ఏడాదికాలంగా తెలంగాణపై బాబు కుట్ర

18 Jun, 2015 00:00 IST|Sakshi

మంత్రి జగదీశ్‌రెడ్డి
 
 నల్లగొండ రూరల్ : ఏడాది కాలంగా ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు అనేక కుట్రలు చేశారని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం నల్లగొండలో టీఆర్‌ఎస్ నాయకుడు దుబ్బాక నర్సింహారెడ్డి నివాసంలో తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ ఎంపీటీసీలు, సర్పంచ్‌లు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యేలు వేముల వీరేశం, గాదరి కిషోర్‌లతో కలిసి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం మంత్రి మాట్లాడారు.

తెలంగాణకు చంద్రబాబు విద్యుత్ రాకుండా, ఉద్యోగాలు భర్తీ చేయకుండా పాలన సక్రమంగా జరుగకుండా, సంక్షేమ కార్యక్రమాలు అమలు కాకుండా చేశారని విమర్శించారు. పక్క రాష్ట్రం వారైన, పక్క జిల్లా వారైన వచ్చి మన ప్రాంతంలో నేరం చేసినా మన ప్రాంత ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లి నేరం చేసినా ఆయా ప్రాంతాలలో ఉన్న చట్టాల ప్రకారమే శిక్షలున్నట్లుగానే బాబు వ్యవహారంలో శిక్ష పడనుందని తెలిపారు. బాబు తవ్వుకున్న గోతిలోనే పడిపోయారని అన్నారు.

ఆంధ్రా ప్రజలు బాబుపై పెట్టుకున్న ఆశలన్ని ఆడియాశలు అయ్యాయని అన్నారు. అక్కడ ఇచ్చిన ఎన్నికల హామీలను ఏ ఒక్కటి అమలు చేయలేదని అన్నారు. సెక్షన్ 8తో ఎలాంటి సమస్య లేదని అన్నారు. ప్రపంచ దేశాల నుండి హైదరాబాదులో నివాసమున్న ఆంధా ప్రాంత ప్రజలు వున్న ఏ ఒక్క వ్యక్తికి ఎలాంటి సమస్య రాలేదనే సత్యం అందరికి తెలిసిందన్నారు. చేసిన తప్పును బయటపెట్టినందుకే బాబు మొత్తుకుంటున్నారని అన్నారు.  పార్టీలో చేరిన వారిలో కుంచమర్తి ఎంపీటీసీ మన్నె రేణుక, సర్పంచ్ లక్ష్మినర్సయ్య, కోడూరు ఎంపీటీసీ గుగులోతు మిర్యాల, తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు