ఫెలోషిప్‌లు, స్కాలర్‌షిప్‌లు, రీసెర్చ్ అవార్డు

7 May, 2015 03:38 IST|Sakshi

యూజీసీ
 
 పీజీ మెరిట్ స్కాలర్‌షిప్ ఫర్  యూనివర్సిటీ ర్యాంకు హోల్డర్
 లక్ష్యం: ప్రతిభ కలిగిన విద్యార్థులకు ప్రోత్సాహం. డిగ్రీ స్థాయిలో అసాధారణ ప్రతిభ కనబరచిన విద్యార్థులకు ఉన్నత విద్యావకా శాన్ని కల్పించడం. సంప్రదాయ కోర్సులు చదివే అభ్యర్థులకు ప్రోత్సహం.  అర్హత: అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో మొదటి లేదా రెండో ర్యాంకు సాధించి ఉండాలి. పీజీ కోర్సులో చేరి ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వారి మెరిట్ సర్టిఫికెట్లను, పీజీలో ప్రవేశం పొందినట్లుగా రుజువులు సమర్పించాల్సి ఉంటుంది. యూజీ స్థాయిలో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. పీజీ మొదటి సంవత్సరం విద్యార్థులు మాత్రమే అర్హులు. దూరవిద్య ద్వారా పీజీలో ప్రవేశం పొందిన విద్యార్థులు అనర్హులు. స్కాలర్‌షిప్‌ల సంఖ్య 3,000. దీని కాలపరిమితి రెండేళ్లు. దించే మొత్తం: నెలకు రూ.3,100 దరఖాస్తుకు చివరితేదీ: ఆగస్టు 30, 2015.
 
 పీజీ స్కాలర్‌షిప్స్ ఫర్ ప్రొఫెషనల్ కోర్సెస్ (ఎస్సీ/ఎస్టీ)
 లక్ష్యం: ఎస్సీ/ఎస్టీ విద్యార్థులు గుర్తింపు పొందిన భారతీయ యూనివర్సిటీలు/ఇన్‌స్టిట్యూట్‌లు/కాలేజీల్లో ప్రొఫెషనల్ కోర్సులు చదివేందుకు ప్రోత్సాహం.అర్హత: పీజీ చేయాలనుకున్న సబ్జెక్టులో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. రెగ్యులర్ విధానంలో ప్రొఫెషనల్ సబ్జెక్టులో చదవడానికి ప్రవేశం పొంది ఉండాలి. దూరవిద్య ద్వారా ప్రవేశం పొందినవారు అనర్హులు. పురుషులకు గరిష్ట వయోపరిమితి 45 ఏళ్లు; మహిళలకు 50 ఏళ్లు.అందించే మొత్తం: స్కాలర్‌షిప్‌ల సంఖ్య 1000; ఎంఈ/ ఎంటెక్ కోర్సుకు నెలకు రూ.7,800, ఇతర కోర్సులకు నెలకు రూ.4,700. అభ్యర్థి ఎంపిక చేసుకున్న కోర్సును బట్టి స్కాలర్‌షిప్ కాలపరిమితి ఉంటుంది.
 పరిశోధనలు చేసే వారికి ఫెలోషిప్ మొత్తంతో పాటు కంటింజెన్సీ (ఆకస్మిక ఖర్చుల కోసం) చెల్లిస్తారు. అవసరాన్ని బట్టి ఎస్కార్ట్స్/రీడర్ అసిస్టెన్స్‌కు కొంత మొత్తం ఇస్తారు. పరిశోధనల కోసం చేసే పర్యటనలకు నిబంధనల మేరకు అలవెన్సులు చెల్లిస్తారు. ప్రతిభ ఆధారంగా ఫెలోషిప్‌లు, స్కాలర్‌షిప్‌లు, రీసెర్చ్ అవార్డుకు ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు చివరితేదీ: మే 31, 2015.
 
 ఇందిరా గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్ ఫర్ సింగిల్ గర్ల్ చైల్డ్
 లక్ష్యం: మహిళల చదువుకు ప్రాధాన్యమిస్తూ సాధికారత దిశగా అడుగులు వేసేందుకు అవకాశం కల్పించడం. నాన్-ప్రొఫెషనల్ కోర్సులు చదివేందుకు వీలు కల్పించడం.అర్హత: అభ్యర్థి.. ఇంట్లో ఏకైక సంతానమై ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేందుకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ/కాలేజీలో ప్రవేశం పొంది ఉండాలి. పీజీ మొదటి సంవత్సర విద్యార్థులు మాత్రమే అర్హులు. దూరవిద్య ద్వారా పీజీ కోర్సులో ప్రవేశం పొందినవారు అనర్హులు. వయసు: యూనివర్సిటీ/కాలేజీలో ప్రవేశం పొందే నాటికి 30 ఏళ్లు నిండకూడదు. స్కాలర్‌షిప్ మొత్తం: నెలకు రూ. 3,100 చెల్లిస్తారు.దరఖాస్తుకు చివరితేదీ: ఆగస్టు 30, 2015.
 
 స్వామి వివేకానంద సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్
 లక్ష్యం: తమ తల్లిదండ్రులకు ఏకైక సంతానమై ఉన్న అమ్మాయిలను పరిశోధనలపైపు నడపటం. అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీలో పూర్తిస్థాయి రెగ్యులర్ పీహెచ్‌డీ కోర్సులో చేరి ఉండాలి. జనరల్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 40 ఏళ్లు. రిజర్వ్‌డ్ అభ్యర్థులకు 45 ఏళ్లు.అందించే మొత్తం: మొదటి రెండేళ్లు నెలకు రూ.12,400; మూడు, నాలుగో సంవత్సంలో నెలకు రూ.15,500 చొప్పున అందుతుంది.దరఖాస్తుకు చివరి తేదీ: మే 31, 2015.
 
 రాజీవ్ గాంధీ నేషనల్ ఫెలోషిప్ (పీహెచ్‌సీ)
 లక్ష్యం: ఈ ఫెలోషిప్‌ను 2012-13 ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టారు. వికలాంగులకు ఎంఫిల్, పీహెచ్‌డీ వంటి ఉన్నత విద్యావకాశాల దిశగా ప్రోత్సహించడం ఈ ఫెలోషిప్ లక్ష్యం.అర్హత: ఎంఫిల్ లేదా పీహెచ్‌డీలో ప్రవేశం లభించాలి. మొదట జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్‌ఎఫ్) అందిస్తారు. రెండేళ్ల తర్వాత పరిశోధనలపై సంతృప్తి చెందితే మూడేళ్ల పాటు అందే సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (ఎస్‌ఆర్‌ఎఫ్)కు ఎంపిక చేస్తారు. పరిశోధన సాగుతున్న తీరును యూనివర్సిటీ నియమించిన త్రిసభ్య కమిటీ మదిస్తుంది. మొదటి రెండేళ్ల కాలంలో పరిశోధన సరిగా సాగకపోతే జేఆర్‌ఎఫ్‌ను రద్దు చేస్తారు.ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 30, 2015.
 
 నేషనల్ ఫెలోషిప్ (ఓబీసీ అభ్యర్థులు)
 లక్ష్యం: ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ)కు చెందిన విద్యార్థులను పరిశోధన కార్యకలాపాల్లో పాల్గొనేలా చేయడం. సెన్సైస్, హ్యుమానిటీస్, సోషల్ సెన్సైస్, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విభాగాల్లో ఎంఫిల్ లేదా పీహెచ్‌డీ చేసేందుకు ఈ ఫెలోషిప్ ద్వారా ప్రోత్సాహం లభిస్తుంది. మొత్తం ఫెలోషిప్‌లు 300. అర్హత: పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. లబ్ధిదారులు/తల్లిదండ్రుల ఆదాయం సంవత్సరానికి రూ.ఆరు లక్షలకు దాటకూడదు. ఎంఫిల్/పీహెచ్‌డీ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి.ఫెలోషిప్ మొత్తం: తొలుత రెండేళ్ల పాటు జేఆర్‌ఎఫ్ ఇస్తారు. తర్వాత పరిశోధన క్రమాన్ని ప్రత్యేక కమిటీ అధ్యయనం చేస్తుంది. కమిటీ సంతృప్తి చెందితే మరో మూడేళ్ల పాటు సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఇస్తారు. జేఆర్‌ఎఫ్ కింద నెలకు రూ.25 వేలు, ఎస్‌ఆర్‌ఎఫ్ కింద రూ.28 వేలు చెల్లిస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 30, 2015.

 మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్ (మైనార్టీ విద్యార్థులు)
 లక్ష్యం: మైనార్టీ వర్గాలకు చెందిన విద్యార్థులను ఎంఫిల్, పీహెచ్‌డీ దిశగా ప్రోత్సహించడం. వారిని పరిశోధనల దిశగా వెళ్లేలా చేయడం.షిప్ మొత్తం: ఎంఫిల్‌లో చేరితే గరిష్టంగా రెండేళ్ల పాటు జేఆర్‌ఎఫ్ (నెలకు రూ.25 వేలు) ఇస్తారు. ఎంఫిల్+పీహెచ్‌డీ అయితే ఐదేళ్ల పాటు మొదటి రెండేళ్లు జేఆర్‌ఎఫ్, తర్వాతి మూడేళ్లు ఎస్‌ఆర్‌ఎఫ్ (నెలకు రూ.28 వేలు) ఇస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 30, 2015.
 
 ఎమిరటస్ ఫెలోషిప్
 లక్ష్యం: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చట్టం ప్రకారం గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో పనిచేసిన ఉపాధ్యాయులు వారివారి స్పెషలైజేషన్లలో క్రియాశీలక పరిశోధనలు చేసేలా ప్రోత్సహించడం.ఉన్నత విద్యా అర్హతలు, అనుభవం కలిగిన పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులు; మరో ఆర్నెల్లలో పదవీ విరమణ పొందనున్న వారిని పరిశోధనల దిశగా ప్రోత్సహించడం.అర్హత: ఇది అభ్యర్థి పరిశోధనల ప్రాధాన్యతపై ఆధారపడి ఫెలోషిప్ మొత్తం: సైన్స్ విభాగానికి 100; హ్యుమానిటీస్, సోషల్ సెన్సైస్, భాషలకు 100 ఫెలోషిప్‌లు ఉంటాయి. ఫెలోషిప్ కింద నెలకు రూ.31 వేలు చొప్పున రెండేళ్ల (2015-17) పాటు చెల్లిస్తారు.ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మే 31, 2015.
 
 రీసెర్చ్ అవార్డు
 లక్ష్యం: విశ్వవిద్యాలయాలు, సంస్థల్లో పనిచేస్తున్న ప్రతిభావంతులైన ఉపాధ్యాయులను ఆయా రంగాల్లో పరిశోధనల దిశగా ప్రోత్సహించడం.అర్హత: డాక్టొరేట్ డిగ్రీ పూర్తిచేసి, వారివారి రంగాల్లో మంచి ప్రతిభ కనబరిచే టీచర్లు అర్హులు. శాశ్వత ప్రాతిపదికన గుర్తింపు పొందిన సంస్థల్లో పనిచేస్తున్న లెక్చరర్లు, సెలక్షన్ గ్రేడ్ లెక్చరర్లు, రీడర్లు, ప్రొఫెసర్లు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 45 ఏళ్ల లోపు ఉండాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ (నాన్ క్రిమీలేయర్), పీహెచ్, మైనార్టీలకు గరిష్ట వయో పరిమితి 50 ఏళ్లు.ఆర్థిక సహకారం: మొత్తం వంద మందికి ఆర్థిక సహకారం అందిస్తారు. అభ్యర్థి వేతనం, కొన్ని భత్యాలను అతను లేదా ఆమె పనిచేస్తున్న సంస్థకు తిరిగి చెల్లిస్తారు. పరిశోధన గ్రాంటు రూపంలో హ్యుమానిటీస్, సోషల్‌సైన్స్ అభ్యర్థులకు రూ. 2 లక్షలు; సైన్స్/నేచురల్‌సైన్స్/ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అభ్యర్థులకు రూ. 3 లక్షలు ఇస్తారు.ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మే 31, 2015.
 డా.ఎస్.రాధాకృష్ణన్ పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్
 
 లక్ష్యం: హ్యుమానిటీస్, సోషల్ సెన్సైస్, లాంగ్వేజెస్‌లలో ఉన్నత విద్య, పూర్తికాల పరిశోధనలకు ప్రోత్సాహం. మొత్తం ఫెలోషిప్‌లు 200. అర్హత: డాక్టొరేట్ డిగ్రీ. జనరల్ అభ్యర్థులకు యూజీలో 55 శాతం మార్కులు, పీజీలో 60 శాతం మార్కులు. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్, ఓబీసీ అభ్యర్థులకు యూజీలో 50 శాతం మార్కులు, పీజీలో 55 శాతం మార్కులు. వయసు 35 ఏళ్ల లోపుండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళలకు గరిష్ట వయోపరిమితి 40 ఏళ్లు. ఫెలోషిప్ మొత్తం: మొదటి ఏడాదిలో నెలకు రూ. 38,800; రెండో సంవత్సరంలో నెలకు రూ.40,300; మూడో సంవత్సరంలో నెలకు రూ. 41,900 చొప్పున చెల్లిస్తారు.దరఖాస్తుకు చివరి తేదీ: మే 31, 2015.
 
 పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్- మహిళలు
 లక్ష్యం: సైన్స్, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, హ్యుమానిటీస్, సోషల్ సైన్స్‌ల్లో ఉన్నత విద్య, పరిశోధనలకు ప్రోత్సాహం. మొత్తం ఫెలోషిప్‌లు 100.అర్హత: వయసు జులై 1 నాటికి 55 ఏళ్లు దాటకూడదు. రిజర్వ్‌డ్/మైనార్టీ అభ్యర్థులకు 60 ఏళ్లు. యూజీలో 55 శాతం మార్కులు, పీజీలో 60 శాతం మార్కులుండాలి. రిజర్వ్‌డ్ అభ్యర్థులకు యూజీలో 50 శాతం మార్కులు, పీజీలో 55 శాతం మార్కులుండాలి. పీహెచ్‌డీ పూర్తిచేసిన నిరుద్యోగ మహిళలు మాత్రమే అర్హులు.అందించే మొత్తం: ఐదేళ్ల పాటు ఫెలోషిప్ మొత్తం అందుతుంది. మొదటి ఏడాది నెలకు రూ.18 వేలు చెల్లిస్తారు. రెండేళ్ల తర్వాత నెలకు రూ.20 వేలు ఇస్తారు. ఫ్రెషర్స్‌కు నెలకు రూ.38,800, పరిశోధన అనుభవం ఉన్నవారికి రూ.46,500 చెల్లిస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మే 31, 2015.
 
 పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్-ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు
 లక్ష్యం: సైన్స్, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, హ్యుమానిటీస్, సోషల్ సెన్సైస్‌లో పరిశోధనలకు  ప్రోత్సాహం. మొత్తం ఫెలోషిప్‌లు 100. అర్హత: డాక్టరేట్ ఉండాలి. జులై 1 నాటికి గరిష్ట వయోపరిమితి పురుషులకు 50 ఏళ్లు, మహిళలకు 55 ఏళ్లు.అందించే మొత్తం: ఐదేళ్ల పాటు ఫెలోషిప్ ఇస్తారు. మొదటి రెండేళ్లు నెలకు రూ.38,800, తర్వాత నెలకు రూ.46,500.దరఖాస్తుకు చివరి తేదీ: మే 31, 2015.
 

మరిన్ని వార్తలు