బెర్తులు బేఫికర్

23 Mar, 2014 23:32 IST|Sakshi
బెర్తులు బేఫికర్

సాక్షి, సంగారెడ్డి:
సిట్టింగ్ లోక్‌సభ సభ్యులనే పార్టీ తరఫున బరిలో దింపాలని కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపుతోంది. పాత రేసు గుర్రాలతోనే పందెం నెగ్గాలని యోచిస్తోంది. మెదక్ నుంచి విజయశాంతి, జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కార్‌ల అభ్యర్థిత్వాన్ని పార్టీ నాయకత్వం దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం.
 
 ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ ‘వార్ రూం’లో సమావేశమై అభ్యర్థుల ఎంపికపై కసరత్తు నిర్వహిస్తోంది. ఒక్కో నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎంపీలతో పాటు వారికి ప్రత్యామ్నాయంగా ఇతర అభ్యర్థుల పేర్లను సూచిస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీ సీసీ), గాంధీభవన్, జిల్లా కాంగ్రెస్ కమిటీ(డీసీసీ)లు స్క్రీనింగ్ కమిటీకి ఇప్పటికే ప్రతిపాదనలు సమర్పించి ఉన్నాయి.
 
‘వార్ రూం’ భేటీలో మెదక్, జహీరాబాద్ లోక్‌సభల నుంచి మళ్లీ సిట్టింగ్ అభ్యర్థులనే బరిలో దింపాలని నిర్ణయించినట్లు చర్చ జరుగుతోంది. ప్రత్యామ్నాయ అభ్యర్థులతో పోలిస్తే సిట్టింగ్ లోక్‌సభ సభ్యులే ధీటైన పోటీ ఇస్తారనే భావనను పార్టీ నాయకత్వం వెల్లడించినట్లు సమాచారం.  తెలంగాణ ప్రాంత లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసే తమ పార్టీ అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ అధిష్టానం త్వరలోనే ప్రకటించనుందని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
 
 రాములమ్మ ధీటైన అభ్యర్థి
 ఆరునూరైన మెదక్ లోక్‌సభ స్థానం నుంచే పోటీ చేస్తానని ఎంపీ విజయశాంతి మంకుపట్టు పడుతున్నారు. ఆమెకే టికెట్ కేటాయించాలని టీపీసీసీ ప్రతిపాదిస్తే.. ఆర్ మోహన్ నాయక్, సోమేశ్వర్ రెడ్డి, రాపోలు విజయభాస్కర్, ఉమాదేవిల పేర్లను గాంధీభవన్ సిఫారసు చేసింది. ఇక్కడి నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నవారిలో విజయశాంతి ధీటైన అభ్యర్థిగా అధిష్టానం భావిస్తోంది. రేసులో ముందుంజలో ఉండటంతో ఆమెకు టికెట్ ఖాయమని చర్చ జరుగుతోంది.
 
 2009 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి చాగండ్ల నారేంద్రనాథ్‌పై 6077 ఓట్ల మెజారిటీతో ఆమె విజయం సాధించారు. ప్రారంభంలో టీఆర్‌ఎస్ ముఖ్యనేతల్లో ఒకరిగా చక్రం తిప్పిన రాములమ్మ.. పార్టీ అధినేత కేసీఆర్‌తో చెల్లమ్మ అని అనిపించున్నారు. ఈసారి ఎన్నికల్లో మెదక్ లోక్‌సభ స్థానం నుంచి విజయశాంతికి బదులు స్వయంగా కేసీఆర్ పోటీ చేస్తారని ప్రచారం సాగింది.
 
 దీని పర్యావసానాల నేపథ్యంలో ఆమె టీఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ కావడం.. ఆ కొంత కాలానికి కాంగ్రెస్‌లో చేరారు. దీంతో కాంగ్రెస్ తరఫున మళ్లీ టికెట్ ఆశించిన చాగండ్ల నరేంద్రనాథ్ పార్టీని వీడి బీజేపీలో తీర్థం పుచ్చుకున్నారు. గడిచిన ఏడాది కాలంలో మెదక్ లోక్‌సభ స్థానం ఈ ఆసక్తికర పరిణామాలను చవిచూసింది. ఒక వేళ టీఆర్‌ఎస్ తరఫున మెదక్ లోక్‌సభ నుంచి కేసీఆర్ బరిలోకి దిగితే ఆయనకు, విజయశాంతికి మధ్య ఆసక్తికరమైన పోరు జరిగే సూచనలున్నాయి.
 
 సురేష్‌కు లైన్ క్లియర్
 జహీరాబాద్ లోక్‌సభ స్థానం టికెట్టు కోసం సిట్టింగ్ ఎంపీ సురేష్ షెట్కార్, నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి  సుదర్శన్ రెడ్డి, డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ ఎం. జైపాల్‌రెడ్డిల పేర్లను కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తోంది.  సుదర్శన్‌రెడ్డి, ఎం. జైపాల్‌రెడ్డిల పేర్లను టీపీసీసీ ప్రతిపాదిస్తే డీసీసీ మాత్రం సురేష్ షెట్కార్ పేరునే ప్రతిపాదించింది.
 
 ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ సైతం సురేష్ షెట్కార్ పేరునే బలపర్చినట్లు పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. స్వాతంత్ర సమరయోధులు, నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే శివరావు షెట్కార్  కుమారుడు సురేష్ షెట్కార్  1994లో నారాయణఖేడ్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు.
 
ఆసమయంలో ప్రస్తుత ఎమ్మెల్యే పి.కిష్టారెడ్డి ఇండిపెండెంట్‌గా పోటీ చేయడంతో టీడీపీ అభ్యర్థి ఎం.విజయ్‌పాల్‌రెడ్డికి  విజయం వరించింది. సురేష్ షెట్కార్ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా, డీసీసీ అధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీలో పదవులు చేపట్టారు. 2004లో తిరిగి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు.
 
  సీట్ల సర్థుబాటులో భాగంగా 2009లో సురేష్ షెట్కార్ జహీరాబాద్ లోక్‌సభకు మారాల్సి వచ్చింది.  నారాయణఖేడ్ అసెంబ్లీ నుంచి పి.కిష్టారెడ్డి, జహీరాబాద్ లోక్‌సభ నుంచి సురేష్ షెట్కార్‌లు కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచారు. ఆనాడు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన ఈ సర్దుబాటును మళ్లీ కొనసాగించాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది.

మరిన్ని వార్తలు