరింగ్, ట్రాఫిక్, మెకానికల్, ఎలక్ట్రికల్‌ వగైరా ఎనిమిది విభాగాలను ఇండియన్‌ రైల్వే మేనే జ్‌మెంట్‌ సర్వీస్‌(ఐఆర్‌ఎంఎస్‌) పేరిట ఒకే సర్వీస్‌కిందకు తీసుకొస్తారు. ఇకపై రైల్వేల్లో రైల్వే పరిరక్షణ దళం, వైద్య సర్వీసుల విభాగాలు మాత్రమే వుంటాయి. రైల్వే బోర్డు చైర్మన్, మరో నలుగురు సభ్యులు మాత్రమే బోర్డులో వుంటారు. చైర్మన్‌ను సీఈఓగా వ్యవహరిస్తారు. 

అలాగే సమర్థత, అనుభవం, నైపుణ్యం వున్నవారిని  బయటినుంచి తెచ్చే యోచన కూడావుంది. 1994లో ప్రకాష్‌ టాండన్‌ కమిటీతో మొదలుపెట్టి 2015లో వివేక్‌ దేబ్రాయ్‌ కమిటీ వరకూ మూడు, నాలుగు కమిటీలు ఈ సంస్కరణలన్నీ సూచిస్తూనేవున్నాయి. అయితే కేంద్రం ఆ విషయంలో తట పటాయిస్తూ వచ్చింది. దేబ్రాయ్‌ కమిటీ 2015లో చేసిన సిఫార్సులు అప్పట్లో కలకలం సృష్టించాయి. రైల్వే మంత్రిత్వ శాఖను, రైల్వేలను వేరుచేయాలనడం,  రైల్వే వ్యవస్థను రైళ్ల నిర్వహణకు మాత్రమే పరిమితం చేసి ఇతర బాధ్యతల నిర్వహణకు మౌలిక సదుపాయాల కంపెనీని ఏర్పాటు చేయాలని చెప్పడం అప్పట్లో తీవ్ర విమర్శలు రేకెత్తించాయి. 

ఇప్పుడు కేంద్ర కేబినెట్‌ అంత లోతుకు పోలేదు. అయితే మున్ముందు వాటిపై కూడా దృష్టి సారించే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే 2018–2030 మధ్య రైల్వేల్లో 50 లక్షల కోట్ల మేర పీపీపీ ప్రాతిపదికన పెట్టుబడులు సేకరించాలని నిర్ణయించినట్టు నిరుటి రైల్వే పద్దులోనే కేంద్రం ప్రకటించింది. రైల్వేల్లో అమలు చేసే ఏ సంస్కరణలైనా దాని లోపాలను పరిహరించి, అది పూర్తి జవసత్వాలతో పనిచేసే విధంగా తీర్చిదిద్దాలి. కేవలం ప్రైవేటుకిస్తే మంత్రించినట్టు అంతా సవ్యంగా మారుతుందనే ధోరణి సరికాదు.

మరిన్ని వార్తలు