రూ.1500 కోట్లతో అణు ప్రమాద బీమా నిధి

18 Jun, 2015 00:04 IST|Sakshi

 అవార్డులు
 2014 సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్‌లు ప్రతిష్టాత్మకమైన సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్‌లు, పురస్కారాలను 2014 సంవత్సరానికి జూన్ 10న కేంద్రం ప్రకటించింది. ఫెలోషిప్‌లు పొందిన వారిలో సంగీత స్రష్ట ఎస్.ఆర్.జానకి రామన్, భారత శాస్త్రీయ సంగీత విద్వాంసులు విజయ్ కిచ్లూ, తులసీదాస్ బోర్కర్, చిత్ర దర్శకుడు ఎం.ఎస్.సత్యూ ఉన్నారు. ఈ ఫెలోషిప్‌లను అరుదైన గౌరవంగా భావిస్తారు. సంగీత నాటక అకాడమీ పురస్కారాలకు వివిధ రంగాల నుంచి 36 మంది కళాకారులను ఎంపిక చేశారు. వీరిలో తెలుగువారైన కూచిపూడి నాట్య కళాకారుడు వేదాంతం రాధేశ్యామ్, వయొలిన్ విద్వాంసుడు ద్వారం దుర్గా ప్రసాద్ రావు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాకు చెందిన రాధేశ్యామ్ సత్యభామ, గొల్లభామగా వేలాది ప్రదర్శనలు ఇచ్చారు. దుర్గా ప్రసాదరావు విజయనగరం సంగీత కళాశాలలో పనిచేసి, పదవీ విరమణ చేశారు.
 
 క్రీడలు
 బోపన్న జోడీకి మెర్సిడెస్ కప్ డబుల్స్ టైటిల్  భారత టెన్నిస్ క్రీడాకారుడు రోహన్ బోపన్న.. ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా)తో కలిసి మెర్సిడెస్ కప్ డబుల్స్ టైటిల్ గెలుచుకున్నాడు. వీరు స్టుట్‌గార్ట్ (జర్మనీ)లో జూన్ 14న జరిగిన ఫైనల్లో అలెగ్జాండర్ పెయా(ఆస్ట్రియా)- బ్రూనో సోర్స్ (బ్రెజిల్) జంటను ఓడించారు. బోపన్నకు కెరీర్‌లో ఇది 14వ డబుల్స్ టైటిల్. సింగిల్స్ టైటిల్‌ను రఫెల్ నాదల్(స్పెయిన్) ఫైనల్లో విక్టర్ ట్రియెకి(సెర్బియా) ను ఓడించి గెలుచుకున్నాడు.
 
 అంతర్జాతీయం
 జర్మనీలో 41వ జీ-7 సదస్సు  41వ జీ-7 సదస్సు జర్మనీలోని బవారియన్ ఆల్ఫ్స్‌లో జూన్ 8న ముగిసింది. రెండు రోజుల పాటు జరిగిన సదస్సు అనంతరం జీ-7 ప్రకటన జారీ అయ్యింది. కర్బన ఇంధనాల వాడకాన్ని 2100 నాటికి నిలిపేసేందుకు నేతలు అంగీకరించారు. 2050 నాటికి 40-50 శాతం గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించాలన్న లక్ష్యానికి మద్దతు పలికారు. పారిశ్రామికీకరణకు ముందున్న స్థాయితో పోల్చితే సగటు ఉష్ణోగ్రతల పెరుగుదలను 2 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గించే లక్ష్యానికి మద్దతు తెలిపారు. ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో అవసరమైతే రష్యాపై ఆంక్షలను కఠినతరం చేయాలన్నారు. అమెరికా, యూకే, జపాన్, ఫ్రాన్స్, కెనడా, ఇటలీ, జర్మనీ నేతలు ఈ సదస్సులో పాల్గొన్నారు.
 
 టర్కీ ఎన్నికల్లో మెజారిటీ సాధించని అధ్యక్షుడు
 టర్కీ పార్లమెంటుకు జూన్ 7న జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడు రెసెప్ తయిప్ ఎర్డోగన్‌కు చెందిన జస్టిస్ పార్టీ(ఏకేపీ) 41 శాతం కంటే తక్కువ ఓట్లు సాధించింది. పార్లమెంటులోని 550 స్థానాల్లో ఏకేపీకి 258 స్థానాలు దక్కాయి. ఈ సంఖ్య అవసరమైన మెజార్టీ కంటే 18 స్థానాలు తక్కువ. ఎర్డోగన్ 2003 నుంచి 2014 వరకు ప్రధానమంత్రిగా పనిచేసి ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్నారు. పూర్తి మెజారిటీ సాధించలేకపోవడంతో టర్కీలో పార్లమెంటరీ వ్యవస్థ నుంచి అధ్యక్ష తరహా పాలనకు మారేందుకు రాజ్యాంగ సవరణ తేవాలన్న ఆయన ఆలోచనకు అడ్డుకట్టవేసినట్లయింది.
 
 తీవ్రవాదులపై భారత్-మయన్మార్ ఆర్మీ ఆపరేషన్
 మణిపూర్ సరిహద్దులోని మయన్మార్‌లో తీవ్రవాదులపై జూన్ 9న భారత్, మయన్మార్ సైన్యాలు జరిపిన దాడిలో 50 మంది తీవ్రవాదులు మరణించారు. వీరు ఎన్‌ఎస్‌పీఎస్(కే), కేవైకేఎల్ సంస్థలకు చెందిన వారు. వీరు మణిపూర్‌లో జూన్ 4న జరిపిన దాడిలో 18 మంది సైనికులు మృతిచెందారు. తీవ్రవాదులు మయన్మార్‌లో తల దాచుకోవడంతో భారత్ మయన్మార్‌తో కలిసి సైనికదాడి జరిపింది. దేశం బయట భారత సైన్యం తీవ్రవాదులపై కమాండో ఆపరేషన్ చేపట్టడం ఇదే తొలిసారి.
 
 26 ఆఫ్రికా దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య మార్కెట్

 ఒకే విధమైన మార్కెట్ వ్యవస్థను సృష్టించే స్వేచ్ఛా వాణిజ్య మార్కెట్ ఒప్పందంపై 26 ఆఫ్రికా దేశాలు ఈజిప్టులోని షర్మ్ ఎల్ షేక్‌లో జూన్ 10న సంతకాలు చేశాయి. ఇందులో ఆఫ్రికా ఖండంలోని దాదాపు సగం దేశాలు చేరాయి. ప్రపంచ వాణిజ్యంలో కేవలం మూడు శాతం మాత్రమే ఉన్న ఆఫ్రికా ఆర్థిక వ్యవస్థ ఈ ఒప్పందం వల్ల బాగా పుంజుకోనుంది. ఈ ఒప్పందం అమలుకు వాణిజ్య అడ్డంకుల తొలగింపునకు విధివిధానాలు రూపొందించాల్సి ఉంది. రెండేళ్లలో సభ్యదేశాల పార్లమెంట్లు ఆమోదం తెలపాలి.
 
 మూడు దేశాలతో మోటారు వాహన ఒప్పందం
 సార్క్ దేశాలైన భూటాన్, బంగ్లాదేశ్, నేపాల్‌తో జూన్ 15న భూటాన్ రాజధాని థింపూలో మోటారు వాహన ఒప్పందాన్ని భారతదేశం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంపై భారత రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ, సంబంధిత దేశాల రవాణా శాఖా మంత్రులు సంతకాలు చేశారు. ఈ ఒప్పందం వల్ల ఆయా దేశాల మధ్య ప్రయాణికులు, సరకు రవాణా వాహనాలు నిరంతరం, సులువుగా, స్వేచ్ఛగా రాకపోకలు సాగించేందుకు వీలవుతుంది. రవాణా ఖర్చులు తగ్గడంతో పాటు, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటాయి. ఇటువంటి ఒప్పందాన్ని మయన్మార్, థాయిలాండ్‌తో భారత్ కుదుర్చుకోనుంది.
 
 బ్రిటిష్ నటుడు క్రిస్టోఫర్ లీ మృతి
 ప్రఖ్యాత బ్రిటిష్ నటుడు క్రిస్టోఫర్ లీ(93) లండన్‌లో జూన్ 7న మరణించారు. చిత్ర పరిశ్రమలో డ్రాకులాగా ఆయన ప్రసిద్ధులు. హ్యూమర్, హారర్ చిత్రాల్లో ఆయన డ్రాకులా పాత్రలు పోషించారు. 250కు పైగా చిత్రాల్లో ఆయన నటించారు. ద లార్డ్ ఆఫ్ ద రింగ్స్‌లో శారుమన్ పాత్ర, జేమ్స్ బాండ్‌లో స్కారమంగ పాత్రల్లో ఆయన నటించారు.
 
 జాతీయం
 మే నెలలో టోకు  ద్రవ్యోల్బణం -2.36 శాతం ఆహార పదార్థాలు, ఇంధనం, తయారీ రంగ వస్తువుల ధరలు తగ్గడంతో మే నెలలో టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం -2.36 శాతంగా నమోదైనట్లు ప్రభుత్వం జూన్ 15న ప్రకటించింది. వరుసగా ఏడోనెల ఈ ప్రతిద్రవ్యోల్బణం కొనసాగింది. 2014 నవంబరు నుంచి డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం ప్రతికూలంగానే కొనసాగింది.
 
 5.1 శాతానికి పెరిగిన సీపీఐ ద్రవ్యోల్బణం
 వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2015 మే నెలలో 5.01 శాతానికి చేరింది. ఇది 2015 ఏప్రిల్‌లో 4.87 శాతంగా నమోదైంది. పండ్లు, కూరగాయల ధరలు తగ్గినప్పటికీ పప్పు ధాన్యాల ధరలు పెరగడంతో మేలో రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగింది. ఇది 2014 మేలో 8.83 శాతంగా ఉంది. 2015, మే 12న గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాలు ప్రకారం ఏప్రిల్‌లో పోల్చితే మేలో పప్పు ధాన్యాల ధరలు 16.62 శాతం పెరిగాయి.
 
 భారత గణాంకాల సంస్థ డెరైక్టర్ తొలగింపు
 భారత గణాంకాల సంస్థ డెరైక్టర్ బిమల్ రాయ్‌ని కేంద్ర ప్రభుత్వం జూన్ 13న తొలగించింది. క్రమశిక్షణ ఉల్లంఘన, మోసం, ఆర్థిక అవకతవలకు పాల్పడవచ్చనే అనుమానంతో ఆయనను తొలగించింది. ఆయన పదవీకాలం జూలై 31న ముగియనుంది. ఆయన స్థానంలో ఆగస్టు 1న సంఘమిత్ర బందోపాధ్యాయ్ బాధ్యతలు చేపడతారు.
 
 అణు ప్రమాద నిధి బీమా ఏర్పాటు
 కేంద్రం రూ.1500 కోట్లతో అణు ప్రమాద బీమా నిధిని ఏర్పాటు చేసినట్లు కేంద్ర అణు ఇంధన సహాయ మంత్రి జితేంద్రసింగ్ జూన్ 13న తెలిపారు. ఈ నిధి వల్ల భారత్‌లో అణు విద్యుత్ కేంద్రాలు నిర్మించే విదేశీ అణు సంస్థలకు ప్రయోజనం చేకూరుతుంది. అణు విద్యుత్ కేంద్రాల్లో ప్రమాదం సంభవిస్తే ఈ ప్రమాద బీమా నిధి నుంచి నష్టపరిహారం చెల్లిస్తారు. ప్రమాదాల బాధ్యత నుంచి అణు రియాక్టర్లు, పరికరాల సరఫరాదారులకు ఉపశమనం కల్పించినట్లవుతుంది. ఈ నిధి ఏర్పాటుతో ప్రమాద పరిహారం కారణంగా ఆగిపోయిన గోరఖ్‌పూర్ హరియాణా అణువిద్యుత్ పరియోజన వంటి ప్రాజెక్టుల పనులు తిరిగి ప్రారంభమయ్యేందుకు, కొత్త అణు ప్రాజెక్టుల ఏర్పాటుకు అంతర్జాతీయ సంస్థలు ముందుకొచ్చేందుకు అవకాశముంటుంది.
 
 ఎస్-200 మోటారు భూస్థిర పరీక్ష విజయవంతం
 భారీ ఉపగ్రహ ప్రయోగాలకు తోడ్పడే ఎస్-200 స్ట్రాపాన్ బూస్టర్‌కు శ్రీహరికోటలోని రాకెట్ ప్రయోగ కేంద్రంలో జూన్-14న జరిపిన పరీక్ష విజయవంతమైంది. ఎస్-200 ఘన ఇంధన మోటారు సామర్థ్యం విశ్లేషణకు ఈ భూస్థిర పరీక్ష నిర్వహించారు. ఈ మోటారును 2016లో ఇస్రో ప్రయోగించనున్న జీఎస్‌ఎల్‌వీ-మార్క్3(డీ1) వాహన నౌకలో ఉపయోగించనున్నారు. ఈ ఎస్-200 స్ట్రాపాన్ బూస్టర్‌ల ద్వారా 3-5 టన్నుల బరువున్న ఉపగ్రహాలను ప్రయోగించవచ్చు.
 
 12 మంది మావోలు మృతి
 జార్ఖండ్‌లోని పలామూ జిల్లాలో జూన్ 8న జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టుల జోనల్ కమాండర్ ఆర్కే అలియాస్ అనురాగ్‌తోపాటు 12 మంది మావోయిస్టులు మృతిచెందారు. అనురాగ్‌పై ప్రభుత్వం రూ.5 లక్షల రివార్డు ప్రకటించింది.
 
 కేంద్ర మాజీ మంత్రి షీలా కౌల్ మృతి
 మాజీ కేంద్ర మంత్రి షీలా కౌల్(100) ఘజియాబాద్‌లో జూన్ 13న మరణించారు. హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా కూడా పనిచేసిన ఆమె మాజీ ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూకు సమీప బంధువు. 1992-95 మధ్యకాలంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు.
 
 రాక్‌గార్డెన్ సృష్టికర్త నేక్‌చంద్ మృతి
 ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రాక్‌గార్డెన్ సృష్టికర్త నేక్ చంద్(90) చండీగఢ్‌లో జూన్ 12న మరణించారు. సుఖ్నా సరస్సు సమీపంలో పగిలిపోయిన గాజు, పింగా ణీ, టైల్స్, ఇనుపముక్కలు వంటి వాటితో మనుషులు, దేవతా మూర్తులు, పశుపక్ష్యాదులను అద్భుతంగా సృష్టించారు. రెండు దశాబ్దాల తర్వాత 1975లో ఆ రాక్ గార్డెన్ వెలుగులోకి వచ్చింది. 1976లో దానికి ప్రారంభోత్సవం జరిగింది. నేక్ చంద్‌ను ప్రభుత్వం 1984లో పద్మశ్రీతో సత్కరించింది.
 
 రాష్ట్రీయం
 టీఎస్ ఐపాస్ అమలు  హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో‘తెలంగాణ పారిశ్రామిక విధానం-2015 (టీఎస్ ఐపాస్)’ను జూన్ 12న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆవిష్కరించారు. అవాంతరాలు, అవినీతి లేని రీతిలో, ప్లగ్ అండ్ ప్లే విధానంలో పారిశ్రామిక విధానం ఉంటుందని.. పైరవీలు చేస్తూ, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సులభంగా అనుమతులు ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. టీఎస్ ఐపాస్ బిల్లును గతేడాది నవంబర్ 27న అసెంబ్లీ ఆమోదించగా.. మార్గదర్శకాలకు ఈనెల 10న రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ విధానంలోని ప్రత్యేకతలు..వారంలో రెండు పర్యాయాలు దరఖాస్తులను పరిశీలించి, సంబంధిత శాఖల తరఫున అనుమతులు జారీచేస్తారు. పరిశ్రమల శాఖ కార్యదర్శి నేతృత్వంలోని రాష్ట్ర స్థాయి ఐపాస్ కమిటీ దరఖాస్తుల తీరుతెన్నులను పర్యవేక్షిస్తుంది.  రూ.5 కోట్ల కంటే తక్కువ పెట్టుబడులుండే పరిశ్రమలకు జీఎం, డీఐసీ నేతృత్వంలో జిల్లా స్థాయిలోనే అనుమతులు.  వివిధ ప్రభుత్వ శాఖలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సాధారణ దరఖాస్తు (సీఎఎఫ్) ద్వారా సింగిల్‌విండో పద్ధతిలో అనుమతులు.
 
 సద్గురు శ్రీశివానందమూర్తి మృతి
 ఆధ్యాత్మిక వేత్త, బోధకులు సద్గురు కందుకూరి శ్రీశివానందమూర్తి (87) వరంగల్‌లో జూన్ 10న మరణించారు. ఆయన ఆధ్యాత్మిక రంగంలో విశేష సేవలందించారు. ప్రజలను మేల్కొలిపే 500 పైగా వ్యాసాలు వివిధ పత్రికల్లో అందించారు. సంప్రదాయ సంగీతాన్ని ప్రోత్సహించేందుకు ఆంధ్ర మ్యూజిక్ అకాడమీని ఏర్పాటు చేశారు.
 
 పాలమూరు ప్రాజెక్టుకు శంకుస్థాపన
 పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు జూన్ 11న శంకుస్థాపన చేశారు. కృష్ణా నదిపై ఉన్న ఈ ప్రాజెక్టు ద్వారా 10 లక్షల ఎకరాలకు నీరందుతుంది. దీనికి రూ.35,200 కోట్లు ఖర్చు చేస్తారు. మహబూబ్‌నగర్‌లోని ఏడు లక్షల ఎకరాలు, రంగారెడ్డి జిల్లాలో 2.7 లక్షల ఎకరాలు, నల్గొండ జిల్లాలో 30,000 ఎకరాలకు నీటిపారుదల సౌకర్యం కలుగుతుంది. కృష్ణా నది నుంచి ఈ ప్రాజెక్టు కోసం 90 టీఎంసీల నీటిని వినియోగిస్తారు. ఇందులో 70 టీఎంసీల నీరు వ్యవసాయానికి, 20 టీఎంసీల నీరు హైదరాబాద్‌కు తాగునీటిని సరఫరా చేస్తారు.
 

మరిన్ని వార్తలు