రావడం.. పోవడం.. జీతాలు తీసుకోవడమేనా? | Sakshi
Sakshi News home page

రావడం.. పోవడం.. జీతాలు తీసుకోవడమేనా?

Published Thu, Jun 18 2015 12:00 AM

రావడం.. పోవడం.. జీతాలు తీసుకోవడమేనా?

రామచంద్రాపురం: ‘ఉద్యోగమంటే... కార్యాలయానికి రావడం.. కూర్చోవడం.. పోవడం.. జీతాలు తీసుకోవడమేనా?’ అని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి జీహెచ్‌ఎంసీ ఉపకమిషనర్ విజయలక్ష్మిని నిలదీశారు. బుధవారం ఆమె రామచంద్రాపురం పట్టణంలోని ఎల్‌ఐజీ, హెచ్‌ఐజీ, జ్యోతినగర్ కాలనీల్లో పర్యటించారు. నెల రోజుల క్రితం స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా వచ్చిన సమస్యలను అధికారులు ఎంతవరకు పరిష్కరించారో ఆరా తీశారు. ఒక సమస్య కూడా పరిష్కారానికి నోచుకోక పోవడంతో ఆమె విస్మయాన్ని వ్యక్తం చేశారు. నాటినుంచి నేటివరకు పారిశుద్ధ్య అధికారులు ఒక్కసారి కూడా తమ కాలనీకి రాలేదని స్థానికులు డిప్యూటీ స్పీకర్ దృష్టికి తీసుకువచ్చారు.
 
 వెంటనే స్పందించిన ఆమె జీహెచ్‌ఎంసీ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలనీల్లో ఎందుకు పర్యటించలేదంటూ ఉపకమిషనర్ విజయలక్ష్మిని ఆమె నిలదీశారు. ఆమె పొంతనలేని సమాధానం చెప్పడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. స్వయంగా సూచించిన సమస్యలనే పరిష్కరించక పోతే తాము ప్రజలకు ఏం సమాధానం చెప్పాలని ఆమె అధికారులను ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ అధికారుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని, ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ముందుకు పోతున్న తరుణంలో ఇక్కడ అధికారులు ప్రజా సమస్యలను పట్టించుకోక పోవడం, స్వయంగా వచ్చి సమస్యను చెప్పినా వాటిపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైంది కాదన్నారు.
 
  స్వయంగా సీఎం క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ చెత్తను ఎత్తి వేస్తుంటే జీహెచ్‌ఎంసీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవ హరించడం సరికాదన్నారు. ఇప్పటికైనా అధికారులు తమ పనితీరును మార్చుకోక పోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎమ్మెల్యే మహీపాల్‌రెడ్డి మాట్లాడూతూ.. పనిచేయని అధికారులకు ప్రజలే సరైన గుణపాఠం నేర్పుతారని తెలిపారు. తమ పరిధిలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని, పెద్ద సమస్యలుంటే సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చొరవ తీసుకుంటామన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement