తీరం చేర్చే ‘చుక్కాని’

22 Dec, 2019 01:12 IST|Sakshi

జనతంత్రం

‘రోమ్‌ నగర నిర్మాణం ఒక్క రోజులో పూర్తికాలేదు’ అని లోకోత్తరమైన ఒక నానుడి వుంది. రోమ్‌ నగరం లాంటి ఒక అద్భుతం ఆవిష్కృతం కావాలంటే దాని వెనుక ఎంతో కథ, ఎంతో పట్టుదల, ఎన్నో కష్టాలు, మరెన్నో త్యాగాలు నిబిడీకృతమై వుంటాయని దాని గూఢార్థం. క్రీస్తుపూర్వం ఒకటో శతాబ్దం నాటికి మూడు ఖండాలకు విస్తరించిన జగదేక మహాసామ్రాజ్యానికి రాజధానిగా రోమ్‌ నగరం ఆవిర్భవించింది. కానీ, ఆ నగరం పుట్టింది క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దంలో. ఆ వైభవోజ్వల దశను అందుకోవడానికి ముందు ఐదువందల యేళ్ల నెమ్మదైన నడక రోమ్‌ ఖాతాలో వుంది. 

గోల్కొండ కోటలో జనాభా పెరిగి మంచినీటికి కటకట ఏర్పడిన సమయంలో ఖుతుబ్‌షాహీ పాలకుడైన మహమ్మద్‌ ఖులీ హైదరాబాద్‌ నిర్మాణ ఆలోచన చేశాడు. తొలుత చార్మినార్‌ను, మక్కా మసీదును నిర్మించి రాచవీధులను సిద్ధంచేసి కొన్ని భవనాలను నిర్మించాడు. ఆ తర్వాత అల్లాను ప్రార్థించాడు. సరస్సులో చేపలను నింపినట్టు ఈ నగరం జనసమ్మర్థంతో కళకళలాడేలా చేయాలని వేడుకున్నాడు. ఎందుకంటే, నగరాన్ని నిర్మిం చాలంటే కేవలం భవనాలను నిర్మించడం కాదనీ, జనం నివసించడానికి, వారికి ఉపాధి కల్పించడానికి ఇతరేతర కారణాలు చాలా దోహదం చేయాలనే వివేకం కలిగినవాడు కనుక ఖులీ చక్రవర్తి అల్లా శరణుజొచ్చాడు. 

ఆయన ప్రార్థన ఫలించింది. కృష్ణాతీరంలో విస్తారంగా వజ్రాలు లభ్యమయ్యాయి. వజ్రాలకు, మేలి ముత్యాలకూ ప్రపంచస్థాయిలో పెద్ద మార్కెట్‌గా అచిరకాలంలోనే హైదరాబాద్‌కు పేరొచ్చింది. అనుబంధంగా ఇతర వృత్తి వ్యాపారాలు అల్లుకున్నాయి. సరస్సులో చేపలు చేరినట్టు, నగరం నిండా జనాలు చేరారు. అప్పుడు మాత్రమే పాలనా పీఠాన్ని ఖుతుబ్‌షాహీలు గోల్కొండ నుంచి హైదరాబాద్‌కు తరలించారు. 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విడిపోయి, తొలి ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచంలోని అనేక ముఖ్యనగరాల పేర్లు చెప్పి అటువంటి కొత్త నగరాన్ని నిర్మించాలని వుందని చెప్పేవారు. అలా చెప్పిన పేర్లలో అందమైన నగరాల్లో ఒకటిగా పేరుగాంచిన టర్కీలోని ఇస్తాంబుల్‌ కూడా వుంది. ప్రధానమంత్రి చెప్పారని కజకిస్థాన్‌ రాజధాని ఆస్థా పేరును కూడా చెప్పేవారు. కానీ, ఈ రెండు నగరాలుకూడా కొత్తగా నిర్మించినవి కావు. ఇస్తాంబుల్‌కు పదిహేను వందల ఏళ్ల చరిత్ర వుంది. వందల సంవత్సరాల పాటు సాగిన క్రూసేడ్లకు కేంద్ర బిందువైన కాన్‌స్టాంట్‌నోపుల్‌ కొత్తపేరే ఇస్తాంబుల్‌. ఒటోమన్‌ సామ్రాజ్యం పతనమైన తర్వాత టర్కీ పాలకులు నగరం పాత పేరును మార్చివేశారు. ఇప్పటికి మూడుసార్లు పేరు మారిన ‘ఆస్థా’కు కూడా శతాబ్దాల కథ వుంది. 

గ్రీన్‌ఫీల్డ్‌ ఆలోచన 
విభజన అనంతరం అవశేష ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిగా ఒక గ్రీన్‌ఫీల్డ్‌ (సరికొత్త నిర్మాణం) మహానగరం ఆలోచన సరికాదని శివరామకృష్ణన్‌ కమిటీ అభిప్రాయపడింది. రాజధాని ఎంపికపై సూచనలు చేయడానికి కేంద్ర హోం శాఖ కార్యదర్శిగా పనిచేసి రిటైరైన శివరామకృష్ణన్‌ నాయకత్వంలో కేంద్రం ఓ కమిటీని నియమించింది. విజయవాడ–గుంటూరుల సమీపంలో రాజధాని నిర్మా ణం ఏమాత్రం తగదని కమిటీ స్పష్టంగా చెప్పింది. ఒకేచోట రాజధానిని కేంద్రీకరించడం కంటే మూడు జోన్లలో వికేంద్రీకరిస్తే బాగుంటుందని సూచించింది. 

నాలుగు ప్రాంతాలుగా రాష్ట్రాన్ని విభజించి అభివృద్ధి చర్యలు చేపట్టాలని కమిటీ నివేదికలో పేర్కొన్నది. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జీఎన్‌ రావు కమిటీ కూడా స్థూలంగా ఇవే సూచనలు చేయడం గమనార్హం. శివరామకృష్ణన్‌ కమిటీ సూచనలను పెడచెవిన పెట్టి చంద్రబాబు ప్రభుత్వం విజయవాడ–గుంటూరుల సమీపంలో ముక్కారు పంటలు పండే 35 వేల ఎకరాల మాగాణి భూములను సేకరించి గ్రీన్‌ఫీల్డ్‌ రాజధాని నిర్మాణానికి సన్నాహాలు చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ద్వారా ముఖ్యమంత్రి, ఆయన సన్నిహితులు, బంధువులు, అధికార పార్టీ ప్రముఖులు వేలకోట్ల రూపాయల దోపిడీకి పథకం వేశారని అప్పుడే నాడు ప్రతిపక్షంగా వున్న ప్రస్తుత అధికార పార్టీ ఆరోపించింది. 

ఆరోపణే కాకుండా అందుకు తగిన ఆధారాలను కూడా ఆ పార్టీ చూపెట్టింది. మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా తెలుగుదేశం పార్టీ అవినీతి లీలల్ని ఆధార సహితంగా ఎండగట్టింది. ఈ బాగోతం ఇంతటితో ఆగలేదు. సమీకరించిన భారీ ల్యాండ్‌ బ్యాంక్‌తో ప్రపంచంలోనే కనీవినీ ఎరుగని అతిపెద్ద రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి స్వయాన ప్రభుత్వ పెద్దలు తెరతీశారు. ఇందుకోసం సింగపూర్‌ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటున్నామని ప్రజలను తప్పుదోవ పట్టించి ప్రైవేట్‌ సంస్థలను రంగంలోకి దించారు. మరోసారి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, రాజధాని వ్యవహారం వారు అనుకున్నట్టుగా జరిగి వుంటే, ఆ లూటీ ధనం అంచనా వేయడానికి కొందరు గణిత నిపుణులూ, ఆర్థిక నిపుణులూ క్యాలిక్యులేటర్ల సహాయంతో కసరత్తు చేయ వలసి వచ్చేది. 

డామిట్‌! మెకన్నాస్‌ గోల్డ్‌ సినిమాలాగా కథ అడ్డం తిరిగింది. అసలే, ఎన్నికల్లో ఘోరమైన ఓటమితో మూలుగుతున్న నక్కపై ఇప్పుడు తాటిపండు పడింది. మొన్న అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి సాలోచనగా చెప్పిన అభిప్రాయాలు, జీఎన్‌ రావు నివేదిక సూచనలతో బిక్కచచ్చిన ప్రతిపక్ష శిబిరం దింపుడు కళ్లం ఆశతో అమాయకులైన అమరావతి ప్రాంత రైతులను రెచ్చగొట్టే ప్రయత్నాలను ఆరంభించింది.

ఎందుకు సరికాదంటే? 
ఒకటి : జాతికి హృదయం లాంటి రాజధానిని అవినీతి పునాదులపై నిర్మించబూనడం సమ్మతం కాదు. 
రెండు: గడించిన అనుభవాల రీత్యా పరిపాలననూ, అభివృద్ధినీ ఒకేచోట కేంద్రీకరించడం అభిలషణీయం కాదు. 
మూడు: 35 వేల ఎకరాల ప్రాంతంలో గ్రీన్‌ కవర్‌ను తొలగించి కాంక్రీట్‌ జంగిల్‌ను విస్తరించడం పర్యావరణ హితం కాదు. దీనికితోడు రాజధాని చుట్టూ నిర్మించ తలపెట్టిన రింగ్‌రోడ్ల కోసం మరింత సాగుభూమిని సేక రించవలసి వుంటుంది. దేశంలోనే అతిశ్రేష్టమైన పంట భూములున్న కృష్ణా–గుంటూరు ప్రాంతాల్లో ఇన్నివేల ఎకరాలను వ్యవసాయేతర పనులకు బదలాయించబూనడం అవివేకమూ, అనాగరికమైన చర్య. దేశ ఆహార భద్రతపై జరిగిన అతిక్రూరమైన అత్యాచారం. నిర్భయ, దిశ ఘటనలకు ఏమాత్రం తక్కువకాని నేరం. 
నాలుగు: దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు వచ్చి స్థిరనివాసం ఏర్పరచుకోవడానికి వీలుగా ప్రతిపాదిత ప్రాంతంలో కాస్మోపాలిటన్‌ సంస్కృతి అవసరం. విజయవాడ పరిసర ప్రాంతాల సంస్కృతి ఇందుకు పూర్తిగా భిన్నం. విజయవాడలో ఇంటి అద్దెలపై స్వయంగా చంద్రబాబునాయుడే పలుమార్లు అసంతృప్తి ప్రకటించారు. ఇలా అయితే మన దగ్గరకెవరు వస్తారని అసహనం ప్రకటించిన సందర్భాలున్నాయి. ఇల్లు అద్దెకివ్వడానికి ముందు కులాన్ని ఆరాతీసే దురాచారం అక్కడ కొనసాగుతున్నదని చంద్రబాబు అనుకూల పత్రిక రచయితలే పలుమార్లు వారి వ్యాసాల్లో వాపోయారు. ఒకనాడు యావదాంధ్ర దేశానికి చైతన్య కేంద్రంగా,  అభ్యుదయ భావాలకు ఆలవాలంగా విలసిల్లిన విజయవాడకు ఇటువంటి దురాచారాలు ఎందుకు సంక్రమించాయో పరిశోధనలు జరగవలసి ఉన్నది. 
ఐదు: పెద్దఎత్తున ఐటీ కంపెనీలను, బహుళజాతి సంస్థల, పారిశ్రామిక సంస్థల కార్పొరేట్‌ కార్యాలయాలనూ ఏర్పాటుచేయడానికి వాతావరణ పరిస్థితులు కూడా సహకరించాలి. ఈ కోణంలో ఇంతకంటే మెరుగైన ప్రత్యామ్నాయాలు అందుబాటులో వున్న ప్పుడు ఈ అంశం కూడా ప్రతికూలంగా మారుతుంది. 

పరిపాలననూ, అభివృద్ధిని వికేంద్రీకరిస్తే సరిపోతుందా? ప్రస్తుత  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఒక మహానగరం అవసరం లేదా?... రాష్ట్ర విభజన ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌ భారీ రెవెన్యూ కోల్పోయింది. నేటికీ 60 శాతం ప్రజలు వ్యవసాయ రంగంపైనే ఆధారపడి వున్నారు. అక్షరాస్యతలోనూ వెనుకబాటుతనమే కొనసాగుతున్నది. ఈ లోపాలను అధిగమించి ఏటా లక్ష ఉద్యోగాలను సృష్టించుకోగలిగితేనే రాష్ట్రం అభివృద్ధి పట్టాలపైకి ఎక్కుతుందని శివరామకృష్ణన్‌ కమిటీ నివేదిక స్పష్టం చేసింది. ఈ కర్తవ్యం నెరవేరాలంటే రాష్ట్రానికి గ్రోత్‌ ఇంజన్‌ లాంటి ఒక నగరం అవసరమే. ఒక మహానగరం అవసరమే. పైన చెప్పుకున్న లోపాలు లేని మహానగరానికి ఎక్కడ అవకాశం వుంది? 

విశాఖే నెంబర్‌ వన్‌ 
దాదాపు రెండువేల ఐదు వందల సంవత్సరాల ఆంధ్రప్రదేశ్‌ (ఉమ్మడి) ప్రాంత చరిత్ర మనకు అందుబాటులో వుంది. కానీ ఎందుకో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ భూభాగంలో ఒక మహానగరం వర్ధిల్లిన దాఖలా మాత్రం కనిపించడం లేదు. ఒకరకంగా ఈ ప్రాంతానిది బహుళ నగర సంస్కృతి. అనేక చిన్న నగరాలు స్వయంపోషకంగా ప్రకాశించాయి. గ్రీకు చరిత్రకారుడు మెగస్తనీస్‌ క్రీస్తుపూర్వం మూడో శతాబ్దంలోనే మౌర్య చంద్రగుప్తుని కాలంలో భారతదేశాన్ని సందర్శించాడు. ఆంధ్ర దేశాన్ని శాతవాహనులు పాలిస్తున్న కాలం అది. 

కోట గోడలతో దుర్భేద్యంగా నిర్మించిన 30 నగరాలు ఆంధ్రులకు ఉన్నా యని మెగస్తనీస్‌ రికార్డు చేశాడు. అంతేకాకుండా పురావస్తు పరిశోధనల్లో లభించిన అవశేషాలు, శిలాశాసనాలు, నాణేల  ఆధారంగా శాతవాహనులు, తదనంతరం పాలించిన ఇక్ష్వాకుల కాలం నాటికే ఆంధ్ర ప్రాంతంలో పట్టణీకరణ జరిగింది. శాతవాహనుల కాలం నుంచి, కాకతీయ సామ్రాజ్యం ఏర్పడేలోగా వెయ్యి సంవత్సరాల కాలవ్యవధిలో అనేక రాజవంశాలు ఈ ప్రాంతాన్ని పాలించాయి. 

ఒక్కో సమయంలో ఒక్కో నగరం అమరావతి, విజయపురి (నాగార్జునకొండ), భట్టిపోలు (ప్రతీపాలపురం), కోడూరు (కృష్ణా జిల్లా), కపోతపురం (కదిరి), వేంగి, కొల్లిపాక, బెజవాడ, పెద్దాపురం, అమలాపురం రాజధానులుగా వెలిశాయి. పల్లవ రాజధానిగా కాంచీపురం, కాకతీయ సామ్రాజ్య రాజ ధానిగా ఓరుగల్లు, గోల్కొండ రాజ్య రాజధానిగా హైదరాబాద్, విజయనగర సామ్రాజ్య రాజధానిగా విజయనగరం మహానగరాలుగా అభివృద్ధి చెందినప్పటికీ ఆ నాలుగు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ భూభాగానికి ఆవలనే ఉన్నాయి. ఇప్పటికీ దాదాపు 20 పట్టణాలకు గట్టి ఊతం లభిస్తే, అభివృద్ధి సాధించగల సామర్థ్యం వుంది. వాటిలో ఆంధ్రప్రదేశ్‌కు గ్రోత్‌ ఇంజన్‌గా నిలబడగల సామర్థ్యం ఉన్న నగరం నిస్సందేహంగా విశాఖపట్నం. 

సహజసిద్ధమైన రేవు పట్టణం విశాఖ. కేవలం తన భౌగోళిక ప్రాధాన్యత కారణంగా, చుట్టూ వున్న ప్రాంతంలో నిక్షిప్తమైన ఖనిజ సంపద కారణంగా, తన సొంత మెరిట్‌పై ఆధారపడి పారిశ్రామికంగా మెరిసిన నగరం విశాఖ. సంగీత సాహిత్యాలలో తెలుగువాడి తలపాగా విశాఖ. షిప్‌యార్డు, భారత నౌకాదళ కేంద్రం, ఉక్కు ఫ్యాక్టరీ, నౌకా నిర్మాణ కేంద్రం తదితర కేంద్రస్థాయి సంస్థల కారణంగా ఈ నగరానికి కాస్మోపాలిటన్‌ స్వభావం అబ్బింది. స్థానిక ప్రజలు సహజంగానే ఆత్మీయతకు, ఆతిథ్యానికి పెట్టింది పేరు. 

హైదరాబాద్‌ తరహాలో అభివృద్ధిలో దూసుకుపోగల అన్ని లక్షణాలు విశాఖకు వున్నాయి. నిజంగానే విశాఖను ఆంధ్రప్రదేశ్‌ ఎగ్జి క్యూటివ్‌ రాజధానిగా ప్రకటిస్తే రాబోయే పదేళ్లలో దేశం లోని టాప్‌ టెన్‌ నగరాల జాబితాలో విశాఖ చేరి పోవడం ఖాయం. లక్ష కోట్లు ఖర్చు పెట్టకుండానే, ముక్కారు పంటల భూములను బలిపెట్టకుండానే, దశాబ్దాల తరబడి నిరీక్షించకుండానే ఒక మహానగరం సిద్ధమవుతుంది. సముద్రతీరం మీదుగా భోగాపురం ఆవలి నుంచి విజయనగరం, అనకాపల్లి మీదుగా అచ్యుతాపురం సముద్ర తీరం వరకు ఒక ఇంద్రధనుస్సు ఆకారంలో నయా విశాఖ వికసిస్తుందని ఆశిద్దాం.
-వర్ధెల్లి మురళి

muralivardelli@yahoo.co.in

మరిన్ని వార్తలు